Sunday, January 19, 2025

ప్రముఖ హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : హిందుస్తానీ సుమధుర సంగీత స్వరాలతో హృదయాన్ని ఉర్రూతలూగించే ప్రముఖ హిందుస్తానీ గాయకుడు 55 ఏళ్ల ఉస్తాద్ రషీద్ ఖాన్ మంగళవారం కోల్‌కతా సిటీ ఆస్పత్రిలో కన్నుమూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌తో ఆయన నాలుగేళ్లుగా పోరాడుతున్నారు. గత డిసెంబర్ 23న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల పాటు ఐసియులో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఇంతకు ముందు ఆయన ముంబై లోని టాటా మెమోరియల్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

ఆ తరువాత కొల్‌కతా ఆస్పత్రికి తరలించారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంగీత సామ్రాట్ మియాన్ తాన్‌సేన్ 31 వ తరానికి చెందిన గాయకునిగా గుర్తింపు పొందిన ఉస్తాద్ రాంపూర్ సహస్వాన్ గాయకుల సంప్రదాయ సంగీతంలో ఆఖరి లెజెండ్‌గా ప్రఖ్యాతి వహించారు. విలంబిత్ ఖయాల్ అనే సంగీత సంప్రదాయ పద్ధతిలో మాస్టర్ అనిపించుకున్నారు. మూడు దశాబ్దాలుగా తన గాత్ర సంగీతంతో లక్షలాది మందిలో చెరగని ముద్రవేశారు. ఉత్తరప్రదేశ్ లోని బదౌన్‌లో జన్మించిన ఉస్తాద్ రషీద్‌ఖాన్ తన తాత ఉస్తాద్ నిసార్ హుస్సేన్ ఖాన్ వద్ద శిక్షణ తీసుకున్నారు. మొదటిసారి ఆయన 11 సంవత్సరాల వయసులో రంగస్థల ప్రదర్శన నిర్వహించారు.

ఆ తర్వాత సినిమా లోనూ ఆయన పాటలు పాడారు. ‘జబ్ వి మెట్ ’ లో ఆయన ‘ఆవోగే జబ్ తుమ్ సాజ్నా ’ అనే పాట బాగా పాప్యులర్ అయింది. ఆయన ఉస్తాద్ అమీర్ ఖాన్, పండిట్ భీంసేన్ జోషి సంగీతానికి ప్రభావితుడయ్యారు. సినిమాల్లో ఆయన పాడిన పాటల్లో ‘తెరే బినా మోహే చైన్ ’సూపర్ హిట్ అయింది. షారుఖ్ ఖాన్ హిట్ చిత్రం మైనేమ్ ఈజ్ ఖాన్ లోను, అల్లా హాయ్ రెహెమ్ పాట పాడారు. అలాగే రాజ్3 , కాదంబరి, షాదీ మే జరూర్ ఆనా, మంటో తదితర చిత్రాల్లోనూ ఆలపించారు. బెంగాలీ పాటలకు కూడా స్వరం సమకూర్చారు.

రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాలను ఖాన్ రవీంద్ర సంగీత్ పేరున ఆల్బమ్ , బైతకీ రబీ , 2000లో విడుదల చేశారు. రవీంద్ర సంగీతం ఆలపించకుండా ఏ సంగీత గాయకుడు తన ప్రయాణాన్ని పూర్తి చేయలేడని ఆ సమయంలో పేర్కొనడం గమనార్హం. దశాబ్దాల పాటు తన గాత్రంతో సంగీత ప్రపంచాన్ని మంత్ర ముగ్ధులను చేసిన ఉస్తాద్ భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నుంచి 2012లో బంగభూషణ్ బిరుదులు అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News