Monday, December 23, 2024

డిఎంకె హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Fuel, food crisis with Russia Ukraine war

 భారతీయ జనతా పార్టీ తన కుహనా జాతీయవాద విధానాలతో, యేక పక్ష, నిరంకుశ పద్ధతులతో దేశానికి యెటువంటి ఉపద్రవాన్ని దాపురింపజేయగలదో తెలుసుకోడానికి యిదొక మచ్చు తునక. మితిమించి లాగితే తెగిపోతుంద నే విజ్ఞతను కోల్పోరాదని హెచ్చరిస్తున్న సందర్భమిది. బహుళత్వం ఊపిరిగా ఉన్న చోట అనవసరమయిన యేకత్వాన్ని, ఆచరణలో సాధ్యం, సమంజసం కాని సమైక్యతను రుద్దాలనుకోడం యెంత అవాంఛనీయమో రుజువు చేస్తున్న ఘట్టమిది. ‘ప్రత్యేక తమిళ దేశాన్ని డిమాండ్ చేసే స్థితికి మమ్మల్ని నెట్టకండి’ అని డిఎమ్ కె నేత, కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యుడు కె.రాజా ఆదివారం నాడు చేసిన వ్యాఖ్య తీవ్రమైనదే. కాని ఆయన యెంతో అవగాహనతో, అణకువతోనే ఆ ప్రకటన చేశారన్న అభిప్రాయం ఆ విషయాన్ని మొత్తం పరిశీలించేవారికి కలుగకమానదు.

రాజా యీ ప్రకటనను విడిగా చేయలేదు. కేంద్రంలో ఐక్య సంఘటన ప్రభుత్వం -రాష్ట్రాల స్వయంప్రతిపత్తి అనే అంశంపై పార్టీ సదస్సులో ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో ప్రసంగిస్తూ రాజా యీ ప్రకటన చేశారు.అందులో కేంద్ర, రాష్ట్రాల అధికారాలపై క్షుణ్ణంగా మాట్లాడారు. ఆ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ఉద్దేశించి అన్న మాటలే యివి. హిందీని జాతీయ భాష చేయాలన్న బిజెపి ఆలోచనను ప్రస్తావిస్తూ ఆయన అలా అన్నారు. తమిళనాడు హిందీ వ్యతిరేకోద్యమానికి పురిటిగడ్డ. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు నుంచీ ఉన్న సమస్య యిది. 1937లో మద్రాస్ ప్రెసిడెన్సీ పాఠశాలల్లో హిందీ బోధనను తప్పనిసరి చేస్తూ సి.రాజగోపాలచారి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవి రామస్వామి నాయకర్ (పెరియార్) నాయకత్వంలో మూడేళ్ల పాటు సాగిన ఉద్యమం విజయం సాధించింది.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం హిందీని దేశ అధికార భాష చేసి 1950 నుంచి 15 యేళ్ల పాటు ఆంగ్లాన్ని సహ అధికార భాషగా కొనసాగించారు. 1965 తర్వాత వొక్క హిందీనే యేకైక అధికార భాష చేయదలచినప్పుడు తమిళనాడులో డిఎమ్‌కె నాయకత్వంలో తిరిగి ఉద్యమం ప్రబలమయ్యింది. ఇద్దరు పోలీసులు సహా 70 మంది దుర్మరణం పాలయ్యారు. దానితో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం హిందీయేతర రాష్ట్రాలు కోరుకున్నంత కాలం ఇంగ్లీష్ అధికార భాషగా కొనసాగుతుందని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. ఆ తర్వాత ఇంగ్లీష్ శాశ్వత అధికార భాష అయ్యింది. 1967లో చట్ట సవరణ జరిగింది. అప్పటి నుంచి తమిళనాడులో కాంగ్రెస్ అధికారం కోల్పోయి ద్రావిడ పార్టీల ప్రాబల్యం మొదలైంది. ఉత్తరాది నాయకులు అప్పుడప్పుడు హిందీని యేకైక అధికార భాష చేసే విషయం ప్రస్తావించినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల అమిత్ షా దీనిని గురించి చేసిన ప్రస్తావన తిరిగి వివాదాన్ని ముందుకు తెచ్చింది.

దేశాన్ని సమైక్యంగా ఉంచగల శక్తి వొక్క హిందీ భాషకే ఉందని అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటనపై నిరసనలు వ్యక్తమయ్యాయి. డిఎమ్‌కె నేత రాజా ఆదివారం నాడు తమిళ దేశం డిమాండ్ వైపు తమను బలవంతంగా తరమొద్దని ప్రకటించారు. అది పెరియార్ డిమాండ్ అని అన్నారు. 1963లో అన్నాదురై యీ డిమాండు నుంచి దూరం జరిగి దేశ సమైక్యత సమగ్రతలకు అనుకూల వైఖరిని యెంచుకొన్నారని, కరుణానిధి దానిని మరింత దృఢపరిచారని అటువంటి తమను తిరిగి తమిళ దేశ డిమాండ్ వైపు నెట్టొద్దని హెచ్చరించారు.

పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోడానికి కూడా ఉర్దూ పెత్తనమే కారణమని అన్నారు. రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి తమ డిమాండ్ అని చెప్పిన రాజా, కాంగ్రెస్, బిజెపిలు రెండూ ఫెడరల్ విధానాలను నీరుగార్పించి కేంద్రం వద్ద భిక్షమెత్తుకొనే స్థితి రాష్ట్రాలకు కల్పించాయని అన్నారు. భారతీయ జనతా పార్టీ వొక పద్ధతి ప్రకారం సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తూ అధికారాలను కేంద్రం గుప్పెట్లో కేంద్రీకరిస్తున్నది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి ) వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ నిధులపై పెత్తనం చలాయిస్తున్నది. బిజెపియేతర పార్టీల ప్రభుత్వాలను ముప్పతిప్పలు పెడుతున్నది. వైద్య విద్యలో నీట్‌ను రుద్ది తమిళనాడు ప్రజలు, పాలకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను యెదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కేంద్రం నిరంకుశాధికారాల చలాయింపును ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో టిఆర్‌ఎస్ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. తమిళనాడు సిఎం సమక్షంలోనే రాజా చేసిన హెచ్చరికను గమనించి కేంద్రం ఇకనైనా రాష్ట్రాల హక్కులను గౌరవించి నడచుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News