Wednesday, April 16, 2025

ప్రశ్నాపత్రం తారుమారు!

- Advertisement -
- Advertisement -

తెలుగుకు బదులు హిందీ పేపర్
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన
రెండు గంటల ఆలస్యంగా
ప్రారంభమైన టెన్త్ తొలిరోజు పరీక్ష
ఉన్నతాధికారులు సీరియస్
విధి నిర్వహణలో నిర్లక్షం
వహించిన ఇద్దరు అధికారులను
సస్పెండ్ చేసిన కలెక్టర్

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎవరి నిర్లక్షమో ఏమో కాని పదవ తరగతి మొదటిరోజు పరీక్షలో విద్యార్థులు హైరానాకు గురయ్యారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రా రంభం కాగా జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు 2 గంటల ఆలస్యంగా పరీక్ష నిర్వహించడం సంచలనం సృష్టించింది. వార్షిక పరీక్షల నిర్వహణపై ఎప్పటికప్పుడు పై స్థాయి అధికారులతో సమీక్షలు జరిపినప్పటికీ శుక్రవారం తొలి పరీక్ష తెలుగు ప్రశ్నాపత్రం విషయంలో పొరపాటు దొర్లడంతో రెండు గంటల ఆలస్యంగా నిర్వహించడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 240 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉద యం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా, విద్యార్థులకు ప్రశ్నా పత్రం ఇచ్చే విషయం లో తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నాపశ్న పత్రం తీసుకొచ్చారు. దీంతో స్పందించిన నిర్వాహకులు జిల్లా విద్యాశాఖాధికారికి, జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాఠశాలకు వచ్చి జరిగిన పొరపాటుపై విచారించారు.

తెలుగు ప్రశ్నాపత్రానికి బదులుగా హిందీ పేపర్ రావడంతో వెంటనే అధికారులు అప్రమత్తమై హిందీ పేపర్‌కు బదులుగా మళ్లీ తెలుగు ప్రశ్న పత్రాన్ని పోలీస్ స్టేషన్ నుండి తీసుకొని రావడంతో సుమారు రెండు గంటల సమయం పట్టింది. 9.30 గంటలకు నిర్వహించాల్సిన పరీక్షను 11.30 గంటలకు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఆలస్యం నేపథ్యంలో విద్యార్థులకు అదనంగా రెండు గంటల సమయం ఇచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అధికారులు బిస్కట్లను అందజేసారు. ఏదేమైనా ఎవరి వల్ల జరిగిందో కాని మొదటి రోజు విద్యార్థులు రెండు గంటల సమయం అదనంగా గడపాల్సి వచ్చింది. శనివారం రాయాల్సిన హిందీ పేపర్ శుక్రవారం ఓపెన్‌కాగా హిందీ పరీక్ష పత్రం లీక్ అయ్యిదా? అనే సందేహాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల విషయంలో నిర్లక్షంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. పోలీసు స్టేషన్ నుంచి పదో తరగతి ప్రశ్నాపత్రాల తరలింపులో నిర్లక్షం వహించిన చీఫ్ సూపరింటెండెంట్ సఫ్దార్ అలీ ఖాన్, డిపార్ట్‌మెంటల్ ఆపీసర్ ఎన్.ఆర్. పద్మజను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

తొలిరోజు 96.67 శాతం హాజరు
పదో తరగతి పరీక్షలకు తొలిరోజు 96.67 శాతం హాజరు నమోదైంది. శుక్రవారం జరిగిన ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పేపర్‌కు 4,96,549 మంది దరఖాస్తు చేసుకోగా, 4,94,887 మంది హాజరయ్యారు. 1,662 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలో రాష్ట్రవ్యాప్తంగా ఒక మాల్ ప్రాక్టీస్ కేసు నమోదయ్యింది. మొదటి రోజు విధుల నిర్వహణలో నిర్లక్షంగా వ్యవహరించిన మంచిర్యాల జిల్లా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారితో పాటు వరంగల్ జిల్లా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే నల్గొండ జిల్లాలో విధుల నిర్వహణలో నిర్లక్షంగా వ్యవహరించిన జిల్లా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులను విధుల నుంచి తొలగించడంతో పాటు ఒక ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News