విషం సీసాకు లేబుల్ మార్చినంత మాత్రాన అందులో వున్నది అమృతమైపోతుందా? మొన్న శుక్రవారం నాడు కర్నాటక శాసనమండలి ఆమోదం పొందిన మత స్వాతంత్య్ర హక్కు పరిరక్షణ బిల్లును పౌరులకు వారు కోరుకునే మతాన్ని అవలంబించే హక్కును ప్రసాదించేదిగా భావిస్తే తప్పులో కాలేసినట్టే. దాని అసలు లక్షణం పౌరుల మత స్వేచ్ఛను అడ్డుకోడమే. హిందూ మతంలోని వారు ఇష్టపడి తమంత తాముగా వేరే మతంలోకి వెళ్లినా దానిని బలవంతపు మత మార్పిడిగా ముద్రవేసి శిక్షించడమే ఈ బిల్లు ఆంతర్యమని అనుకోవలసి వుంది. అందుచేత దానిని మతాంతరీకరణల నిషేధ బిల్లుగానే చూడాలి.
ఈ బిల్లు చట్టమైతే దాని ద్వారా సంక్రమించే అధికారాలను మైనారిటీ మత సంస్థల మీద విచక్షణ లేకుండా ప్రయోగించడమే కర్నాటకలోని బిజెపి ప్రభుత్వ ఉద్దేశమని అవగతమవుతున్నది. దక్షిణాదిన ఇదే తొలి మత విద్వేష చట్టమనుకోవాలి. మైనారిటీలతో ఘర్షణలను రెచ్చగొట్టడం ద్వారా ప్రజల మధ్య మతపరమైన చీలికలను తీసుకొచ్చి బిజెపి రాజకీయంగా లబ్ధి పొందేలా చేయడం కోసమే బసవరాజు బొమ్మై ప్రభుత్వం ఈ బిల్లుకు తాజాగా శాసన మండలి ఆమోదాన్ని పొందింది. దీనిని శాసన సభ గత ఏడాది డిసెంబర్‌లోనే ఆమోదించింది. గవర్నర్ ముద్ర పడగానే ఇది చట్టమవుతుంది. ప్రయోజనాలను ఆశించి మతం మారే వారికి అంతవరకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న రాయితీలు, ఇతర మేళ్లు ఆగిపోతాయని బిల్లుపై సాగిన సుదీర్ఘ చర్చ సందర్భంగా కర్నాటక హోం మంత్రి ఎ జ్ఞానేంద్ర వివరించారు. అంటే ఇతర మతాలను స్వీకరించే ఎస్‌సి, ఎస్‌టి, బిసిల వంటి వర్గాలకు చెందినవారు రిజర్వేషన్లు తదితర సౌకర్యాలను కోల్పోతారన్నమాట. అలాగే బలవంతంగా మత మార్పిడిలు జరుపుతున్నారని భావించే వారికి పది సంవత్సరాల వరకు జైలు, లక్ష రూపాయల వరకు జరిమానా సహా వివిధ శిక్షలను ఈ బిల్లు ఉద్దేశిస్తున్నది.
పెళ్లి చేసుకొనే ఒప్పందం మీద జరిగే మత మార్పిళ్లను కూడా ఈ బిల్లు నిషేధిస్తున్నది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకొన్న ‘లౌజిహాద్’ దారుణాలను ప్రస్తావించుకోవలసి వుంది. 2020లో బలవంతపు మత మార్పిడి పెళ్లి చేసుకున్నట్టు ఆరోపిస్తూ యుపిలోని మొరాదాబాద్ జిల్లాలో 22 ఏళ్ల పింకి అనే మూడు మాసాల గరవతిని అక్కడి పోలీసులు అరెస్టు చేసి హింసలు పెట్టగా ఆమె తన గర్భాన్ని కోల్పోయిన సంఘటన హృదయ విదారకమైనది. ఈ సందర్భంగా ఆమెను, ఆమె భర్తను, మరిదిని కూడా అరెస్టు చేశారు. తనను మూడు రోజుల పాటు షెల్టర్ హోమ్ (నారి నికేతన్)లో వుంచి వేధించారని తనకు కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్చారని అక్కడ వైద్యులు పలు సార్లు ఇంజెక్షన్ ఇచ్చారని దానితో తీవ్రంగా రక్తస్రావమై గర్భాన్ని కోల్పోయానని తాను ఇష్టపూర్వకంగానే తన భర్త రషీద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఆమె కోర్టులో మొరపెట్టుకొన్నది. దానితో ఆమెకు, ఆమె భర్తకు, మరిదికి కోర్టు స్వేచ్ఛను ప్రసాదించింది.
లౌజిహీద్ పేరిట బజరంగ్ దళ్ వంటి హిందూత్వ శక్తులు యుపిలో అనేక జంటలను హింసించిన ఉదంతాలు బయటపడ్డాయి. కర్నాటకలో కూడా ఈ చట్టంతో అటువంటి దుస్థితే తలెత్తుతుంది. ఇంతకు ముందు హిజాబ్ ధారణను అడ్డుకొని ముస్లిం బాలికల చదువులను దెబ్బ తీసిన ఉదంతాలు ఆందోళనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త చట్టాన్ని కర్నాటకలోని క్రైస్తవ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాము విద్య, వైద్య, సామాజిక సేవా రంగాల్లో ఎంతో కృషి చేసి సమాజానికి ఉపయోగపడుతున్నామని దానిని గుర్తించకుండా తమకు ద్రోహం తలపెట్టారని ఈ సంస్థలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ చట్టాన్ని న్యాయ స్థానంలో సవాలు చేస్తామని ప్రకటించాయి. దేశ జనాభాలో హిందువులు 79.8 శాతం కాగా ముస్లింలు 14.2 శాతం, అలాగే క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు కలిసి మిగతా 6 శాతం జనాభాలో వుంటారని అధికారిక సమాచారం. హిందువుల సంఖ్యాధిక్యతకు వచ్చే ముప్పు ఏ మాత్రం వుండబోదని ఈ గణాంకాలు చాటుతున్నాయి.
అయినా బలవంతంగా తమ మతస్థులను అన్య మతాల్లోకి మార్చుతున్నారనే ఆరోపణను బిజెపి, సంఘ్ పరివార్ శక్తులు బిగ్గరగా చేస్తున్నాయి. హిందూమతంలోని కుల వివక్ష కింది కులాలకు చెందిన ప్రజలు అన్యమతాల్లోకి వెళ్లడానికి దోహదం చేసింది. కొన్ని చోట్ల అటువంటి వారిని తిరిగి హిందూ మతంలోకి మార్పించిన సందర్భాలున్నాయి. క్రైస్తవ మిషనరీలు అణగారిన జనంలోకి వెళ్లి వారికి విద్య, వైద్య వసతులు కల్పించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అటువంటి సందర్భాల్లో జరిగే మత మార్పిడులను బలవంతంగా జరిపినవిగా ముద్ర వేసి శిక్షలకు గురి చేయడం సమాజంలో ద్వేషాన్ని, విభజనను పెంచుతుందే తప్ప మేలు చేయదు.