అభివృద్ధి తొండ ముదిరి ఊసరవెల్లి అయితే ఏమవుతుందో హిమాచల్‌ప్రదేశ్‌లో అదే జరిగింది. గత జూన్ 24న ప్రారంభమైన తొలకరి వానలు వరదలై రోడ్ల మీది నుంచి భవనాలపై నుంచి ప్రవహించిన జలప్రళయమై హిమాచల్‌లో 224 మందిని కబళించింది. 38 మంది ఆచూకీ లేకుండా పోయారని వార్తలు చెబుతున్నాయి. గత 50 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా 60 గం. పాటు నిర్విరామంగా వర్షం కురిసిందంటే ఆ రాష్ట్రం ఏమైపోయి వుండాలో ఊహకందని విషయం. రోడ్లు వెడల్పు చేయడం, నాలుగు లేన్ల రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇటీవలి కాలంలో చోటు చేసుకొన్న ప్రాంతాల్లోనే ఈ బీభత్సం తాండవించినట్టు బోధపడుతున్నది. నేలగుల్లబారడం వంటి పర్యవసానాల మూలంగా మహా మహా భవనాలు కూలిపోయాయి. మండీలోని 16వ శతాబ్దం నాటి పంచవక్త్ర ఆలయం నీట మునిగిపోయింది. కాని దెబ్బతినకుండా సురక్షితంగా బయటపడింది. అదే సమయంలో వందేళ్ళ నాటి పండో బ్రిడ్జి కొట్టుకుపోయింది.
కులూ నదిపై నిర్మించిన వంతెన కూలిపోయింది. యాత్రీకులు తరచూ సందర్శించే మనాలి వరద బీభత్సానికి దారుణంగా దొరికిపోయింది. శ్మశానం లాగా మారిపోయింది. జులై 7 నుంచి 11 వరకు 294.6 మి.మీ వర్షం కురిసింది. ఒక ఏడాదిలో అక్కడ కురిసే మొత్తం తొలకరి వర్షాల్లో ఇది 30%. అపూర్వమైన వరదల వల్ల కొండచరియలు కూలిపోయి విపరీతమైన ప్రాణ నష్టం సంభవించింది. ఇదంతా మానవ తప్పిదం వల్ల సంభవించిన ప్రళయమేనని ఒక మాజీ మునిసిపల్ అధికారి చెప్పారు. రాష్ట్రం ప్రకృతి వైపరీత్యానికి తుడిచిపెట్టుకుపోయిందని, కనీసం రూ. 10 వేల కోట్ల మేరకు నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి సుఖ విందర్ సింగ్ సుఖు ప్రకటించారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణ సహాయంగా రూ. 2000 కోట్లు ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ హయాంలో వుండడం దాని దురదృష్టం అనుకోవాలి. కేంద్రం జాతీయ విపత్తు నిధి నుంచి కేవలం రూ. 260 కోట్లు మాత్రమే విదిలించింది. కులూ మనాలి నుంచి లేహ్‌కు వెళ్ళే రోడ్డు కొట్టుకుపోయింది.
కొండలను తొలిచి కొత్త మార్గం వేయడానికి కొన్ని నెలలు పడుతుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కులూలో బస చేసి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించడం వల్ల చండీగఢ్ మనాలి జాతీయ రహదారిని తాత్కాలికంగా పునరుద్ధరించగలిగారు. చండీగఢ్ సిమ్లా జాతీయ రహదారి దారుణంగా దెబ్బతినిపోయింది. భారీ కొండచరియలు విరిగిపడడం, రాళ్ళు దొర్లిపోడం వల్ల ఈ రోడ్డు చాలా సన్నబడిపోయి వాహనాల రాకపోకలకు అత్యంత ఇబ్బందికరంగా మారింది. విద్యుత్తు లైన్లు తెగిపడి సరఫరా ఆగిపోయింది. ఇంకా 1000 రోడ్లు మూతబడి వున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంత జరిగిన తర్వాత ఇప్పటికీ భారీ వర్షాల నుంచి హిమాచల్ ప్రదేశ్ కు రక్షణ కనిపించడం లేదు. ఈ నెల 22 నుంచి 24 వరకు భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. వర్షాలు 26 వరకు నిరంతరాయంగా కురిసే ప్రమాదం వున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే కొద్దీ మరింతగా కొండచరియలు విరుచుకుపడతాయి, ప్రాణాపాయం పెరిగిపోతుంది. ఒక సమాచారం ప్రకారం ఈ వరదల్లో కొట్టుకుపోయిన చాలా మంది తమ దగ్గరి బంధువులకు ఆచూకీ తెలియకుండాపోయారు.
వారి కోసం జరుపుతున్న గాలింపులు వ్యర్థమవుతున్నాయి. ఒకే కుటుంబంలోని సభ్యుల మధ్య ఎడబాటు హృదయవిదారకమైనది. వారు మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారో, ఎలా కలుసుకుంటారో, అసలు కలుసుకుంటారో లేదో చెప్పశక్యం కాదు. గత 13 తేదీ నుంచే 78 మంది మరణించారంటే అక్కడ సంభవించింది ఎంతటి బీభత్సమైన ప్రకృతి వైపరీత్యమో చెప్పనక్కర లేదు. ఉత్తరాఖండ్‌లో కూడా జల విద్యుత్తు కర్మాగారాల నిర్మాణం చాలా నష్టం కలిగించింది. అభివృద్ధి పేరుతో హద్దులు మీరి సొమ్ము చేసుకోదలుచుకొన్న వారు ఎంతటి మానవ ప్రళయాన్ని సృష్టించడానికైనా వెనుకాడరు. అవినీతిపరులైన ప్రభుత్వ అధికారులు, అధినేతలు విచక్షణ రహితంగా అనుమతులు జారీ చేసి చేతులు దులుపుకొంటారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన ఒక బిల్లు కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పేరిట విధ్వంసం తలపెట్టేవారు ఏ మాత్రం జవాబుదారీ కానవసరం లేకుండా అభయ హస్తం చాస్తున్నది.
మానవుడు తన పాదాల కింద తానే అంతం కావాలనుకొంటే ఎవరూ, ఏమీ చేయలేరు. పరిహారంగా వేరే చోట స్థలం ఇవ్వవలసిన అవసరం లేకుండా చేస్తున్నది. అభివృద్ధి కృషికి మానవ ముఖాన్ని తొడగడం ఇప్పట్లో జరిగే పని కాదనే ఊహే గుండెల్లో రైళ్ళను పరుగెత్తిస్తుంది.