Monday, December 23, 2024

శాసన శాస్త్రంలో భాషా విప్లవం!

- Advertisement -
- Advertisement -

కాలగమనంలో ఋతువులన్నీ ఒకదాని తర్వాత మరొకటి క్రమబద్ధంగా వస్తూ ప్రపంచానికి, లోకానికి ఎప్పటికప్పుడు కొత్త అనుభూతులను, అనుభవాలను అందిస్తూ , కొత్త పరిస్థితులని సృష్టింప జేస్తూ , కొత్త వ్యక్తులనూ, విషయాలను, వస్తువులను లోక చిత్ర పటం పైకి తీసుకు వస్తూ ఎప్పటికప్పుడు ప్రతి తరంలో, ప్రతి యుగంలో ప్రత్యేక ముద్రను వేస్తూ పయనిస్తుంది. అందుకే history repeats itself ఆని మేధావులు ప్రస్తుతించారు. దానికి ఇంకొంచెం కలిపి History repeats itself in a new form, new set-up with new persons and profiles అని చెప్పాలి.
తెలంగాణ చరిత్ర కూడా అంతే !
తెలంగాణ చరిత్ర లోకి పయనిస్తే, తెలంగాణ మూలాల్లోకి ఒక్కసారి దృష్టి సారిస్తే …. ఇక్కడ వసంతాల వంటి నూతన ఆవిష్కరణలు ఎన్ని ఉన్నాయో, కాల ప్రవాహంలో రాలిపోయిన శిశిరాల వంటి శిథిల కోటలు, కట్టడాలు, నిర్మాణాలు కూడా అన్నే ఉన్నాయి. గ్రీష్మకాలపు ఎండల వంటి యుద్ధగాధలు ఎన్ని ఉన్నాయో, హేమంత రుతువులోని శీతల పవనాల వంటి కళా సాంస్కృతిక సాహితీ సౌరభాలు అన్నే ఉన్నాయి. వర్ష రుతువు లాంటి ప్రజా సంక్షేమ పాలనా రీతులు ఎన్ని ఉన్నాయో, శరదృతువు లాంటి సామాజిక, ఆర్థిక, సాంకేతిక ప్రగతులు అన్నే ఉన్నాయి. ఇలా షడ్రుతువుల ప్రాభవా వైభవాలు కొలువైన కోన, తెలంగాణ!
అందుకే కాలచక్ర గమనంలో ఈ భూమిపై ఎన్ని పరిణామాలు సంభవించాయో, అవన్నీ తెలంగాణ చరిత్ర ప్రస్థానం లో కూడా సంభవించాయేమో అనిపిస్తుంది! అందుకే ప్రపంచ చరిత్ర గమనానికి సంక్షిప్త రూపంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ప్రస్థానం మనకు కనిపిస్తుంది (History of Telangana is a miniature of world History) అనడంలో అతిశయోక్తి లేదు!
ఇలాంటి ప్రాచీనత, ప్రాక్ వైభవము, పురాతన తత్వం ఉన్న తెలంగాణ చరిత్రలో శాసనాలది (Inscriptions & Edicts) ఒక ప్రత్యేక అధ్యాయం! సాధారణంగా శాసనాలను ఆయా కాలాలలో, ఆయా రాజ్యాలు, ఆయా చక్రవర్తులు తాము చేసిన పనులు వాటికి సంబంధించిన వివరాలను, విశేషాలను ప్రజలకి ‘ఎరుక‘ (to make acquaint) పరచడం కోసం, వారికి తెలియచేయడం కోసం వేయించారనే విషయం సుస్పష్టం.
ఈ శాసనాలను సాధారణంగా రాతి (Rocks) మీద, లోహ పత్రాల (Metal) మీద, చెక్క లేదా కలప (Wood) మీద చెక్కడం జరిగింది. దీని వలన కాల గర్భంలో మట్టి పొరల్లోకి అవి ఒదిగిపోయినప్పటికీ, తవ్వకాలలో బయట పడ్డప్పుడు ఈ రాతి లోహ, దారు వస్తువుల పై చెక్కిన అక్షరాలు అలాగే నిలిచిపోయాయి. వేలాది సంవత్సరాల కాలగమనంలో భూమిలో అన్నీ నిక్షిప్తం అయినప్పటికీ తమ అస్తిత్వాన్ని, తమ సొంత తనాన్ని కోల్పోకుండా అలాగే ఉండిపోయి తమ కాలానికి ప్రతినిధులుగా ఈ శాసనాలు మనకిప్పుడు సాక్షులుగా నిలుస్తున్నాయి!
