Monday, December 23, 2024

బాలీవుడ్ వెండితెర అమ్మ సులోచనా లత్కార్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ముంబై: హిందీ, మరాఠీ భాషలకు చెందిన 250కి పైగా చిత్రాలలో నటించి బాలీవుడ్ ప్రముఖ హీరోలందరికీ తల్లి పాత్రలో నటించి మెప్పించిన ప్రముఖ నటి సులోచనా లత్కార్ ఆదివారం సాయంత్రం ముంబైలో కన్నుమూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సులోచన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.

1928 జులై 30న ఇప్పటి కర్నాటకలోని బెలగావిలోని ఖదక్లత్ గ్రామంలో జన్మించిన సులోచన 1946లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కథానాయిక పాత్రల నుంచి సహాయ పాత్రలు, తల్లి పాత్రల వరకు తన ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఆమె ప్రేక్షకులకు చేరువయ్యారు. బిమల్ రాయ్ నిర్మించిన బాలీవుడ్ కళాఖండం బందిని(1963)లో సులోచన నటించిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది.

ప్యార్ కిసీసే హోతా హై, దునియా, అమీర్ గరీబ్, బహారోంసే సప్నే, కటీ పతంగ్, మేరే జీవన్ సాథీ, ప్యార్ మొహబ్బత్, దునియా, జానీ మేరా నామ్, వారంట్, జోషీలా, డోలీ, ప్రేమ్ నగర్, ఆక్రమణ్, భోలా భాలా, త్యాగ్, ఆషిఖ్ హోం బహారోంకా, అధికార్, నయీ రోషిని, ఆయే దిన్ బహార్ కే, ఆయి మిలన్ కీ బేలా, అబ్ దిల్లీ దూర్ నహీ, మజ్బూర్, గోరా ఔర్ కాలా, దీవార్, కహానీ కిస్మత్ కీ, తలాష్, ఆజాద్ తదితర హిందీ చిత్రాలలో ఆమె నటించారు.

బాలీవుడ్ టాప్ హీరోలు ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, రిసీ కపూర్, అమిత్ బచ్చన్, వినోద్ ఖన్నా, రాజేంద్ర కుమార్, సంజీవ్ కుమార్, నూతన్, ఆషా పరేఖ్, వహీదా రెహ్మాన్, జీనత్ అమన్, తనూజా తదితరులకు తల్లిగా ఆమె అనేక చిత్రాలలో నటించారు.

1999లో ఆమెకు సద్మశ్రీ పురస్కారం లభించగా 2004లో ఫిలిమ్‌ఫేర్ జీవిత సాఫల్య అవార్డు లభించింది.
ఆమె మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బయస్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలె, శివసేన నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News