Wednesday, January 22, 2025

మెల్‌బోర్న్‌లో మూడో హిందూ దేవాలయం ధ్వంసం!

- Advertisement -
- Advertisement -

కాన్‌బెర్రా: మెల్‌బోర్న్‌లోని అల్బర్ట్ పార్క్‌లో సోమవారం మూడో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. పైగా భారత్‌కు వ్యతిరేకంగా గోడలపై రాశారు(గ్రాఫిటీ). కర్రం డౌన్స్‌లో శ్రీ శివ విష్ణు దేవాలయాన్ని ధ్వంసం చేసిన కొన్ని రోజుల్లోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ‘ది ఆస్ట్రేలియా టుడే’ రిపోర్టు చేసింది. ‘ఇస్కాన్’ మందిరం కమ్యూనికేషన్ డైరెక్టర్ భక్త దాస్ మాట్లాడుతూ ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేయడంపట్ల దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. అంతేకాక విక్టోరియా పోలీస్‌ల వద్ద ఫిర్యాదు దాఖలు చేశామన్నారు.

ఇలాంటి హీనమైన ఘటనకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని భక్తుడు, ఐటి కన్సల్టెంట్ శివేశ్ పాండే అన్నారు. వారిది హిందువులపట్ల విద్వేషం నిండిన మనస్తత్వం అని పేర్కొన్నారు. రెండు వారాల్లో హిందు మందిరాలపై విధ్వంసక దాడులు జరుగుతున్నా విక్టోరియా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మిల్ పార్క్ , కర్రం డౌన్స్ రెండుచోట్ల హిందూ మందిరాలను ధ్వంసం చేసినా చర్యలు మాత్రం ఇప్పటి వరకు నిల్ అనే చెప్పాలి.

ఇదివరకు జనవరి 16న తమిళుల ‘తై పొంగల్’ పండుగనాడు దర్శనానికి వెళ్లినప్పుడు మందిరంలో విధ్వంసం సృష్టించడమే కాక, గోడలపై హిందువులకు వ్యతిరేకంగా చెత్త రాతలు రాశారు. ఇక జనవరి 12న మిల్‌పార్క్ ప్రాంతంలోని స్వామినారయణ్ మందిరంలో కూడా విధ్వంసం చోటుచేసుకుంది. మందిరంలో విధ్వంసం, గోడలపై చెత్త రాతలను పటేల్ ఖండించారు. ‘నేను ఉదయం మందిరానికి చేరుకున్నప్పుడు గోడలపై హిందువుల పట్ల ఖలిస్థానీయుల విద్వేషపు రంగు రాతలను చూశాను’ అని పటేల్ తెలిపారు. హిందువుల పట్ల ఖలిస్థానీ మద్దతుదారుల రాతలు చూశాక ‘నాకు కోపం, భయం రెండూ కలిగాయి’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News