- బంగ్లాదేశ్‌లో హిందు నేత అపహరణ, హత్య
- భారత్ ఖండన
- హిందువులు సహా మైనారిటీల రక్షణ బాధ్యత వహించండి
- యూనస్ సారథ్య మధ్యంతర ప్రభుత్వానికి భారత్ పిలుపు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ఒక హిందు నాయకుని అపహరణ, హత్యపై భారత్ శనివారం తీవ్రంగా స్పందించింది. ‘హిందువులు సహా మైనారిటీలను అందరినీ కాపాడే బాధ్యత వహించవలసింది’ అని ముహమ్మద్ యూనస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది. ‘బంగ్లాదేశ్‌లో హిందు మైనారిటీ నేత భబేశ్ చంద్ర రాయ్‌ను అపహరించి, దారుణంగా హతమార్చిన ఘటనకు మేము తీవ్రంగా కలవరం చెందాం’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ‘మధ్యంతర ప్రభుత్వ హయాంలో హిందు మైనారిటీలను ఒక పద్ధతి ప్రకారం వేధిస్తున్న సరళిలోనే ఈ హత్య జరిగింది. మరొక వైపు అటువంటి ఘటనల బాధ్యులు యథేచ్చగా సంచరిస్తున్నారు’ అని జైశ్వాల్ ఆక్షేపించారు. మైనారిటీలపై భారత వైఖరిని జైశ్వాల్ పునరుద్ఘాటిస్తూ, ‘మేము ఈ సంఘటనను గర్హిస్తున్నాం, సాకులు వెతకకుండా లేదా వ్యత్యాసాలు చూపకుండా హిందువులు సహా అందరు మైనారిటీలను పరిరక్షించే బాధ్యతను వహించవలసిందిగా మధ్యంతర ప్రభుత్వానికి మరొక పర్యాయం గుర్తు చేస్తున్నాం’ అని తెలిపారు. నిరుడు ఢాకా విమానాశ్రయంలో హిందు సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ దరిమిలా మైనారిటీల హక్కుల పరిరక్షణ బంగ్లాదేశ్ కర్తవ్యమని ఆ ప్రభుత్వానికి భారత్ పదే పదే గుర్తు చేసింది. మైనారిటీలు కాపాడవలసిందిగా యూనస్ ప్రభుత్వానికి జైశ్వాల్ ఒక వైపు విజ్ఞప్తి చేస్తూనే, మైనారిటీలపై దౌర్జన్య సంఘటనల గురించిన వార్తలను ‘మీడియా అతి ప్రచారం’గా తోసిరాజనజాలరని స్పష్టవ చేశారు.
శుక్రవారం స్థానిక మీడియా వార్తల ప్రకారం, 58 ఏళ్ల భబేశ్ చంద్ర రాయ్‌ను ఉత్తర బంగ్లాదేశ్‌లోని ఆయన నివాసంలో నుంచి అపహరించిన తరువాత ఆయన మృతదేహాన్ని గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. రాయ్‌కు సాయంత్రం సుమారు 4.30 గంటలకు ఇంటిలోనే ఉన్నారా అని వాకబు చేయడానికి నిందితులు ఆయనకు ఫోన్ చేసినట్లు రాయ్ భార్య ‘దిడైలీ స్టార్’కు తెలియజేశారు. అరగంట తరువాత తన భర్తను తమ ఇంటిలో నుంచి బలవంతంగా బయటకు తీసుకువెళ్లారని, ఆయను నరాబరి గ్రామానికి తీసుకువెళ్లి అక్కడ కొట్టారని కూడా ఆమె చెప్పారు. రాయ్‌ను స్పృహలేని స్థితిలో ఇంటికి తిరిగి పంపించినప్పుడు పొరుగు ఇంటివారు ఆయనను హుటాహుటిని సమీపంలోన ఒక ఆసుపత్రికి తరలించారు. ఆయన మరణించినట్లుగా ఆసుపత్రిలో వైద్యులు ప్రకటించారు. స్థానిక వార్తల ప్రకారం, రాయ్ దారుణ హత్య సందర్భంగా అనుమానితుల ఆచూకీని పోలీసులు ఇంకా తీయవలసి ఉంది.