Monday, December 23, 2024

హిందీ రుద్దొద్దు

- Advertisement -
- Advertisement -

అది జాతీయ భాష కాదు.. 22 అధికారిక భాషల్లో ఒకటి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల
పరీక్షలను హిందీ,
ఇంగ్లీష్‌లోనే
నిర్వహించడం దుర్మార్గం
తీవ్రంగా నష్టపోతున్న
ప్రాంతీయ భాషల
ఉద్యోగార్థులు
మాతృభాషాల్లోనే
ఈ పరీక్షలు నిర్వహించాలి
ఐఐటి, ఎన్‌ఐటిలలో
హిందీ మీడియంపై మంత్రి
కెటిఆర్ ఫైర్ అమిత్
షా నివేదిక కమిటీని
పక్కనబెట్టాలని డిమాండ్
ఈమేరకు ప్రధానికి ఘాటు లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఉన్న పలు అధికారిక భాషల్లాగే హిందీ కూడా ఒక అధికారిక భాష మాత్రమేనని అన్నారు. ఈ నేపథ్యంలో భాషను ఎంచుకునే హక్కు దేశ ప్ర జలకు ఉండాలన్నారు. కేవలం 40శాతం ప్రజ లు మాత్రమే మాట్లాడే హిందీ భాషను బలవంతంగా దేశం మొత్తానికి అంటకట్టడం దుర్మార్గమన్నారు. భారత రాజ్యాంగం ఏ భాషకు అధికారిక హోదా ఇవ్వలేదని కెటిఆర్ గుర్తు చేశా రు. రాజభాషా అని హిందీకి పట్టం కట్టలేదని స్పష్టం చేశారు.

22 భాషలను అధికారిక భాషలుగా మాత్రమే మన రాజ్యాంగం గుర్తించిందన్న ఆయన… మోడీ ప్రభుత్వ చర్యలు రా జ్యాంగ విరుద్దమని మండిపడ్డారు. ఈ చర్యలను నిరసిస్తూ ప్రధాని నరేంద్రమోడీకి బుధవారం ఆయన ఒక లేఖ రాశారు.ప్రపంచస్థా యి ప్రమాణాలు గల విద్యాసంస్థల్లో హిందీ మాధ్యమంలో మాత్రమే బోధన ఉండాలన్న హోం అమిత్ షా సారథ్యంలోని పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజెస్ నివేదికను తప్పుపట్టడంతో పాటు కేంద్ర ప్రభు త్వ ఉద్యోగ అర్హత పరీక్షలను కూడా హిందీ భాషలోనే నిర్వహించడంపై కెటిఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. ఐఐటిలు, కేంద్ర ప్రభుత్వ ని యామకాల్లో హిందీ భాషను తప్పనిసరి చేయడాన్ని టిఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కేంద్ర నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రపం చ స్థాయి సంస్థలు, కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహించడానికి మల్టీనేషనల్ కం పెనీల్లో మన
యువత మెజార్టీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇంగ్లీష్ మీడియంలో చదవడమే ప్రధాన కారణమని కెటిఆర్ అన్నారు.

గ్లోబలైజేషన్ జమానాలో మిగతా ప్రపంచంతో మనం కనెక్ట్, కమ్యూనికేట్ అవ్వడానికి ఇంగ్లీష్ తో మాత్రమే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. అయితే మోడీ ప్రభుత్వం హిందీ భాషకు అనవసర ప్రాధాన్యత ఇస్తూ దేశాన్ని తిరోగమన స్థితిలోకి వేగంగా తీసుకుపోతుందని ఆయన విమర్శించారు. అన్ని స్థాయిల్లో హిందీ భాషను కచ్చితం చేయాలనుకుంటున్న మోడీ ప్రభుత్వ విధానాలతో ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల మధ్య తీవ్రమైన ఆర్థిక, సాంస్కృతిక అసమానతలు తలెత్తుతాయని కెటిఆర్ తెలిపారు. అన్ని భాషలకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలన్న భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ హిందీ భాషను బలవంతంగా దేశ ప్రజలపై రుద్దే ప్రయత్నాలను తక్షణమే మానుకోవాలని ప్రధానికి రాసిన లేఖలో కెటిఆర్ డిమాండ్ చేశారు. వెంటనే అమిత్ షా సారధ్యంలోని కమిటి ఇచ్చిన నివేదికను పక్కనపెట్టాలన్నారు.

