భోపాల్ : కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ‘ప్రభుత్వాలను కూల్చే కాంట్రాక్ట్ తీసుకున్న’ వారు సృష్టించినదే అని కాంగ్రెస్ వెటరన్ నేత దిగ్విజయ్ సింగ్ బిజెపిని దృష్టిలో పెట్టుకుని ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్ మధ్య ప్రదేశ్‌లోని మొరేనాలో విలేకరులతో మాట్లాడుతూ, హిమాచల్‌లో కాంగ్రెస్ తిరుగుబాటుదారులపై తగిన సమయంలో చర్య తీసుకోనున్నట్లు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏకైక రాజ్యసభ సీటు కోసం క్రితం వారం జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు ఆరుగురు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు వోటు వేయడం ఆ సంక్షోభానికి తెర తీసింది. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై వోటింగ్ సమయంలో పార్టీ విప్‌ను ధిక్కరించినంపదకు
ఆ ఆరుగురు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా గురువారం అనర్హులుగా ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లో తిరుగుబాటుదారులపై కాంగ్రెస్ ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించగా, ‘(తగిన) సమయం వచ్చినప్పుడు అది (చర్య) జరుగుతుంది’ అని దిగ్విజయ్ సమాధానం ఇచ్చారు. ఎంఎల్‌ఎల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి ఉంటే హిమాచల్‌లో రాజకీయ సంక్షోభం తప్పి ఉండేది అని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ శుక్రవారం అభిప్రాయం వెలిబుచ్చారు. ఆమె ప్రకటనపై విలేకరులు ప్రశ్నించినప్పుడు దిగ్విజయ్ సమాధానం ఇస్తూ, ‘ప్రభుత్వాలను కూల్చే కాంట్రాక్ట్ తీసుకున్న కుట్రదారుల చర్యలు ఇవి. కాని ప్రభుత్వం చెక్కు చెదరలేదు’ అని చెప్పారు.