Monday, March 10, 2025

కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై దాడి

- Advertisement -
- Advertisement -

యుఎస్ కాలిఫోర్నియాలోని బిఎపిఎస్ హిందూ ఆలయాన్ని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అపవిత్రం చేశారని, యుఎస్‌లో ఇటువంటి ఘటన జరగడం రెండవ సారి అని సంస్థ వెల్లడించింది. చినో హిల్స్‌లోని శ్రీ స్వామినారాయణ్ మందిర్‌పై దాడి జరిగిందని బొచసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బిఎపిఎస్ బాప్స్) శనివారం తెలియజేసింది. ‘మరొక మందిర్, ఈ దఫా కాలిఫోర్నియా చినో హిల్స్‌లోని ఆలయాన్ని కొందరు అపవిత్రం చేసిన నేపథ్యంలో విద్వేషానికి వ్యతిరేకంగా హిందూ సమాజం సంఘటితంగా నిలుస్తోంది. చినో హిల్స్, దక్షిణ కాలిఫోరియాలోని సమాజంతో పాటు మేము ఎన్నడూ విద్వేషాన్ని పాతుకుపోనివ్వం’ అని బాప్స్ పబ్లిక్ అఫైర్స్ ‘ఎక్స్’ పోస్ట్‌లో స్పష్టం చేసింది. ‘మా ఉమ్మడి మానవత్వం, విశ్వాసం శాంతి, అభిమానం పరిఢవిల్లేలా చూస్తాయి’ అని సంస్థ పేర్కొన్నది.

అయితే, ఘటన వివరాలను సంస్థ తెలియజేయలేదు. ఉత్తర అమెరికాలో హిందూత్వం అవగాహనను మెరుగుపరచడానికి అంకితమైన ప్రచార సంస్థ ఉత్తర అమెరికా హిందువుల సంకీర్ణం(కోహ్నా) గతంలోని ఇటువంటి ఘటనలను ప్రస్తావించి, సమగ్ర దర్యాప్తును డిమాండ్ చేసింది. ‘మరొక హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఈ దఫా కాలిఫోర్నియా చినో హిల్స్‌లోని దిగ్గజ బాప్స్ ఆలయం ఈ దాడికి గురైంది. హిందువుల పట్ల విద్వేషం ఏదీ లేదని, హిందూ భయం మన ఊహల్లో నుంచి పుట్టిందేనని మీడియా, విద్యా సంస్థలు స్పష్టం చేస్తున్న ప్రపంచంలో ఇది కేవలం మరొక రోజు’ అని ఆ సంస్థ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నది. ‘లాస్ ఏంజిల్స్‌లో సదరు ‘ఖలిస్తాన్ రెఫరెండం’ ముగింపునకు వస్తున్న రోజు ఇది సంభవించడం ఆశ్చర్యమేమీ కాదు’ అని ఆ సంస్థ వ్యాఖ్యానించింది. గత కొన్ని సంవత్సరాల్లో అపవిత్ర ఘటనలు చోటు చేసుకున్న లేదా దోపిడీలు జరిగిన పది ఆలయాల జాబితాను కోహ్నా విడుదల చేసింది. కాగా, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఈ ఘటనకు తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

కాలిఫోర్నియా చినో హిల్స్‌లోని హిందూ ఆలయాన్ని అపవిత్రం చేసిన ఘటనను భారత్ ఆదివారం తీవ్ర స్థాయిలో గర్హించింది. దీనికి బాధ్యులపై ‘కఠిన చర్య‘ తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఈ సంఘటన దృష్టా ప్రార్థనా మందిరాలకు తగిన భద్రత సమకూర్చాలని కూడా భారత్ కోరింది. ‘కాలిఫోర్నియా చినో హిల్స్‌లోని ఒక హిందూ ఆలయాన్ని అపవిత్రం చేసినట్లు వార్తలు చూశాం. అటువంటి దుస్సంఘటనలను నిర్దంద్వంగా ఖండిస్తున్నాం’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలియజేశారు. ‘ఈ ఘటనలకు బాధ్యులపై కఠిన చర్య తీసుకోవలసిందని, ప్రార్థనా మందిరాలకు తగిన భద్రత ఏర్పాటు చేయాలని స్థానిక భద్రత సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని జైశ్వాల్ మీడియాతో చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News