అందుకే చరిత్ర నిర్మాణంలో, పూర్వచరిత్ర విశ్లేషణలో శాసనాలది ప్రధాన ఆధార భూమిక అని చెప్పవచ్చు అయితే తెలంగాణ ప్రాంతపు శాసనాల విషయానికొస్తే అవి ప్రాచీన కాలం నుంచే అంటే సాహిత్య రూపం లోకి తెలుగు భాష రావడానికి కన్నా ముందే శాసనాలు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది. ఇంకా చెప్పాలంటే 9వ శతాబ్దికి చెందిన పంపన తొలి కవిగా తెలుగు సాహిత్యాన్ని తెలుగు కావ్యాన్ని రచించిన కవిగా ఆయన రచనలు లిఖిత బద్ధంగా మనకు కనిపిస్తున్నప్పటికీ అంతకన్న వందలాది ఏళ్ళక్రితమే ప్రజల నాలుకల మీద నడయాడిన భాష, శాసనాలలో అక్షరాలుగా రూపొంది తెలుగుభాష తొలి లిపిగా తెలుగు భాష లిపి పరిణామం లో గొప్ప సూచికలుగా మనకు ఇప్పుడు ఆధారంగా నిలుస్తున్నాయి. అంటే శాసనాలు కేవలం ఆయా కాలాల నాటి విషయాలను, ఆ రాజ్యానికి, దేశానికి, ప్రజలకు, పాలనా విధానానికి సంబంధించిన అంశాలను మాత్రమే కాక తెలుగు భాష, లిపి పరిణామం, తెలుగు భాషా పదాలు, వాక్యాల నిర్మాణశైలి లాంటి ఎన్నో భాషాశాస్త్ర అంశాలను కూడా వెలుగులోకి తెస్తాయి. అందుకే శాసనాలు చరిత్రకి నిలువుటద్దాలు! ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, భాషాపరమైన, పాలనాపరమైన అంశాలు ఎన్నింటికో అవి ప్రతీకలుగా నిలుస్తాయి.
అందుకే చరిత్రకారుడుకి శాసనాలు ఎప్పుడూ ఒక మిస్టరీయే! శాసనాలను డీకోడ్ చేయడం, అందులోని అంశాలనే decipher చేయడం ద్వారా ఎప్పటికప్పుడు కొత్త విషయాలని శాసన చరిత్రకారులు (Epigraphers) ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. అందుకే శాసనాలు ఒక నిరంతర చింతనకు, చరిత్ర అన్వేషణకు, నిత్య జ్ఞాన దాహార్తికి వీలు కల్పించే ప్రాతిపదికలు. ఇదంతా ఒక వైపు అయితే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మధ్య యుగ కాలంలో వేసిన శాసనాలు కూడా ఎంతో ప్రస్తావించదగినవి. ముఖ్యంగా కాకతీయ కాలంలో, తెలంగాణ ప్రాంతంలో లభించిన శాసనాలు ఎన్నెన్నో ప్రపంచానికి తెలియని విశేషాలను నిభిడీకృతం చేసుకున్న జ్ఞాన నిధులు (Treasures of Knowledge) గా చెప్పవచ్చు.
