గాయకుడు సోను నిగమ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: మన దేశానికి హిందీ జాతీయ భాష కాదని, హిందీయేతర ప్రాంతాల ప్రజలపై దీన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తే అంతఃకలహాలు ఏర్పడతాయని ప్రముఖ సినీ గాయకుడు సోను నిగమ్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందీ జాతీయ భాష అవునా కాదా అనే అంశంపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్ మధ్య ట్విటర్‌లో మాటల యుద్ధం సాగుతున్న నేపథ్యంలో సోను నిగమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను. సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సోను నిగమ్‌ను ఈ వివాదంపై విలేకరులు ప్రశ్నించగా ఇది ఒక చర్చనీయాంశం కావడం తనను ఆశ్చర్యపరుస్తోందని అన్నారు.
హిందీ మన జాతీయ భాష అంటూ భారత రాజ్యాంగంలో రాసినట్లు తాను ఎక్కడా చూడలేదని, అయితే..అత్యధిక జనాభా మాట్లాడే భాష అయి ఉండవచ్చని ఆయన అన్నారు. హిందీ మాత్రం జాతీయ భాష కాదని ఆయన తేల్చిచెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాష తమిళమని మనం విన్నామని, సంస్కృతం, తమిళం మధ్య ఏది ప్రాచీన భాష అన్న విషయమై వివాదం ఉందని ఆయన అన్నారు. అయితే ప్రజలు మాత్రం తమిళమే ప్రపంచంలో అత్యంత ప్రాచీన భాష అని చెబుతారని సినిమా బీస్ట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. హిందీతోపాటు తమిళం, కన్నడ, తెలుగు, గుజరాతీ, మలయాళం, బెంగాలీ భాషలలో అనేక సినిమా పాటలు సోను పాడారు.