Monday, January 13, 2025

హిమాచల్ సంకేతాలు!

- Advertisement -
- Advertisement -

వరుసగా అవహేళనలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్ ఫలితం అసాధారణమైన ఊరట. మల్ల యుద్ధ క్షేత్రంలో అదే పనిగా పంచ్‌లు తింటూ చతికిలపడిపోయిన విఫలయోధుడికి వున్నట్టుండి ఒడుపు చిక్కి తిరగబడి కుమ్మేసే అవకాశం లభించినట్టయింది. అయితే ప్రతి ఐదేళ్ళకోసారి అధికార పార్టీలను మార్చడం హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు అలవాటని, ఈసారి అక్కడ కాంగ్రెస్‌కు ఆ పద్ధతిలోనే విజయం అయాచితంగా దక్కిందని, బిజెపిలో ముఠా కొట్లాటలు కూడా ఇందుకు దోహదం చేశాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అంటే హిమాచల్‌ప్రదేశ్ విజయంలో కాంగ్రెస్ పాత్ర ఏమీ లేదని, అక్కడ బిజెపి ఓటమికి ప్రభుత్వ వ్యతిరేకత వెల్లువెత్తడం ఎంత మాత్రం కారణం కాదని వీరు భావిస్తున్నట్టు స్పష్టపడుతున్నది. కాంగ్రెస్, బిజెపిలకు పడిన ఓట్లలో తేడా ఒక్క శాతమే అన్నది వాస్తవమే అయినా ప్రధాని మోడీ వంటి వారు విశేషంగా ప్రచారం చేసినప్పటికీ బిజెపి ఓడిపోడం చిన్న విషయం కాదు.

బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సొంత రాష్ట్రం కావడం బిజెపికి ఉపయోగపడలేదు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రచారం చేయలేదు. దాని తరపున బలమైన నాయకుడుగా, ఓటు అయస్కాంతంగా పని చేస్తూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి విదర్భ సింగ్ 2021లో చనిపోయారు. అలాగే జి 23 లో ఒకరైన అసమ్మతి నేత కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ ఆ పార్టీకి దూరంగా వున్నారు. కేవలం ప్రియాంక గాంధీ మాత్రమే పలు సభల్లో ప్రసంగించారు. స్థానిక నాయకత్వమే అన్నీ చూసుకొంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా చాలా కాలం పాటు రెండు ప్రత్యామ్నాయ పార్టీల మధ్యనే ఆసులో కండెలా అధికారం మారుతూ వచ్చేది. కాని తమిళనాడులో జయలలిత సారథ్యంలోని ఎఐఎడిఎంకె వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకొన్న సందర్భం వుంది. అలాగే కేరళలో పినరయి విజయన్ నాయకత్వంలోని వామపక్ష ఫ్రంట్ వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్నది.

అందుచేత ప్రతి ఐదేళకీ అధికార పార్టీని మార్చి తీరుతారనే హామీ లేదు. పాలనలో మంచి చెడ్డలను ఆధారం చేసుకొని ఓటు వేసే పరిణతి ప్రజల్లో కలిగినప్పుడు ఈ ఆనవాయితీకి చెల్లుచీటి రాస్తారు. అగ్ర వర్ణాలు పరిమితంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు అధికంగా వుండే గుజరాత్‌లో బిజెపి హిందుత్వ ఘనాతిఘనంగా ఓటు అభిషేకం చేయించుకోగా, పైవర్గాలు అధిక శాతంగా వున్న హిమాచల్ ప్రదేశ్‌లో ఓడిపోయింది. హిమాచల్‌ప్రదేశ్ జనాభాలో హిందువులు 95.15 శాతం అయినప్పటికీ అక్కడ బిజెపి పప్పులు ఉడకలేదు. అక్కడ ముస్లింలు 2.18 శాతం మాత్రమే. భావోద్వేగాలను రెచ్చగొట్టి గుజరాత్‌లో మాదిరిగా గెలుపొందడానికి బిజెపికి ఇక్కడ అవకాశాలు లభించలేదు. ప్రధానంగా ప్రధాని మోడీ ప్రభుత్వం అత్యంత మొండిగా తీసుకొచ్చిన నూతన సైనిక రిక్రూట్‌మెంట్ విధానం హిమాచల్‌ప్రదేశ్‌లో బిజెపికి ఎదురుతన్నిందని తెలుస్తున్నది.

అలాగే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకపోడం కూడా ఉద్యోగ వర్గాల్లో దానిపట్ల వ్యతిరేకతను పెంచింది. రైతు ఉద్యమం కమలాన్ని గట్టిగానే దెబ్బ తీసింది. ఈ ఉద్యమం కారణంగానే 2021 నవంబర్‌లో ఉప ఎన్నికలు జరిగిన మండి లోక్‌సభ స్థానం, మూడు అసెంబ్లీ సీట్లలలో బిళ్ల బీటుగా బిజెపి ఓడిపోయింది. అందుచేత ప్రజలు అన్ని చోట్లా తన మతోన్మత్త ప్రసంగాలకు లొంగిపోయి ఓటు వేస్తారని బిజెపి ఆశించజాలదు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలతో పాటు జరిగిన ఒక లోక్‌సభ, ఐదు శాసన సభ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలైన బిజెపి, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు సంతృప్తి కరమైన ఫలితాలు సాధించాయి. యుపిలో ములాయం సింగ్ యాదవ్ మృతి వల్ల ఖాళీ అయిన మొయిన్‌పురి లోక్‌సభ స్థానాన్ని ఆయన కోడలు డింపుల్ యాదవ్ దాదాపు 3 లక్షల ఆధిక్యంతో గెలుచుకోడం ఆ పార్టీకి ఊరట.

అయితే అజామ్‌ఖాన్‌పై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన రామ్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గాన్ని బిజెపి కైవసం చేసుకోడం దానికి సంతృప్తినిస్తున్న అంశం. ఇక్కడ పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అడ్డుకున్నదన్న సమాచారం ఆందోళనకరమైనది. బీహార్‌లో ఉప ఎన్నిక జరిగిన ఒక అసెంబ్లీ స్థానాన్ని బిజెపి గెలుచుకొన్నది.జెడి(యు)కు కటీఫ్ చెప్పిన తర్వాత ఆ పార్టీ స్వతంత్రంగా ఎన్నికైన స్థానమిది. రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లలో ఒక్కో అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకొన్నది. అలాగే ఒడిశాలో ఉప ఎన్నిక జరిగిన పదంపూర్ అసెంబ్లీ స్థానాన్ని అధికార బిజెడి సొంతం చేసుకొన్నది. హిమాచల్ ప్రదేశ్ విజయం పోసిన అదనపు ఊపిరినిఉపయోగించుకొని కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకొంటుందో చూడాలి. గుజరాత్ విజయగర్వంతో ఉప్పొంగిపోయి హిమాచల్ ఓటమి చెప్పిన గుణపాఠాన్ని విస్మరిస్తే బిజెపి ఊహించని దెబ్బతింటుంది. దేశ ప్రజలను పడీస్తున్న సమస్యలపై మోడీ ప్రభుత్వం ఇకనైనా దృష్టి పెట్టాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News