కాకతీయుల కాలానికి ముందు, కాకతీయుల కాలపు ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో లభించిన వేర్వేరు శాసనాలను విస్తృతంగా పరిశోధన చేసిన వారిలో నేలటూరి వెంకట రమణయ్య గారు ప్రాతఃస్మరణీయులు. ఆయన ఎన్నో ఏళ్ల శ్రమ కోర్చి, వరంగల్ ప్రాంతంలో లభించిన శాసనాలను సేకరించి వాటిని డీకోడ్ చేశారు . ఆ డీకోడ్ చేసిన శాసనాలు దాదాపు 142 శాసనాలు వరంగల్ ప్రాంతంలోనే లభించడం విశేషం. ఈ శాసనాలలో నిబిడీకృతమై ఉన్న పాలనా పరమైన అంశాలను ఎన్నిటినో ఆయన ప్రస్తావించారు ఈ శాసనాల కాలము క్రీస్తు శకం 872 నుండి మొదలుకొని 15వ శతాబ్దం వరకూ అంటే దాదాపు 700 సంవత్సరాల కాలంలో ఆయా పాలకులు వేసిన శాసనాలు గా ఆయన పరిశోధనలను బట్టి అర్థమవుతుంది. వీటన్నిటినీ క్రోడీకరించి తెలంగాణా ప్రభుత్వ పురావస్తుశాఖ వారు ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అయితే ఈ శాసనాలలో ఇంతకుముందే చెప్పినట్లుగా కాకతీయ పూర్వకాలము, కాకతీయుల కాలమునాటి ఎన్నెన్నో విశేషాలు వెలుగులోకి వచ్చినప్పటికీ భాషాపరమైన విశేషాలు మాత్రం స్పృశించని అంశం గా (Untouched) మిగిలిపోయాయి. ఆ మేరకు ఈ శాసనాలలో అంతర్గతంగా ఉన్న భాషా, ఛందోపరమైన అంశాలను విశేషాలను లోతుగా గమనిస్తే ఈ క్రింది విషయాలు వెల్లడవుతాయి:
1) ఈ శాసనాలు మొదట్లో తెలుగు కన్నడ భాషల కలగలుపు భాషగా ఉందనే విషయం భాషా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంటే ఆ కాలంలో కన్నడ ప్రాంతం, ప్రస్తుత తెలంగాణ ప్రాంతం రెండూ ఒకే ఏలుబడి కింద ఉండడం వల్లనో, భౌగోళిక సామీప్యత వల్లనో, ప్రజల సంచారం వల్లనో, ఆదాన ప్రదానాల వల్లనో కన్నడ భాష పదాలు తెలుగు భాష లోకి, తెలుగు భాష పదాలు కన్నడ భాష లోకి భాషాంతరత (Transmission of languages) జరిగి, ఆ రెండింటి మేళవింపుగా ఈ శాసనాలు వ్రాయబడ్డాయి అనే విషయం అవగతమవుతోంది.
2) కాలక్రమంలో తెలుగు, కన్నడ భాషలు రెండు విడివిడిగా తమ పదాలను, అస్తిత్వాన్ని వ్యక్తం చేస్తున్న దశ వచ్చిన తర్వాత, దానికి ప్రతిబింబంగా శాసనాలు కూడా వేరు వేరుగా రెండు భాషలలో వేయించడం జరిగింది. ఈ భాషాపరమైన వేర్పాటు మనకు తర్వాతి కాలపు శాసనాలలో మంకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. దీనిని బట్టి కాకతీయుల కాలం మధ్య దశ నుంచే లేదా కాకతీయ అనంతర దశనుంచి తెలుగు కన్నడ భాషల వేర్వేరుగా ప్రత్యేకతతో స్థిరపడ్డాయి అనే విషయం స్పష్టమవుతుంది.
3) తెలుగు, కన్నడ భాషల శాసనాలకు సమాంతరంగా సంస్కృతంలో కూడా కొన్ని శాసనాలు వేయించడం విశేషం. అంటే తొమ్మిదవ శతాబ్దం నుంచి 15 వ శతాబ్ది మధ్య కాలం లో సంస్కృత భాష కి కూడా ప్రాధాన్యత ఉండటం, దానిని ఆ కాలంలో దేవ భాషగా పరిగణించడం, ఆయా చక్రవర్తులు తమ ప్రాభవ వైభవాలను, తమ ఔన్నత్యాన్ని చూపించుకోవడానికి సంస్కృత భాషలో కొన్ని శాసనాలు వేయించడం జరిగింది అనేది కూడా దీన్ని బట్టి అర్థమవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ కాలంలో శాసనాలు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో వేయించారనేది మాత్రం ఇక్కడ తేటతెల్లమవుతుంది !
ఇంకా లోతుల్లోకి వెళ్లి తరచి చూస్తే ఈ శాసనాలలో పైన చెప్పినట్టుగా కేవలం భాషా పరమైన అంశాలు మాత్రమే కాక, మరెన్నో వ్యాకరణ పరమైన విషయాలు నిబిడీకృతమై ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే, ఈ దిశగా యావత్ భారతదేశంలో జరిగిన ప్రయత్నాలు మాత్రం చాలా అరుదే . వరంగల్ ప్రాంతంలో లభించిన 142 శాసనాలని లోతుగా అధ్యయనం చేస్తే ఇప్పటిదాకా లోకానికి తెలియని ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి:
1. వాటిలో మొత్తం 960 పైగా పద్యాలు ఉన్నాయి, అవన్నీ 49 రకాల పైగా ఛందో ప్రక్రియల్లో వ్రాయడం జరిగిందనే విషయం అర్థమైంది.
