తొలగించిన కార్పొరేషన్ అధికారులు
మంగళూరు: శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియచేసేందుకు స్థానిక హిందూ మహాసభ నాయకుడు ఒకరు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. ఆ ఫ్లెక్సీపై మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే, హిందుత్వ సంస్థల ఆరాధ్యుడు విడి సావర్కర్ చిత్రాలకు చోటు కల్పించడంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో స్పందించిన మున్సిపల్ అధికారులు ఆ ఫ్లెక్సీని గురువారం తొలగించారు. హిందూ మహాసభ స్తానిక నాయకుడు రాజేష్ పవిత్రన్ ఈ బ్యానర్ ఏర్పాటు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో మంగళూరు నగర కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాలపై ఫ్లెక్సీని తొలగించినట్లు వారు తెలిపారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా సూరత్‌కల్‌లో పోలీసు భద్రతను పటిష్టం చేసినట్లు వర్గాలు తెలిపాయి.ఇలా ఉండగా..ఆగస్టు 14న సూరత్‌కల్ ఫ్లైఓవర్‌పై సావర్కర్ ఫోటోతో ఉన్న బ్యానర్‌ను హిందూ మహాసభ ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. కాగా..ఉడుపి నగరంలో హిందూ రాష్ట్ర పేరిట సావర్కర్, సుభాష్ చంద్ర బోస్ ఫోటోలతో బ్రహ్మగిరి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్‌ను హిందూ సంస్థల కార్యకర్తలు శుక్రవారం స్వచ్ఛందంగా తొలగించారు. ఈ బ్యానర్‌పై ఎస్‌డిపిఐ, కాంగ్రెస్ అభ్యంతరం తెలిపాయి.