Monday, December 23, 2024

కరాచీలో 150 ఏళ్లనాటి హిందూ ఆలయం కూల్చివేత

- Advertisement -
- Advertisement -

కరాచీ : పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీలో 150 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని శుక్రవారం రాత్రి అక్కడి అధికార యంత్రాంగం కూల్చివేసింది. ఈ సంఘటనకు హిందూ సమాజం దిగ్భ్రాంతి చెందగా, ఇది పాతది అని, ప్రమాదకరంగా ఉందని అధికారులు ప్రకటించి కూల్చివేశారు. కరాచీ సోల్జర్ బజార్ ప్రాంతంలో ఉన్న మేరీ మాత ఆలయాన్ని శుక్రవారం రాత్రి బాగా పొద్దు పోయాక, భారీ ఎత్తున పోలీస్ భద్రత మోహరించి బుల్‌డోజర్లతో నేలమట్టం చేశారు. తెల్లవారు జామున ఈ కూల్చివేత జరిగిందని, ఈ విషయాన్ని తమకు ఎవరూ తెలియజేయలేదని రామ్‌నాథ్ మిశ్రా మహరాజ్ ఆరోపించారు. ఆ ప్రాంతంలో పాత హిందూ దేవాలయాలను ఆయన పర్యవేక్షిస్తుంటారు. సమీపాన గల శ్రీ పంచ్ ముఖి హనుమాన్ మందిర్ సంరక్షకుడుగా ఆయన ఉంటున్నారు. ఆలయం ప్రహరీగోడ, ప్రధాన ద్వారం తప్ప లోపల ఆలయమంతా నేలమట్టం చేశారని ఆయన తెలిపారు.

150 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఆవరణలో నిధి ఉందని కథలు కథలుగా చెబుతుంటారని, 400 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ స్థలంపై భూకబ్జాదారులు, ఇతరులు గత కొన్నేళ్లుగా కన్నేశారని చెప్పారు. కరాచీకి చెందిన మద్రాసీ హిందూ సమాజం ఈ ఆలయాన్ని నిర్వహిస్తోందని, ఇది చాలా పాతది, ప్రమాదకరమైనదని నిర్వాహకులు అంగీకరించారని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. ఆలయ యాజమాన్యం అయిష్టంగానే ఆలయం లోని విగ్రహాలను తాత్కాలికంగా ఒక చిన్న గదికి తరలించారని చెప్పారు. ఆలయ స్థలం ఒక డెవలపర్‌కు ఫోర్జరీ డాక్యుమెంట్లతో విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకని ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని గత కొన్నేళ్లుగా ఆలయ యాజమాన్యంపై ఒత్తిడి వస్తోందని అక్కడి హిందూ సమాజ నాయకుడు రమేష్ చెప్పారు. ఈ కూల్చివేతపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పాకిస్థాన్ హిందూ కౌన్సిల్‌కు, సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీషా, ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు హిందూ సమాజం అభ్యర్థించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News