2. సాధారణంగా తెలుగు ఛందస్సులో, పద్య రచనా సంవిధానంలో, చాలా చిరపరిచితమైన పద్యాలు, ఇప్పటికీ ఈ తరానికి కూడా తెలిసిన పద్యరీతులు శార్దూలం, చంపకమాల, ఉత్పలమాల, మత్తేభం, ఆటవెలది, తేటగీతి, సీసం ఇలాంటివి దాదాపు 10 రకాలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ 961 పద్యాలను, ఆ పద్య నిర్మాణంలో ఉపయోగించిన ఛందో శైలులను అధ్యయనం చేస్తే, దాదాపు 49 రకాల ఛందస్సులలో ఈ పద్యాలు రచించబడ్డాయి అన్న విషయం వెల్లడి అయింది.
3. 49 రకాల ఛందస్సులో ప్రస్తుతం వాడుకలో లేని అనుష్టుప్, ఆర్యా భేదం, ఇంద్ర వంశం, వాలా, శాలా, హంసి, పంచ చామరం, హర్షిని, మంజరీ ద్విపద, మందాక్రాంతం, షాలిని, శిఖరిణీ, సౌరభి, స్వాగతం, హరిణి వంటి ఎన్నో రకాల పద్యాలు ఈ శాసనాలలో కనిపించడం విశేషం. ఇదంతా చరిత్ర కారులను ఆశ్చర్యపరిచే అంశాలుగా చెప్పవచ్చు. చరిత్రకారులు సాధారణంగా శాసనాలలో వెల్లడవుతున్న విషయాలన్నీ విశ్లేషిస్తారు తప్ప భాషా పరమైన అంశాలను, ఛందో నిర్మాణ రీతుల విశ్లేషించడం అత్యంత అరుదు! ఆ లోటుని భర్తీ చేస్తూ డాక్టర్ లగడపాటి సంగయ్య గారు ఎన్నో ఏళ్ల అధ్యయనంతో వ్యయప్రయాసలకోర్చి వరంగల్ ప్రాంతంలో నేలటూరి వెంకట రమణయ్య గారు సేకరించి విశ్లేషించిన 142 శాసనాలలోని 961 పద్యాలలో దాగి ఉన్న 49 రకాల ఛందస్సుని భాషాపరంగా, వ్యాకరణపరంగా విశ్లేషించడమే కాక వాటికి అర్థ వివరణ చేసి ఒక అడుగు ముందుకేశారు.
ఈ ప్రయత్నం భారతదేశ శాసన శాస్త్ర చరిత్రలోనే (History of Indian Epigraphy) ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం అని చెప్పవచ్చు. శాసనాలను డీకోడ్ చేసే దశ దాటి ఛందో పరమైన విశ్లేషణ చేయడం అనే దశ కి వెళ్లడం ద్వారా చరిత్ర మరొక మెట్టు ఎక్కుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి అరుదైన ప్రయత్నాన్ని ఈ తెలంగాణా శాసనాలలో ఛందోరీతులు గ్రంథంలో సవివరంగా, సాధికారికంగా, సహేతుకంగా, శాస్త్రీయంగా, వ్యాకరణ నియమాలును అనుసరించి వివరించడం జరిగింది. అందుకే ఈ గ్రంథం ఒకవైపు చరిత్ర రచన శాస్త్రంలో (Historiography), మరొకవైపు శాసన శాస్త్రంలో, ఇంకొకవైపు భాషాశాస్త్రంలో కూడా ఒక కొత్త మలుపుకు దారులు వేస్తుంది అని భావిస్తున్నాను. దీనికి తోడు అనుబంధం లో ఆయా శాసనాల చిత్రాల నకలులను ప్రచురించడం జరిగింది. దీనివల్ల పరిశోధకులకు ఆయా శాసనాలలోని లిపి పరిణామ వికాసాలను కొంతవరకు అర్థం చేసుకునే సౌల భ్యం కలుగుతుంది. ఇలాంటి అరుదైన, అపూర్వమైన, అద్భుతమైన ప్రయత్నాన్ని చేసిన పరిశోధకులు, భాషావేత్త డాక్టర్ లగడపాటి సంగయ్య గారికి శుభాకాంక్షలు. చరిత్రకారులకు ముఖ్యంగా తెలంగాణ చరిత్ర – తెలుగు భాష అభిమానులకు, తెలంగాణ ప్రజలకు, పరిశోధకులకు, మేధావులకు ఈ గ్రంథం ఎంతో ఉపయుక్తం అవుతుందని భావించ వచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News