కేంద్ర హోం మంత్రి అమిత్ షా
వారణాసి: దేశంలోని అన్ని స్వదేశీ భాషలకు హిందీ మిత్ర భాషని, అన్ని భాషల పరిపుష్టిలోనే భారతదేశ పురోభివృద్ధి ఇమిడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం నాడిక్కడ అఖిల భారత రాజభాష సదస్సులో ఆయన ప్రసంగిస్తూ తన భాషలను పరిరక్షించుకోలేని ఏ దేశమైనా తన సంస్కృతిని, సైద్ధాంతిక మూలాలను పరిరక్షించుకోలేదని కూడా ఆయన అన్నారు. దేశంలోని అన్ని భాషలను పరిరక్షించుకోవడంతోపాటు వాటిని పరిపుష్టం చేయడం ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయడపడ్డారు. అన్ని స్వభాషలకు హిందీ సఖి(మిత్ర)గా ఆయన అభివర్ణించారు. ఇంగ్లీష్‌ను సరిగ్గా మాట్లాడలేని కొందరు పిల్లలలో ఆత్మన్యూనతా భావం నెలకొంటోందని, అయితే మాతృ భాషను సరిగ్గా మాట్లాడలేని వారిలో ఆత్మన్యూనతా భావం ఏర్పడే రోజు ఎంతో దూరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
దేశీయ భాషే పాలనా భాషగా ఉండాలని ప్రజలు నిర్ణయించిన రోజున భారతదేశం పతంజలి మహర్షి, పాణిని వంటి మేధావుల మేధో సంపత్తిని తిరిగి పొందగలదని ఆయన అన్నారు. బ్రిటిష్ పాలనలో ఏర్పడిన ఆత్మన్యూనతా భావం నుంచి యువజనులు బయటపడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. హిందీ భాష చుట్టూ అనేక వివాదాలు సృష్టించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని, అయితే ఇప్పుడా పరిస్థితి లేదని అమిత్ షా చెప్పారు. భారతీయ భాషలలో సంభాషణ, వాటి పరిపుష్టి జాతీయ విద్యా విధానానికి కేంద్ర స్తంభమని, ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల సిలబస్‌ను ఇప్పటి వరకు ఎనిమిది భారతీయ భాషలలో అనువదించడం జరిగిందని ఆయన చెప్పారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖలో ఒక్క ఫైలును కూడా ఇంగ్లీషులో రాయనందుకు తాను గర్విస్తున్నానని, తాము పూర్తిగా అధికారిక భాష(హిందీ)ను అమలు చేస్తున్నామని అమిత్ షా తెలిపారు.