Sunday, December 22, 2024

సెబిలో ‘హిండెన్‌బర్గ్’ తుఫాన్

- Advertisement -
- Advertisement -

ఒకే ఒక్క నివేదిక స్టాక్ ఎక్సేంజ్ మార్కెట్‌లో తుపాన్ రేపింది. అదానీ గ్రూపు కంపెనీల పునాదులను కదిలించింది. ఒక్క రోజు లోనే రూ. 87 వేల కోట్ల సంపద ఆవిరయ్యేలా చేసింది. అదే హిండెన్‌బర్గ్ రిపోర్టు. అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చి కంపెనీ హిండెన్‌బర్గ్ సరిగ్గా ఏడాది క్రితం కూడా అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. 2024 జనవరి 24 నాటికి హిండెన్‌బర్గ్ రిపోర్టు వచ్చి ఏడాది పూర్తయింది. జనవరి 24న స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి అదానీ గ్రూప్ విలువ రూ. 14.5 లక్షల కోట్లుగా ఉంది. ఈసారి విడుదలైన రిపోర్టులో అదానీ గ్రూపు వెనుక స్టాక్ మార్కెట్ అధిపతులే కీలక పాత్ర వహించడం తీవ్ర సంచలనం రేకెత్తించింది.

స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి ఛైర్ పర్సన్ మాధాబీ పురీ బచ్‌కు అదానీ గ్రూప్‌తో ఉన్న అక్రమ ఆర్థిక లావాదేవీలు హిండెన్‌బర్గ్ బయటపెట్టింది. ఈ నివేదికపై మాధాబీ పురీ బచ్ ఇచ్చిన వివరణలతో ప్రస్తుతం కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయని, రిపోర్టులోని ముఖ్యమైన అనేక అంశాలను అంగీకరించారని హిండెన్‌బర్గ్ రీసెర్చి తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేయడం గమనార్హం. మరోవైపు హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు నిరాధారం అనడం విశేషం. ముఖ్యంగా గౌతమీ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఆధ్వర్యంలోని ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు మాధాబీ బచ్ కుటుంబమే అంగీకరించిందని హిండెన్‌బర్గ్ బట్టబయలు చేసింది.

అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడుల తీరును కనిపెట్టవలసిన సెబి ఛైర్మన్ మాధాబీ పురీ బచ్‌కు ఆ గ్రూపు సంస్థల్లో వ్యక్తిగత పెట్టుబడులు, ఇతర స్పాన్సర్ల నిధులు ఉండడం విరుద్ధ అంశంగా కనిపిస్తోంది. మాధాబీ భర్త అదానీ గ్రూప్ సంస్థల డైరెక్టర్‌గా పని చేసినట్టు బయటపడింది. గౌతమీ అదానీ సోదరుడు వినోద్ అదానీకి సంబంధం ఉన్న మారిషస్ ఫండ్‌లో సెబి చీఫ్, ఆమె భర్త పెట్టుబడులు పెట్టారన్నది వాస్తవం. దీనిపై ప్రస్తుతం సెబి దర్యాప్తు జరపడం అంటే కంచే చేనుని మింగిన నానుడి గుర్తుకు రాక తప్పదు. అయితే ఈ వివరాలను మాత్రం బయటపెట్టడం లేదు. ఆ దర్యాప్తునకు సారథ్యం వహిస్తోంది ఎవరో కాదు సాక్షాత్తు మాధవీ బచియే. దర్యాప్తు సాగుతున్న సమయంలోనే ఆమె రెండుసార్లు గౌతమీ అదానీతో సమావేశమైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. దర్యాప్తుపై సుప్రీం కోర్టుకు కానీ, అది నియమించిన నిపుణుల కమిటీకి కానీ సెబి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. అదానీ గ్రూపు వాటాల విలువ ఒక్కసారిగా పెరిగిపోవడంపై సెబి దర్యాప్తు జరిపింది.

కానీ ఇలా ఎందుకు పెరిగిందో సెబి అసలు పరిగణనలోకి తీసుకోలేదు. ప్రాథమికంగా షార్ట్ సెల్లింగ్ కార్యకలాపాలపై మాత్రమే దర్యాప్తు జరిపింది. రాజకీయ ఒత్తిడుల కారణంగానే సెబి తన దర్యాప్తులో ఉదాసీనత వహించినట్టు విమర్శలు వస్తున్నాయి. సెబి ఛైర్ పర్సన్ కాకముందు మాధవీ బచ్ ఓ కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే దాని ఆడిటింగ్ కంపెనీ ఏ చిరునామాలో ఉందో, కన్సల్టెన్సీ సంస్థ చిరునామా కూడా అదే కావడం అనుమానాలకు దారి తీస్తోంది. కన్సల్టెన్సీ సంస్థ, దాని ఆడిటర్ మధ్య పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయేమోనన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. గత ఏడాది హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ షేర్ మార్కెట్‌లో అదానీ తెర వెనుక బాగోతాన్ని బయటపెట్టింది. విదేశాల్లో డొల్ల కంపెనీలు పెట్టి వాటి పేరిట డబ్బును స్వదేశంలోని తన సంస్థలకు మళ్లించడం ద్వారా షేర్ల విలువను విపరీతంగా పెంచుకున్నాడని, ఆ విధంగా తన కంపెనీలకు లేని, రాని వ్యాపార లాభాలు షేర్ మార్కెట్‌లో చూపించుకొని కృత్రిమ మార్గంలో సంపదను అత్యంత ఉన్నత స్థాయికి చేర్చుకొన్నాడనేది హిండెన్‌బర్గ్ నివేదిక బయటపెట్టిన కీలకాంశాలు.

దీని తరువాత అదానీ సంస్థల షేర్లు రూ. 10 లక్షల కోట్ల వరకు నష్టపోయినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో తామే దర్యాప్తు కమిటీని నియమిస్తామని, దాని వల్ల విశ్వసనీయత బలపడుతుందని ధర్మాసనం ప్రకటించింది. కానీ సెబికే దర్యాప్తు విషయంలో స్వేచ్ఛ కల్పించింది. అయితే జూన్ 3న సుప్రీం కోర్టు ఆదేశాలపై సెబి దర్యాప్తు నివేదిక సమర్పించింది. కానీ అందులో వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ దర్యాప్తు ముగింపు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం అని పేర్కొంటూ ఓ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీం కోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు. లోక్‌సభ 2024 ఎన్నికల ఫలితాల తరువాత షేర్ మార్కెట్ పతనం, పెట్టుబడిదారుల నష్టంపై కేంద్ర ప్రభుత్వం, సెబి వివరణాత్మక నివేదికను దాఖలు చేయాలని తివారీ కోరారు. ఈ పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేం. కానీ అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జెపిసి) వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 22న దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య ఉద్యమం ధర్నాలు చేపట్టడానికి పిలుపునిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News