కేంద్రం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోంది

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ అనుబంధ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నియామక పరీక్షలు హిందీ, ఆంగ్ల భాషలోనే నిర్వహిస్తున్న కేంద్రం తీరుపై కెటిఆర్ తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో రాజ భాష అంటూ ఏదీ లేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషల్లో కాకుండా కేవలం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సమాన అవకాశాలు పొందేలా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఈ నిర్ణయం కాలరాస్తుందన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలన్నింటిని ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రాంతీయ భాషల్లోనే ఉన్నత విద్య ఉంటుందని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఇంగ్లీష్, హిందీలకే ప్రాధాన్యత ఇచ్చి తన చిత్తశుద్ధిలోని డొల్లతనాన్ని బయటపెట్టుకుందని కెటిఆర్ ఎద్దేవా చేశారు.

కేవలం హిందీ, ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారికి మాత్రమే ప్రయోజనం కలిగేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లతో ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇది కేవలం 12 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదన్నారు. దీని వల్ల మాతృ భాషలో చదువుకున్న కోట్లాది మంది ఈ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతారన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని భవిష్యత్తులోనూ అన్ని ప్రాంతీయ భాషలకు సరైన ప్రాధాన్యం ఇస్తామన్నా స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న తెలుగు రాష్ట్రాల యువకుల తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అధికారిక భాష అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం

ఆర్టికల్ 345 ప్రకారం అధికారిక భాష అనేది రాష్ట్రాలకు సంబంధించిన విషయమని కెటిఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో హిందీని బలవంతంగా రుద్దాలనుకోవడం భారత రాజ్యాంగ సమాఖ్య స్పూర్తికి విరుద్దమన్నారు. ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది యువకులకు ఎలాంటి వివక్ష, అసమానతలు లేకుండా సమాన అవకాశాలు దక్కేలా ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈవిషయంపై నరేంద్ర మోడీకి గతంలోనే సిఎం కెసిఆర్ విజ్ఞప్తి కూడా చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఖాళీగా ఉన్న లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పటిదాకా నోటిఫికేషన్లు వేయని మోడీ ప్రభుత్వం, ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలను హిందీ, ఇంగ్లీష్ లో నిర్వహిస్తూ మాతృభాషలో చదువుకున్న కోట్లాది మంది ఉపాధి అవకాశాలను దెబ్బ తీస్తుందని మండిపడ్డారు.

కేంద్రం సంకుచిత నిర్ణయంతో యువతకు తీరని నష్టం

ఢిల్లీలో ఉండే కొంతమంది బ్యూరోక్రాట్లు, నేతలు ఇంకా బ్రిటిష్ కాలం నాటి వలసవాద, ఆధిపత్య భావజాలాన్ని మోస్తున్నారనడానికి సివిల్స్ ప్రాథమిక(ప్రిలిమ్స్) పరీక్షల ప్రశ్నపత్రాలన్నీ ఇంగ్లీష్, హిందీలోనే ఉండడమే సాక్ష్యమని కెటిఆర్ విమర్శించారు. బలహీన వర్గాలంటే ఆయా వ్యక్తులకు ఉండే చిన్నచూపుగా కనిపిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ వివక్షతో సివిల్స్ పరీక్షల్లో గ్రామీణ అభ్యర్థులకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదన్నారు. ఈ సంకుచిత ఆలోచన విధానంతో దేశ యువత తీవ్రంగా నష్టపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత సర్వీసులంటూ అధికశాతం పరీక్షలను ఆంగ్లం, హిందీల్లోనే నిర్వహించడం వల్ల మాతృభాషల్లో చదువుకుని ఆయా అంశాల మీద మంచి పట్టున్న అభ్యర్థులు నష్టపోతున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్‌ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించడంతో పాటు మేయిన్స్, ముఖాముఖిలో అనువాదకుల అవసరం లేకుండా ఆయా భాషలు తెలిసిన అధికారులతోనే బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రధానికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు.

