అమరావతి: హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టిడిపి కైవసం చేసుకుందని హిందూపురం ఎంఎల్ఎ నందమూరి బాలకృష్ణ తెలిపారు. వైసిపితో విసిగి చెందిన కౌన్సిలర్లు టిడిపిలో చేరారని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపురంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని కొనియాడారు. పద్మభూషణ్ అవార్డు రావడం తనలో కసి పెంచిందన్నారు. తనకు ఎవరూ చాలెంజ్ కాదు అని, తనకు తానే చాలెంజ్ అని బాలకృష్ణ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుందని స్పష్టం చేశారు. ఎన్ టిఆర్ కు భారతరత్న కోట్లాది మంది తెలుగు ప్రజల ఆకాంక్ష అని, దాన్ని తెలుగు ప్రజలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థి రమేష్ దక్కించుకున్నారు. వైసిపి అభ్యర్థి లక్ష్మిపై రమేష్ గెలుపొందారు. టిడిపి అభ్యర్థికి 23 మంది కౌన్సిలర్ల మద్దతు పలకగా వైసిపి అభ్యర్థి లక్ష్మికి 14 మంది కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు.