శేషనాగు పడగ, త్రిశూలం, ఢమరుకంలాంటివి గుర్తించాం
వీడియో సర్వే నివేదికలో వెల్లడి
వారణాసి: జ్ఞానవాపి మసీదు సర్వే నివేదికను గురువారం వారణాసి కోర్టుకు ప్రత్యేక సర్వే కమిటీ సమర్పించింది. సర్వేకు సంబంధించిన వీడియోను సీల్డ్ కవర్‌లో ఉంచి కోర్టుకు సమర్పించారు. కాగా ఈ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయినట్లు తెలుస్తోంది. మసీదులో ఆలయ అవశేషాలు ఉన్నట్లు కమిటీ నిర్ధారించినట్లు తెలుస్తోంది.ఈ వారం ప్రారంభంలో జరిపిన సర్వే సందర్భంగా హిందూ దేవతలకు చెందిన చాలా పగిలిపోయిన ముక్కలు కనిపించినట్లు జ్ఞానవాపి మసీదు కేసులో హిందూ పిటిషనర్ల తరఫున వాదిస్తున్న న్యాయవాదిఅజయ్ మిశ్రా విలేఖరులకు తెలిపారు. జ్ఞానవాపి మసీదు వీడియో సర్వే కోసం కోర్టు కమిషనర్‌గా అజయ్ శర్మ ఇంతకు ముందు పని చేసిన విషయం తెలిసిందే. సర్వే వివరాలను మీడియాకు ముందే లీక్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయనను కోర్టు ఆ బాధ్యతలనుంచి తప్పించి స్పెషల్ కమిషనర్‌గా విశాల్ సింగ్‌ను నియమించిన విషయం తెలిసిందే.
కాగా గురువారం నివేదికను కోర్టుకు సమరించిన తర్వాత ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో అజయ్ సింగ్ సర్వే సందర్భంగా హిందూ ఆలయం అవశేషాలుగా భావిస్తున్న శిధిలాల కింద పలు హిందూ దేవతా విగ్రహాలకు సంబంధించిన అవశేషాలు కనిపించినట్లు తెలిపారు. వీటిలో శేషనాగు పడగ, త్రిశూలం, ఢమరుకం, పద్మం లాంటివి ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే తనను బేస్‌మెంట్‌లోకి అనుమతించలేదని, ఈ శిథిలాలు దాదాపు 500 600 ఏళ్ల నాటివిగా కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. మూడు రోజుల పాటు జ్ఞానవాపి మసీదులో వీడియో నిర్వహించిన బృందంలో అజయ్ మిశ్రా కూడా ఉన్నారు. కాగా సర్వేలో మసీదు అధికారులు తమకు సహకరించలేదని, బాధ్యతలనుంచి తప్పించుకునే వారని ఆయన చెప్పారు. మసీదు అవరణలో గుమ్మటం తరహా నిర్మాణం ఉన్నట్లు అజయ్ మిశ్రా ధ్రువీకరించారు.
అయితే ఆ విషయాన్ని తాను తన నివేదికలో పేర్కొనలేదని ఆయన తెలిపారు. ఈ నిర్మాణాన్ని శివలింగంగా హిందువులు చెబుతుండగా , ముస్లింలు ఆ వాదనను తోసిపుచ్చుతూ, అది ఫౌంటెన్ మాత్రమేనని చెబుతున్నారు. కాగా కోర్టుకు మరో నివేదిక సమర్పించిన స్పెషల్ కోర్టు కమిషనర్ విశాల్ సింగ్ కూడా తన నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు మసీదులోపల బేస్‌మెంట్ గోడలపై పద్మం, ఢమరుకం, త్రిశూలం లాంటి సనాతన హిందూ ధర్మానికి చెందిన గుర్తులు కనిపించినట్లు ఆయనతెలిపారు. కాగా సర్వే వీడియోకు చెందిన మెమరీ చిప్‌ను కూడా కమిషన్ కోర్టుకు అందజేసింది.