జన్మనిచ్చి తీర్చిదిద్దిన ఘనత అంతా ఆమెదే
తల్లి హీరాబెన్‌కు వంద ఏళ్లు ఘట్టంలో స్పందన
కష్టాలు త్యాగాల ప్రతీకగా జీవిత సత్యాలు నేర్పింది
ఈ వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం ఆమె సంధించినవే
ప్రధాని మోడీ భావోద్వేగపు సుదీర్ఘ బ్లాగ్
న్యూఢిల్లీ : తన జీవితంలోని అన్ని అంశాలకు తన తల్లి స్ఫూర్తి ప్రదాత అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తల్లి త్యాగాలు, ఆమె జీవితంలోని అన్ని అంశాలు తనకు వ్యక్తిత్వాన్ని అంతకు మించి ఆత్మవిశ్వాసాన్ని నేర్పాయని పేర్కొన్నారు. తన మెదడును తగు విధంగా తీర్చిదిద్దాయని తెలిపారు. ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ శనివారం వందేళ్లలోకి ప్రవేశించింది. ఈ శతవసంతాల నేపథ్యంలో ప్రధాని మోడీ తమ బ్లాగ్‌లో తల్లి ఔన్నత్యం తెలియచేస్తూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. హిందీ ఇంగ్లీషులోనే కాకుండా ఈ బ్లాగ్ సందేశం దేశంలోని పలు ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంది. చిన్నతనం నుంచి మాతృమూర్తి తనకు పేదల బాగోగుల గురించి పాటుపడాలనే ఆలోచనలను నేర్పిందని, ఇదే కాలక్రమంలో తాను గరీబ్ కల్యాణ్ దిశలో సాగేందుకు, ఈ ప్రధాన అంశంతోనే పలు సంక్షేమ పథకాలు చేపట్టడానికి, కార్యక్రమాలు అమలు చేయడానికి దారితీసిందని ప్రధాని తెలిపారు. జీవితంలో ఎప్పుడూ లంచాలు తీసుకోరాదని ఆమె చెపుతూ వచ్చిందని, ఆమె మాటలు తనకు శిరోధార్యం అయ్యాయని ప్రధాని తెలిపారు.
అమ్మ కాళ్లు కడిగి ఆశీస్సు పొంది ..
అమ్మకు వంద సంవత్సరాలు వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ శనివారమే ఉదయం పూట గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తమ్ముడు పంకజ్ మోడీ నివాసానికి వెళ్లారు. అక్కడనే ఉంటున్న తల్లి హీరాబెన్‌కు నమస్కరించి ఆమె కాళ్లు కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. అరగంటకు పైగా గడిపి తిరుగు ప్రయాణం అయ్యారు. స్థిరచిత్తంతో వ్యవహరిస్తేనే జీవితంలో సమగ్రరీతిలో ముందుకు సాగేందుకు వీలేర్పడుతుందని ఆమె దైనందిన జీవిత క్రమంలో చెప్పిన మాటలను ఆచరిస్తూ వస్తున్నానని బ్లాగ్‌పోస్టులో వివరించారు. ఇతరుల సంతోషంలో తన తల్లి ఆనందించే తత్వం సంతరించుకుందని , విశాల హృదయం ప్రత్యేకత అని పేర్కొన్నారు.
ఇంట్లో పెరిగిన అబ్బాస్‌మియాకు అమ్మే అంతా
తన తండ్రి ఓ ముస్లిం అబ్బాయి అబ్బాస్‌ను ఇంటికి తీసుకువచ్చి, విద్యాబుద్ధులు నేర్పిన విషయాన్ని తెలియచేశారు. తన తండ్రి స్నేహితుడు అకాల మరణం చెందడంతో ఆయన కొడుకు అబ్బాస్ తమ ఇంట్లోనే పెరిగాడని, తల్లి ఆయన ఆలనాపాలనను సొంత బిడ్డలలాగానే చూసుకుందని ప్రధాని గుర్తు చేశారు. ప్రతి ఏడు రంజాన్ ఈద్ వస్తే ఆయనకు ఇష్టమైన వంటకాలు చేసిపెట్టేదని , పండుగలప్పుడు ఇరుగుపొరుగు వారు తమ ఇంటికి వచ్చి తల్లి ప్రత్యేక వంటకాల రుచి చూసి వెళ్లేవారని ఇదో ఆనవాయితీ అయిందని తెలిపారు. తల్లిలో తాను భారతీయ మాతృశక్తిని చూశానని పేర్కొన్నారు.
