హిమాచల్ ప్రదేశ్ ముప్పును జాతీయ విపత్తుగా ప్రకటించాలి
ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి సుఖు వినతి
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల భారీ వర్షాలకు సంభవించిన పెను ముప్పును జాతీయ విపత్తుగా గుర్తించి ప్రత్యేక పునరావాస సహాయం అందించాలని ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సింగ్ సుఖు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. జీ20 సదస్సు సందర్భంగా శనివారం రాష్ట్రపతి ముర్ము అందించిన ఆతిధ్యానికి విచ్చేసిన సుఖ్‌వీందర్ సింగ్ ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించారు.
రుతుపవనాల సందర్భంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల రాష్ట్రానికి అపార నష్టం సంభవించిందని, 400 మంది ప్రాణాలు కోల్పోయారని, 13,000 ఇళ్లు దెబ్బతిన్నాయని, వేలాది మంది నిర్వాసితులయ్యారని మొత్తం మీద రాష్ట్రానికి రూ.12, 000 కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రధానికి వివరించారు. ఈమేరకు రాష్ట్రాన్ని తిరిగి పునరుద్ధరించుకోడానికి కేంద్రం ఇతోధికంగా ఆర్థిక సాయం అందించాలని కోరారు. భుజ్, కేదార్‌నాథ్ విపత్తుల్లో ఏ విధంగా కేంద్రం ఆదుకుందో అదే రీతిలో హిమాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక పునరావాస ప్యాకేజీ అందించాలని ముఖ్యమంత్రి కోరగా, ఈ డిమాండ్లన్నీ ఆలోచిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.