మే డే. ప్రపంచ కార్మిక దినోత్సవం. గత 134 సంవత్సరాలుగా ప్రతి ఏటా శ్రామిక జన సంఘీభావ చిహ్నంగా, వారి సుఖమయ జీవనాన్ని ఆకాంక్షిస్తూ మే డే పండుగను జరుపుకున్నాం, జరుపుకుంటున్నాం. 19వ శతాబ్దంలో సంభవించిన పారిశ్రామిక విప్లవం కారణంగా ఆమెరికా, యూరప్ దేశాలలో భారీ పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమల్లో పని చేయుటకు అసంఖ్యాకంగా కార్మికుల అవసరం ఏర్పడింది. దీనితో ఉత్పత్తిరంగంలో పెట్టుబడిదారులు, కార్మికులు అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులు అధిక లాభాల కోసం కార్మికుల శ్రమను విచక్షణా రహితంగా దోచుకోవడం ప్రారంభించారు. శ్రామికులచే బానిసల్లా పని చేయించి అధిక లాభాలు గడించేవారు.యజమానులు, ఆడవాళ్ళు, పిల్లలు అనే విచక్షణ లేకుండా కర్మాగారాలలో, గనులలో నియమిత కాల వ్యవధి లేకుండా వెట్టి చాకిరీ చేయించేవారు.
కనీస వసతులైన తిండి, బట్ట, నివాసం వంటి వసతులు కూడా కల్పించేవారుకాదు. కార్మికులచే కనీసం రోజుకు 16 గంటల నుండి 20 గంటలు పని చేయించేవారు. పైగా పని చేసే కర్మాగారాలలో సరియైన గాలి, వెలుతురు ఉండేవి కావు. దానితో కొందరు కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. కార్మికులు వారి శ్రమను మరచిపోవడానికి పాటలు పాడినా, విశ్రాంతి తీసుకున్నా యాజమానులు కోపోద్రిక్తులై ధిక్కార నేరం క్రింద జరిమానా విధించేవారు.
ఈ దారుణ చర్యల నేపథ్యంలో కార్మికులలో క్రమక్రమంగా తిరుగుబాటు ధోరణి అంకురించింది. కార్మికులు కోపంతో ఊగిపోతూ కర్మాగారాలలోని యంత్రాలను ధ్వంసం చేశారు. యాజమాన్యం ప్రభుత్వాలను ఆశ్రయించారు. యజమానుల ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యంత్రాలను ధ్వంసం చేసే వారికి మరణ శిక్ష విధిస్తూ చట్టం చేసింది. కార్మికులు తమ ప్రధాన ఇబ్బందులకు కారణం యంత్రా లు కాదు. యాజమానులని గుర్తించారు. అందుకే యాజమాన్యంపై తిరుగుబాటు బావుటా ఎగురవేయాలని ఆలోచించారు.
కార్మిక సంఘాల నిర్మాణం
తమ చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ అమానుషంగా ప్రవర్తించే పెట్టుబడిదారులపై పోరాడి తమ కనీస హక్కులను సాధించుకొనేందుకు కార్మికులు సంఘటితమయ్యారు. కార్మిక సంఘాల నిర్మాణం ప్రారంభించారు. 1764-1800 మధ్య బ్రిటన్‌లోనూ, ఆ తరువాత యూరప్‌లోనూ, ట్రేడ్ యూనియన్ల నిర్మాణం జరిగింది. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో చైతన్యవంతులైన కార్మికులు 1806లో మెకానిక్స్ యూనియన్ పేరిట తొలి కార్మిక సంఘాన్ని స్థాపించుకొన్నారు. కార్మిక సంఘాలు, తమ న్యాయమైన కోర్కెల కోసం న్యాయ పోరాటం ప్రారంభించడంతో పెట్టుబడిదారీ వర్గాలు ఆందోళన చెందాయి. కార్మిక సంఘాల సభ్యులను కఠినంగా కారాగారాల్లో బంధించి హింసించారు. నిరంకుశంగా యూనియన్లను నిషేధించారు.
అయినా ఉద్యమం ఆగలేదు. ఉద్యమం ఉప్పెనలా ఊపందుకుంది. పని గంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని (ట్రేడ్ యూనియన్లను గుర్తించాలని) కర్మాగారాలలో కనీస వసతులు కల్పించాలని, తగినంత విశ్రాంతినివ్వాలని కోరుతూ కార్మికవర్గం విప్లవ శంఖం పూరించింది. ఆ పోరాట జ్వాలలు బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ దేశాలకు, అమెరికాలోని మిగతా ప్రాంతాలకు వ్యాపించాయి. 1818లో ఇంగ్లాడులోని స్టాల్ పోర్టు పట్టణంలో గల బట్టల ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు సమ్మె ప్రారంభించారు. ఇది ప్రపంచ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన లయాన్స్ పట్టణంలో 1831-1834లలో కార్మికులు తిరుగుబాటు చేశారు. ఆపై 1848లో పారిస్‌లో కూడా సమ్మె పోరాటాలు జరిగాయి. అదే సమయంలో జర్మనీ, అస్ట్రేలియాలోనూ కార్మికుల తిరుగుబాట్లు జరిగాయి. శ్రేణులు విజయాలు సాధించాయి.
