Sunday, January 19, 2025

కర్నాటక హైకోర్టు సిజెకు హిజాబ్ కేసు నివేదన..

- Advertisement -
- Advertisement -

Hijab Issue: Karnataka HC refers petitions to larger bench

కర్నాటక హైకోర్టు సిజెకు హిజాబ్ కేసు నివేదన
విచారణ కోసం విస్తృత ధర్మాసనం?
రాజ్యాంగపరమైన అంశాలు ఉన్నాయన్న సింగిల్ జడ్జి

బెంగళూరు: కర్నాటకలోని పాఠశాల-కళాశాల క్యాంపస్‌లలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న కర్నాటక హైకోర్టుకు చెందిన సింగిల్ జడ్జి ఈ కేసును విస్తృత ధర్మాసనానికి అప్పగించే అంశాన్ని పరిశీలించేందుకు ప్రధాన న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్తికి మంగళవారం నివేదించారు. ఈ పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ ఈ అంశంలో పర్సనల్ లాకు సంబంధించిన అంశాలు ఉన్నందున ఇవి రాజ్యాంగపరమైన ప్రశ్నలు లేవనెత్తే అవకాశాలు ఉండడంతో ఈ కేసు విచారణ కోసం విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించేందుకు దీన్ని ప్రధాన న్యాయమూర్తికి నివేదించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

తన విచక్షణాధికారాలను ఉపయోగించి ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసే విస్తృత ధర్మాసనం ఎదుటే మధ్యంతర ఉపశమనానికి సంబంధించిన అభ్యర్థలను కూడా నివేదించాలని జస్టిస్ దీక్షిత్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ముస్లిం విద్యార్థినులు హిజాబ్(తలను కప్పిఉంచే వస్త్రం) ధరించడాన్ని వ్యతిరేకిస్తూ, సమర్థిస్తూ కర్నాటక వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు మిన్నంటడంతో మంగళవారం రాష్ట్రంలోని అఏక చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. హిజాబ్ ధరించి కళాశాలలకు రావడాన్ని నిషేధించడాన్ని సవాలు చేస్తూ ఉడుపి జిల్లాలోని కొన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన ముస్లిం విద్యార్థినులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
బెంగళూరులో నిషేధాజ్ఞలు
కర్నాటకలో హిజాబ్ వివాదం హింసాత్మకంగా మారడంతో బెంగళూరులో రెండు వారాల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ నెల 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. విద్యా సంస్థలు ఉన్న ప్రదేశాలకు 200 మీటర్ల పరిధిలో ఎటువంటి సమావేశాలు కాని నిరసన ప్రదర్శనలు కాని చేపట్టకూడదని అధికారులు తెలిపారు.

Hijab Issue: Karnataka HC refers petitions to larger bench

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News