Wednesday, January 22, 2025

పోలీస్‌స్టేషన్‌లోనే పొట్టుపొట్టు కొట్టుకున్న హిజ్రాలు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : ఆర్ధిక, భూవివాదాల్లో గొడవలు జరగుతుంటాయి.. ఈ గొడవల గురించి సమాచారం అందుకొని, పోలీసులు వస్తే, భయంతో అంతా పారిపోతారు. కాని, వీరుమాత్రం ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే వీరంగం సృష్టించారు. వారి దెబ్బకు ఏకంగా పోలీసులే హడలిపోయారు. మంగళవారం హిజ్రాలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు. వారిలో వారే తీవ్ర ఘర్షణ పడ్డారు. కారం, రాళ్ళు, చెప్పులతో ఒకరిపై మరొకరు విరుకుపడ్డారు.

వీరి పోరు చిన్నపాటి రణరంగాన్ని తలపించింది. హిజ్రాల గ్రూపు వార్‌తో పోలీసులు హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని నందిని, బాలమ్మ రెండు వర్గాలుగా హిజ్రాలు ఉన్నారు. వీరిమధ్య దుకాణల వద్ద డబ్బులు వసూలు చేసే విషయంలో చిన్నచిన్న గొడవలు జరుగుతుండేవి. నందిన గ్రూపులోని గంగభవాని అనే హిజ్రా 15రోజుల క్రితం బాలమ్మ గ్రూపులోకి వెళ్లింది.

అప్పటి నుంచి ఆర్ధిక లావాదేవీల విషయంలో హిజ్రాల మధ్య వివాదం ముదిరింది. తమ అనుమతి లేకుండా తమ సభ్యురాలిని ఎలా చేర్చుకున్నారంటూ, బాలమ్మ గ్రూ పుపై నందిని గ్రూపు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో రెండు వర్గాల హిజ్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. అందరినీ కూర్చోవాలని చెప్పి, ఎస్సై బయటికి వెళ్లాడు. ఈ గ్యాప్‌లోనే రెండు వర్గాల హిజ్రాలు పోలీస్ స్టేషన్ ఆవరణలో కొట్లాటకు దిగారు. తీ వ్ర ఘర్షణలో కారం, రాళ్లు, చెప్పులు రువ్వుకున్నారు. హిజ్రాల దాడులతో పోలీస్ స్టేషన్ ఆవరణం రణరంగంగా మారింది.

వీరి కొట్లాట చూసి, పోలీసులే హడలెత్తిపోయారు. ఖాకీల కళ్లముందే హిజ్రాలు సిగపట్లు, కొట్లాటతో పోలీస్ స్టేషన్ హోరెత్తింది. అయితే కాసేపటికి తేరుకున్న పోలీసులు హిజ్రాలను చెదరగొట్టారు. హిజ్రాల ఘర్షణను వారించబోయిన లేడీ హోంగార్డుకు గాయాలయ్యాయి. కాగా, పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమపై నందిని వర్గం హిజ్రాలు దేవరకొండ, సూర్యపేట నుండి కొంతమంది మగవారిని తీసుకొచ్చి దాడి చేయించారని గంగాభవాని అనే హిజ్రా ఆరోపిస్తుంది. హిజ్రాల వీరంగంపై ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఆర్ధిక లావాదేవీల విషయంలో హిజ్రాల మధ్య ముదిరిన వివాదమే ఈ ఘర్షణకు కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News