శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు నాన్‌స్టాప్ విమానం
బెంగళూరు : అమెరికా లోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు వరకు ఉత్తర ద్రువం మీదుగా 16000 కిలోమీటర్ల దూరం నాన్‌స్టాప్‌గా విమానం నడిపి నలుగురు ఎయిర్ ఇండియా మహిళా పైలట్లు రికార్డు సృష్టించారు. కెప్టెన్ జోయా అగర్వాల్, కెప్టెన్ పపగారి తన్మయ్, కెప్టెన్ ఆకాన్షసోనోవేర్, కెప్టెన్ శివానీ మన్హాస్ ఈ నలుగురూ ఈ చారిత్రక రికార్డుకు కారకులయ్యారు. ఈరోజు తాము ప్రపంచ చరిత్ర సృష్టించగలిగాం. కేవలం ఉత్తరద్రువం మీదుగా విమానం నడపడమేకాదు, నలుగురు మహిళలం ఎవరి సహాయం లేకుండా విమానం నడపగలిగామని దీనికి తామెంతో సంతోషిస్తున్నామని, మరింత గర్వపడుతున్నామని కెప్టెన్ జోయా అగర్వాల్ తన అనుభూతిని వెల్లడించారు.
ఈ రూటులో ప్రయాణించం వల్ల 10 టన్నుల ఇంథనం ఆదా అయిందని ఆమె చెప్పారు. ఇది చాలా ఉత్తేజభరితమైన అనుభవమని, ఇదివరకెన్నడూ ఇలా చేయలేదని బెంగళూరు లోని కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకోడానికి 17 గంటలు పట్టిందని మరో పైలట్ శివానీ మన్హాస్ వెల్లడించారు. ఎఐ 176 నెంబరు గల ఈ ఎయిర్ ఇండియా విమానం స్థానిక కాలమానం ప్రకారం అమెరికాలో శనివారం రాత్రి 8.30 కి బయలుదేరి, సోమవారం తెల్లవారు జామున 3.45 గంటలకు బెంగళూరు చేరుకుంది. ఎయిర్ ఇండియా ఈ నలుగురు మహిళా పైలట్లను అభినందించింది.