పనిగంటలకై పోరాటం
1827లో ఫిలడెల్ఫియాలో మెకానిక్స్ యూనియన్ 8 గంటల పని దినం కోసం పోరాటం ప్రారంభించాయి. చిలికిచిలికి గాలివానలాగ పోరాటం ఉధృతం కావడంతో యాజమాన్యం దిగి వచ్చింది. ప్రభుత్వం 1837లో 10 గంటల పని దినంను చట్టబద్ధం చేసింది. ఆ తరువాత యూరప్‌లోనూ, ఇంకా అనేక దేశాలలో జరిగిన పోరాట ఫలితంగా ఆయా ప్రభుత్వాలు 10 గంటల పని దినాన్ని అంగీకరిస్తూ చట్టాలు చేశాయి.1881లో చికాగో నగరంలో వివిధ కార్మిక సంఘాలు సంఘటితంగా అమెరికా ఫెడరేషన్ ఆఫ్ లేబర్ పేరిట ఒక సమాఖ్యను కొత్తగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమాఖ్య 1884 అక్టోబరు 7న ఎనిమిది గంటల పని దినంను చరిత్రాత్మక తీర్మానం చేసింది. 1886 మే మొదటి తేదీన కార్మిక వర్గం సమ్మె పోరాటం జరపాలని నిర్ణయించింది. 1885- 86లో మేడే సన్నద్ధతకు జరిగిన సమ్మెపోరాటాల్లో లక్షలాది కార్మికులు పాల్గొన్నారు.
1886లో జెనీవాలో జరిగిన మొదటి ఇంటర్ నేషనల్ మహాసభ కూడా రోజుకు 8 గంటలు పనిని చట్టబద్ధం చేయాలని కోరింది.
1886 మే 1న చికాగోలో 8 గంటల పనిదినం కోసం మహత్తరమైన సమ్మె జరిగింది. మూడున్నర లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్న కార్మికులపై మే 3న కాల్పులు జరిపింది. ఆరుగురు కార్మికులు అమరులయ్యారు. ఈ హత్యలకు నిరసన తెలిపేందుకు మే 4న హేమార్కెట్ అనే ప్రాంతంలో కార్మికులు పెద్ద ఎత్తున సభ జరిపారు. సభపై మళ్ళీ దోపిడీ మూకలు, ప్రభుత్వం కలిసి కాల్పులు జరిపారు. కార్మికులు, పోలీసుల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఆ కాల్పులలో ఏడుగురు పోలీసులు, నలుగురు కార్మికులు మరణించారు. దానితో ప్రభుత్వం కార్మికులపై అసహనంతో పాశవిక దాడికి దిగింది. హేమార్కెట్ ప్రాంతాన్ని రక్తసిక్తం చేసింది. స్పిన్, పార్సెన్, పిషర్, ఏంగిల్ వంటి అనేక మంది కార్మికుల్ని, కార్మిక నాయకుల్ని దారుణంగా ఉరితీసింది.
స్పిన్ ఉరి కంబం ఎక్కే ముందు మమ్మల్ని ఉరి తీసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోతుందని భ్రమించకండి. అదిగో అక్కడ మంటలు, ఇక్కడ మంటలు, నీ ముందు, వెనుక అన్ని చోట్ల అణువణువునా అగ్నిజ్వాలలు రేగుతాయి. వాటిని ఆర్పడం మీతరం కాదు అని సింహంలా గర్జించారు. అది అక్షర సత్యమయింది. మే 1న ప్రారంభమైన మహోద్యమం న్యూయార్క్, బాల్టిమెన్, వాషింగ్‌టన్, పిట్సు, డెట్రాన్ వంటి పెద్ద నగరాలకు దావానలంలా వ్యాపించింది. అన్నిచోట్ల ఉధృతంగా సమ్మెలు జరిగాయి. కార్మికుల హక్కుల కోసం వీరోచితంగా పోరాటాలు, త్యాగాలు చేశారు. ఆ తరువాత మూడేళ్ళకు అనగా 1889న సోషలిస్టు అంతర్జాతీయ మహాసభ రెండవ ఇంటర్ నేషనల్ మే 1వ తేదీన కార్మిక దినోత్సవం ప్రకటించింది. ఆ రోజున అన్ని దేశాలలోని కార్మికులు ఏకకాలంలో తమ కోర్కెలను ప్రకటించాలని ఆదేశించింది. ఆ తీర్మానాన్ని అనుసరించి 1890 మే 1వ తేదీన తొలిసారిగా ఐరోపా దేశాలలో మేడే జరపడం జరిగింది. కార్మికవర్గం నిర్వహించిన ఆ మహోద్యమ ఫలితంగా కార్మికులు తమ హక్కులను సాధించుకున్నారు. నేడు మనం 135 మే డే జరుపుకుంటున్నాం.
ఈ 135 వ మే డే స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 12 గంటల పని దినాలు రద్దు చేసి 8 గంటల పనిదినం అమలు చేయాలని అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా తీసుకొచ్చి కనీస వేతనాలు అమలుకై నేడు మన దేశంలో కార్మికుల జీవితాలకు సవాలుగా నిలిచిన మతతత్వం, నూతన ఆర్థిక సంస్కరణల ఫలితంగా బహుళ జాతి సంస్థల దోపిడీ నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని రక్షించేందుకు పోరాటానికి కార్మికులు సన్నద్ధం కావాల్సిందిగా ప్రతినబూనుదాం. కార్మిక సంక్షేమాన్ని ఆకాంక్షిద్దాం, ప్రగతి సాధిద్దాం, కార్మికుల ఐక్యత వర్థిల్లాలి.