ప్రాంతీయ భాషల్లోనూ పరీక్షలు నిర్వహించాలి

యుపిఎస్‌సి నిర్వహించే ఇంజినీరింగ్, ఎకనామిక్ సర్వీసు పరీక్షలతో పాటు గిరిజనులు, గ్రామీణులతో మమేకమై విధులు నిర్వర్తించే ఫారెస్ట్ సర్వీస్ అధికారుల ఎంపికలోనూ ఇంగ్లీషుకు మాత్రమే పెద్దపీట వేయడం అన్యాయమని కెటిఆర్ విమర్శించారు. ప్రస్తుత స్టాఫ్ సెలక్షన్ నోటిఫికేషన్ మాత్రమే కాకుండా అనేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియాకమాక పరీక్షలన్నీ దాదాపుగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే నిర్వహిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో 20 కు పైగా ఉద్యోగ నియామక సంస్థలున్నాయన్న ఆయన …యుపిఎస్‌సి, ఎస్‌ఎస్‌సి, ఐటిపిఎస్(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్) పరీక్షలకు ఏటా లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుంటారన్నారు. అఖిల భారత స్థాయి ఉద్యోగాలకు యుపిఎస్‌సి నిర్వహించే 16కు పైగా నియామక పరీక్షలు కూడా హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే ఉంటాయన్నారు. 2017…-2020 మధ్య యుపిఎస్‌సి పరీక్షలకు దాదాపు 90 లక్షల మంది, ఎస్‌ఎస్‌సి పరీక్షలకు కోటి ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. అయితే ప్రాంతీయ భాషల్లోనూ ఆయా పరీక్షలు నిర్వహిస్తే మరింత ఎక్కువ మంది పోటీ పడేవారన్నారు. అందువల్ల జాతీయ స్థాయి ఉద్యోగ నియామకాల్లో అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు సమాన, న్యాయమైన అవకాశాలు దక్కాలంటే అర్హత పరీక్షలన్నీ హిందీ, ఇంగ్లీష్ తో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు

అమలుకు నోచుకోని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామి

బ్యాంకు నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండేళ్ల క్రితం ఇచ్చిన హామి ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని కెటిఆర్ విమర్శించారు. ఆమెకు జుమ్లా తప్ప మరొటి చేదకాదని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు దాదాపు బ్యాంకుల ద్వారానే అమలవుతాయన్న కెటిఆర్….స్థానిక భాష తెలియని బ్యాంకు సిబ్బందితో గ్రామీణులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

ప్రాంతీయ భాషలో చదుకున్న వారికి ఉద్యోగాలు దొరకడం లేదు

2014 ముందు వరకు ప్రాంతీయ భాషల్లో బ్యాంకు నియామక పరీక్ష రాసే అవకాశం ఉండేదని కెటిఆర్ గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీల్లోనే నిర్వహిస్తుండడంతో ప్రాంతీయ భాషలో చదువుకున్న స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలలో విద్యార్థులు తమ మాతృభాషాలోనే విద్య అభ్యసిస్తున్నారన్నారు. ఇంగ్లిష్, హిందీ భాషలను కేవలం ఒక అంశంగా మాత్రమే చదువుతున్నారని ఆయన పేర్కొన్నారు. తాము పొందిన జ్ఞానం, భావనలు ఇతర భాషలలో అనువదించుకొని, ఆ పదజాలాన్ని అవగాహన చేసుకొని పరీక్షలలో పోటి పడి ఉద్యోగం సాధించడం అంత సులువుకాదన్నారు. వివిధ విషయాల పట్ల మాతృభాషలో పరిజ్ఞానం, అవగాహన ఉండి కూడా ఎంతోమంది అవకాశాలను అందుకోకపోవడానికి ఇదే ముఖ్య కారణం అన్నారు. ఒక ఉద్యోగి ఇతర రాష్ట్రాలలో ఉద్యోగం చేయవలసిన సందర్భాలలో హిందీ, ఇంగ్లిష్ పరిజ్ఞానం అవసరమే అన్న కెటిఆర్, ఆయా భాషలలో ప్రాథమిక పరిజ్ఞానం పరిశీలించడానికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని సూచించారు. మొత్తం జ్ఞానం అంతా పరాయి భాషలోనే ఉండాలనుకోవడం అశాస్త్రీయం, అన్యాయం అన్నారు.

హిందీ భాషను మాట్లాడేది 40 శాతం ప్రజలే

భారత జనాభాలో 40 శాతం మంది మాత్రమే మాట్లాడే హిందీ భాషని మెజార్టీ ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని కెటిఆర్ హితవు పలికారు. సివిల్స్, రైల్వే, పోస్టల్, రక్షణ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌తో పాటు నెట్, జనరల్ స్టడీస్ పరీక్షలతో పాటు కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలలో నిర్వహించే పరీక్షలను ప్రాంతీయ భాషలలో రాసేందుకు అవకాశం కల్పించే విషయమై తక్షణం ఒక నిపుణుల కమిటీ నియమించాలని ప్రధానమంత్రి మోడీకి రాసిన లేఖలో కెటిఆర్ డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News