అది దేశంలో ‘బాధ్యతాయుత’ సమాజం
భిన్నత్వంలోనే ఐక్యత ఉందని విశ్వసిస్తుంది
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భాగవత్
బర్ధమాన్ (పశ్చిమ బెంగాల్) : హిందు సమాజాన్ని ఏకం చేయడం ప్రధానమని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఆదివారం ఉద్ఘాటించారు. అది దేశంలో ‘బాధ్యతాయుత’ సమాజం అని, భిన్నత్వంలోనే ఐక్యత ఉందని అది విశ్వసిస్తుందని భాగవత్ చెప్పారు. బర్ధమాన్‌లో ఎస్‌ఎఐ మైదానంలో ఒక ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమం (ర్యాలీ)లో భాగవత్ ప్రసంగిస్తూ, ‘మేము హిందు సమాజంపైనే ఎందుకు దృష్టి కేంద్రీకరిస్తుంటామని జనం తరచు అడుగుతుంటారు. దేశంలో బాధ్యతాయుత సమాజం హిందు సమాజమేనన్నది నా సమాధానం’ అని చెప్పారు. ‘ఇది ప్రత్యేక కార్యక్రమం ఏమీ కాదు. సంఘ్ గురించి తెలియనివారు అది ఏమి కోరుకుంటున్నదని ఆశ్చర్యపోతుంటారు.
నేను సమాధానం చెప్పవలసి వస్తే హిందు సమాజం దేశంలో బాధ్యతాయుత సమాజం కనుక దానిని సంఘటితం చేయాలని సంఘ్ కోరుకుంటున్నదని చెబుతాను’ అని భాగవత్ పేర్కొన్నారు. ప్రపంచం భిన్నత్వాన్ని అంగీకరించవలసిన ప్రాముఖ్యత గురించి ఆయన నొక్కిచెప్పారు. ‘భారత్ కేవలం భౌగోళికం కాదు. భారత్‌కు ఒక ప్రకృతి ఉంది. ఈ విలువలతో జీవించలేనివారు ప్రత్యేక దేశాన్ని సృష్టించారు. కానీ, సహజంగా ఉండిపోయిన వారు భారత్ సారాన్ని అనుసరించారు. ఏమిటి ఈ సారం? అది హిందు సమాజం, ప్రపంచం భిన్నత్వాన్ని అంగీకరించడం ద్వారా మనుగడ సాగిస్తుంది. మనం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అని అంటాం, కాని భిన్నత్వమే ఏకత్వం అన్నది హిందు సమాజం అవగాహన’ అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వివరించారు. భారత్‌లో చక్రవర్తులు, మహారాజులను ఎవ్వరూ గుర్తుంచుకోరు, కానీ తన తండ్రి మాట చెల్లించేందుకు 14 ఏళ్లు వనవాసం చేసిన రాజును గుర్తుంచుకుంటారు.
(శ్రీరాముని ఉద్దేశించి, సింహాసనంపై తన సోదరుని పాదుకలను ఉంచిన, ఆయన తిరిగి రాగానే రాజ్యాన్ని అప్పగించిన వ్యక్తి గురించే ఆ ప్రస్తావన) అని భాగవత్ చెప్పారు. ‘ఈ లక్షణాలు భారత్‌ను నిర్వచిస్తుంటాయి.ఈ విలువలను పాటించేవారు హిందువులు, వారు సమస్త దేశం విభిన్నతను సమైక్యంగా ఉంచుతారు. ఇతరులకు నొప్పి కలిగించే పనులను చేయం. పాలకులు, మహోన్నతులు తమ పని చేసుకుపోతుంటారు, కానీ దేశ సేవ కోసం సమాజం ముందుకు రావాలి’ అని ఆయన అన్నారు. బెంగాల్ పోలీసులు మొదట అనుమతి నిరాకరించిన తరువాత కలకత్తా హైకోర్టు ఆమోదించిన మీడట ఈ ర్యాలీ నిర్వహించారు.