భారతీయ మహిళకు అసాధ్యం ఏదీ లేదు
తన తల్లి పట్టుదల, త్యాగనిరతి ఇవన్నీ చూస్తే , అదే విధంగా దేశంలోని కోట్లాది మంది మహిళామూర్తులను గమనిస్తే వారు సాధించలేనిది లేదని అన్పిస్తుంది. వారి జీవితంలో అసాధ్యం అనే దానికి అర్థం ఉండదని తాను భావిస్తానని తెలిపారు. అందరు తల్లులులాగానే తన తల్లి కూడా నిరాడంబరురాలు, అయితే ఇదేదశలో అసాధారణ వ్యక్తి. ఆర్బాటాలు ఆమెకు ఇష్టం లేదని, తనతో కలిసి రెండు సార్లే ప్రజల ముందుకు వచ్చారని తెలిపారు. తల్లికి చిన్నతనంలోనే తల్లి మరణించిందని, దీనితో తనకు తల్లి ముఖం కూడా ఆమె ఒడి స్పర్శ కూడా సరిగ్గా తెలియదని చెపుతూ ఉంటారని మోడీ బ్లాగ్‌లో పెట్టారు. వాద్‌నగర్‌లో మట్టిగోడల పెంకుటిల్లు తమకు ఆవాసంగా ఉండేది. వానలు పడ్డప్పుడు ధారలుగా పడే నీటిని వంటపాత్రలలో పట్టే క్రమంలో అమ్మ పడే కష్టం , కష్టాలను ఎదురీదడంలో మహిళ ఓపిక ఆత్మ శక్తిని చాటేదన్నారు.
పాచీపనులతో కుటుంబ భారంలో పాలు
ఇంటిపనులు అన్ని ఆమె చేయడమే కాకుండా , కొన్ని ఇండ్లలో పనిమనిషిగా కూడా ఉండేదని, ఈ విధంగా కుటుంబ ఆదాయానికి ఊతం ఇస్తూ వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా రాట్నంపై నూలు వడకడం ద్వారా వచ్చే డబ్బు కుటుంబ ఖర్చుకు పనికి వచ్చేదని, ఈ విధంగా కష్టాలకు ఎదురీది కుటుంబ పోషణలో పాలుపంచుకునే భారతీయ మహిళకు ఆమె తార్కాణం అయ్యారని తెలిపారు. స్వచ్ఛత పరిశుభ్రతకు ఆమె ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. పారిశుద్ధ కార్మికులను గౌరవించడం, ఆదరించడం ఆమె నుంచే తాను నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఆమె బాధ్యతాయుత పౌరురాలు, పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకూ ప్రతిసారి ఓటేస్తూ తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారని తెలిపారు.
టీచర్‌గా భావించి సన్మానించాలనుకున్నా
చదువుకు నోచుకోకపోయినా నేర్చుకునే తపన ఉంటే జీవితం అన్ని నేర్పుతుందని తల్లి చెప్పింది. మనిషికి నిజంగానే తల్లిని మించిన గురువు లేదు. తాను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తనకు చిన్నతనంలో చదువు చెప్పిన టీచర్లతో పాటు తల్లిని కూడా గురువుగా భావించి ఆమెకు కూడా సన్మానం చేయాలనుకున్నా, అందుకు ఆమె నిరాకరించింది. తాను జన్మనిచ్చినా విద్యను అందించింది తాను కాదని, అలవర్చుకునే గుణానికి చదువు చెప్పిన వారే కారకులని తెలిపిందని ప్రధాని మోడీ తెలిపారు.