Monday, January 13, 2025

సంకెళ్ల సంచలనం.. రైతుకు బేడీలు

- Advertisement -
- Advertisement -

లగచర్ల నిందితుడిని బేడీలతో సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించిన
పోలీసులు వివాదంగా మారడంతో బేడీల తొలగింపు ఛాతీనొప్పి
పరీక్షలకు గాంధీ ఆసుపత్రికి రిఫర్ సిఎం ఆదేశాలతో నిమ్స్‌కు
తరలింపు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న నిమ్స్ డైరెక్టర్ బీరప్ప

మనతెలంగాణ/సంగారెడ్డి బ్యూరో/హైదరాబాద్ : వికారాబాద్ కలెక్టర్‌పై లగచర్లలో జ రిగిన దాడి కే సులో కంది జైలులో నిందితుడి గా ఉన్న ఖైదీ హీర్యా నాయక్‌కు ఛాతి నొప్పి రావడంతో సంగారెడ్డిలో జిల్లా ఆస్పత్రికి గు రువారం తరలించారు.ఈ క్రమంలో జై లు సిబ్బంది అతనికి బేడీలు వేసి తీసుకురావడం వివాదస్పదంగా మారింది. తనకు ఛాతి నొప్పి వస్తుందని చెప్పడంతో బుదవారం ఒక సారి జిల్లా ఆస్పత్రికి తరలించి పరీక్షలు జరిపారు. ఈ పరీక్షలో నార్మల్‌గా ఉందని తేల్చారు. అయినప్పటికి మరో సారి గురువారం తీసుకురావాలని వైద్యులు సూచించారు. దీంతో గురువారం తిరిగి జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ సమయంలో అతనికి బేడీలు వేసి ఉండడం..మీడియా కంటపడింది. దీంతో ఒక్క సారిగా వివాదస్పదంగా మారింది. వైద్యుల సూచన మేరకు గాంధీ ఆస్పత్రికి తరలించే సమయంలో మాత్రం బేడీలను తొలగించారు.

దీనిపై విపక్ష బిఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసించారు. ఈ దుశ్చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు.భూసేకరణను అడ్డుకున్న రైతులపై కేసులు వేయడం ఒక ఎత్తయితే, బేడీలు వేయడం మరింత దుర్మార్గమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను ఎవ్వరూ సహించబోరని అన్నారు.ఇదేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు.ఇదిలా ఉంటే మరో ఇద్దరు ఖైదీలు రాఘవేందర్, బసప్పలు కూడా అనారోగ్యంతో బాధ పడుతున్నారని,వారికి కూడా మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. వారిని ఆయన పరామర్శించారు.

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న ఈర్యానాయక్ తనకు గుండె సమస్య ఉందని గతంలోనే చెప్పినట్లు అతని బంధువులు తెలిపారు. మూడు నెలల కింద సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షలు చేసి స్టంట్ వేయ్యాలని వైద్యులు చెప్పారని అన్నారు. ఆర్థికంగా డబ్బులు లేక పోవడంతో సర్జరీ చేయించుకోలేదన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ మాట్లాడుతూ ఈర్యానాయక్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని, అన్ని పరీక్షలు నార్మల్ గా నే ఉన్నాయని, ఎందుకైనా మంచిదన్న కారణంతో గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశామని అన్నారు. గతంలో ముంబయిలో పని చేసినప్పుడు కూడా ఛాతి నొప్పి వచ్చిందని, ఆ రిపోర్టులు మాత్రం అందుబాటులో లేవని ఖైదీ ద్వారా తెలిసిందన్నారు.

హీర్యానాయక్ ఆరోగ్యపరిస్థితి నిలకడ
సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు హీర్యానాయక్‌ను హైదరాబాద్‌లో నిమ్స్ ఆస్పత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. హీర్యానాయక్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప మీడియాకు వెల్లడించారు. ఈసీజి, 2డి ఎకో, బీపీ, అన్ని పరీక్షలు నిరహించగా అన్నీ నార్మల్‌గా ఉన్నట్టు ఆయన వివరించారు. రైతు హీర్యానాయక్‌కు మెరుగైన వైద్యం అందించమని సీఎం కార్యాలయ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు కూడా డైరెక్టర్ తెలిపారు. గుండె వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్ వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందిస్తునట్టు డైరెక్టర్ బీరప్ప వివరించారు.

ఇలా ఉండగా సంగారెడ్డి జైలులో ఉన్న హీర్యానాయక్ తనకు చాతిలో నొప్పి వస్తుందని జైలు అధికారుల దృష్టికి బుధవారం తీసుకరావడంతో జైలు అధికారులు అతన్ని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా, అంతా నార్మల్‌గా ఉన్నట్టు తేల్చారు. తిరిగి మరసటి రోజు (గురువారం) కూడా మరోసారి ఆస్పత్రికి తీసుకరావాల్సిందిగా వైదులు సూచించారు. దీంతో గురువారం ఉదయం సదరు రైతు హీర్యానాయక్‌ను బేడీలతో ఆస్పత్రికి తీసుకరావడంతో ఆ దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడం, దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించడం తెలిసిందే.

హీర్యానాయక్ పై బిఎన్‌ఎస్ 191 సెక్షన్ కింద కేసు
కలెక్టర్‌పై దాడి చేసిన ఘటనలో రైతు హీర్యానాయక్‌తో 14 మంది రైతులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. వీరంతా ప్రస్తుతం సంగారెడ్డి జైలులో విచారణ ఖైదీలుగా ఉండగా, ఇందులో హీర్యానాయక్ పై బిఎన్‌ఎఎస్ (భారత్ న్యాయ్ సంహిత) సెక్షన్ 191 కింద కేసు నమోదు అయింది. కాగా ఈ సెక్షన్ తీవ్రమైన నేరం కాకపోవడంతో నిందితునికి బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే అంశం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బిఎన్‌ఎస్ సెక్షన్ 191 కింద కేసు నమోదు చేసిన నిందితునికి బేడీలు వేయడం రాజ్యాంగంలోని 14,16, 19 ఆర్టికల్స్‌కు విరుద్దమని నిందితుని తరఫు న్యాయవాదులు తప్పుపట్టారు. ఇది నూతన క్రిమినల్ చట్టానికి, పోలీసు, జైలు మాన్యువెల్స్‌కు కూడా విరుద్దమని, పైగా అండర్ ట్రయల్ ఖైదీల హక్కులను హరించడమే అవుతుందని ఆక్షేపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News