ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ జాతీయ అసెంబ్లీతో పాటు ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ పోటీ చేస్తుండటం విశేషం. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునేర్ జిల్లా నుంచి డాక్టర్ సవీరా పర్కాశ్ ఎన్నికల బరిలోకి దిగారు. పికె 25 స్థానానికి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. జనరల్ స్థానాల్లో తప్పనిసరిగా 5% మహిళా అభ్యర్థులు వుండాలంటూ పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఇటీవల కీలక సవరణలు చేసింది. ఈ క్రమంలోనే బునేర్ జిల్లాలోని జనరల్ స్థానం నుంచి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ టికెట్‌పై సవీరా పోటీ చేస్తున్నారు. బునేర్ నుంచి సార్వత్రిక ఎన్నికలకు పోటీ చేస్తున్న తొలి మహిళ కూడా ఈమే కావడం విశేషం. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి సవీరా పర్కాశ్ 2022లో ఎంబిబిఎస్ పూర్తి చేశారు. ఆమె తండ్రి ఓం పర్కాశ్ రిటైర్డ్ డాక్టర్. గత 35 ఏళ్లుగా ఓం పర్కాశ్ బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వం వహిస్తున్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
తండ్రి అడుగుజాడల్లోనే సవీరా కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె బునేర్‌లో పిపిపి మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 28,600 మంది పోటీ చేస్తుండగా ఇందులో దాదాపు 3000 మంది మహిళలున్నారు. అయితే, హిందూ కమ్యూనిటీకి చెందిన ఏకైక మహిళ సవీరానే. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బునేర్ నుంచి ఆమె పోటీ చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఆమెకు పలువురు హక్కుల కార్యకర్తలు, సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్లు మద్దతు ప్రకటిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఇప్పుడు ఉగ్రవాదులు ఏకంగా జాతీయ అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. లష్కరే తోక పార్టీగా పేరున్న పిఎంఎంఎల్ తరపున ఓ ఉగ్ర నాయకుడు ఎన్నికల బరిలోకి దిగాడు. ఉగ్రవాదులను కట్టడి చేశామని అంతర్జాతీయ సమాజానికి పాకిస్థాన్ ఎన్ని మాటలు చెబుతున్నా చేతలు మాత్రం వేరేగా ఉన్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాది, 26/11 ముంబయి దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ స్థాపించిన పార్టీ ఇప్పుడు ఏకంగా అక్కడి సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగింది. ‘ది పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్’ (పిఎంఎంఎల్) పేరిట సయీద్ ఓ పార్టీని ఏర్పాటు చేశాడు.
గతంలో లష్కరే తరపున మిల్లీ ముస్లిం లీగ్ పేరిట పార్టీ ఉండేది. కానీ, దానిపై 2018లో నిషేధం విధించారు. ఆ పార్టీ మూలాల నుంచే తాజాగా పిఎంఎంఎల్‌ను ఏర్పాటు చేశారు. దీని గుర్తు కుర్చీ. ఈ పార్టీకి ఖలీద్ మసూద్ సింధూ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. తమ పార్టీ అన్ని నేషనల్, ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుందని అతడు ప్రకటించాడు. పైకి మాత్రం తమ పార్టీకి ఉగ్ర సంస్థ లష్కరేతో ఎటువంటి సంబంధం లేదని అతడు చెబుతున్నాడు. కానీ, పార్టీ తరఫున హఫీజ్ తనయుడు తల్హా సయీద్ ఎన్‌ఎ 127 స్థానం నుంచి బరిలోకి దిగుతున్నాడు. 2000 సంవత్సరంలో హఫీజ్ సయీద్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అయినప్పటికీ అతడిపై ఇతర ఉగ్ర నేరాలను పాక్ మోపలేదు. అంతేకాదు అతడిని భారత్‌కు అప్పగించలేదు. 2019 జులై నుంచి అతడు పాకిస్థాన్ జైల్లోనే ఉన్నాడు. 2022 ఏప్రిల్లో ఉగ్ర నిధుల సేకరణ ఆరోపణలపై శిక్ష విధించారు. భారత హోం మంత్రిత్వ శాఖ గతేడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం తల్హా సయీద్ లష్కరే క్లెరిక్ విభాగానికి అధిపతి. ఈ సంస్థ నిధుల సేకరణ, ప్లానింగ్ నియామకాల్లో అతడే చురుగ్గా వ్యవహరిస్తున్నాడు.
తల్హా సయీద్ పేరును మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తల్హా సయీద్ ఉగ్ర కార్యకలాపాల్లో కీలకం గా వ్యవహరిస్తున్నాడని మేం విశ్వసిస్తున్నాం. అందుకే చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, 1967 కింద అతడిని ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నామని కేంద్ర హోం శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో తల్హా 32వ వ్యక్తి. ఇదే జాబితాలో హఫీజ్ సయీద్ పేరు కూడా ఉంది. 47 ఏళ్ల తల్హా సయీద్ పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జన్మించాడు. తండ్రి స్థాపించిన లష్కరే తోయిబా ముఠాలో సీనియర్ నాయకుడైన తల్హా ఈ సంస్థ క్లెరిక్ విభాగానికి హెడ్‌గా వ్యవహరిస్తూ భారత్, అఫ్గానిస్థాన్‌లో లష్కరే నియామకాలు, నిధుల సేకరణ, దాడులకు కుట్రలు రచించడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న రెండు కేసుల్లో హఫీజ్ సయీద్‌కు 33 ఏళ్ల జైలు శిక్ష పడిన మరుసటి రోజే తల్హాను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. తాజా పరిణామాలతో ఉగ్రవాదులను కూడా పాక్ చట్ట సభల్లోకి చేర్చేందుకు అక్కడ రంగం సిద్ధమవుతోంది. పాక్‌లో 2024 ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.