Saturday, December 28, 2024

పక్షితనాన్ని కలగనే కవిత్వం

- Advertisement -
- Advertisement -

కటకం గజపతులలో మొదటివారు కపిలేశ్వర గజపతి. ఇతను శ్రీకృష్ణదేవరాయల కంటే ముందువాడు. ఇతని భార్య పేరు పార్వతి. ఐదు వందల యేళ్లకు మునుపే గజపతి తన భార్య పేరు మీద పార్వతీపురాన్ని కట్టించాడు. గతేడాదే ఈ ఊరు మన్యం జిల్లాగా అవతరించింది. ఏనాటి నుంచో పట్టణం లక్షణాలను పుష్కలంగా కలిగిన ఈ ఊరిని ’టౌన్’ అని చుట్టుపక్కల గ్రామాల ప్రజలంటుంటారు. ఈ ఊరు భౌగోళిక, నైసర్గిక స్వరూపం ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది. కొండ కోనల సోయగం, గిరిజన సంస్కృతీ సంప్రదాయాల సౌందర్యం దగ్గరగా కానవస్తుంది. పర్వత శ్రేణికి దిగునున్న మైదాన ప్రాంతమిది. ప్రకృతి అందాలకు నెలవైన ఈ ప్రాంతంలో సాహిత్యం బహువిధాలుగా పరిఢవిల్లుతున్నది. ఎందరో సాహితీమూర్తులు సాహితీ సౌరభాలను వెదజల్లుతూ ముందుకు నడుస్తున్నారు. ఈ పట్టణంలో ప్రకృతి రమణీయత ఎంతుందో! సాహితీ మాధుర్యత కూడా అంతే ఉంది. ఎంతోమంది కవులను, రచయితలను తీర్చిదిద్దిన సంస్థ స్నేహకళా సాహితి. ఈ సంస్థ సంస్కారం అబ్బిన కవి పక్కి రవీంద్రనాథ్. గంటేడ గౌరునాయుడు గారి సాహితీ శుశ్రూషలో తయారు కాబడ్డారు. పార్వతీపురం అనేక సామాజిక ఉద్యమాలకు వేదికగా నిలిచిన ప్రాంతం. పోరాట యోధులు నేలకొరిగిన నేలిది.

అలాంటి ఈ ప్రాంతంలో పుట్టిన సాహితీవేత్తలు ప్రగతిశీల పోరాటాలలో పాల్గొంటూ తమదైన శైలిలో రచనలు చేస్తూ ప్రజా చైతన్యానికి నడుం బిగిస్తున్నారు. రవీంద్రనాథ్ కూడా తన రచనల్లో సామాజికాభ్యుదయ వ్యక్తీకరణలను చూపుతున్నారు. శ్రీశ్రీ మహాప్రస్థానం, తిలక్ అమృతం కురిసిన రాత్రి పదేపదే చదివినట్లు రవీంద్రనాథ్ తన ’పక్షితనాన్ని కలగంంటూ’ అనే కవితా సంపుటికి రాసిన నామాటలో గుర్తు చేసుకుంటున్నారు. తొలుత ఆంధ్రభూమిలో కా.రా మాస్టారు నేటి కథా శీర్షికలో తాను రాసిన ఏడెనిమిది కథలు అచ్చయ్యాయి. కళాశాల స్థాయిలోనే కవితలను రాయడం అందరి కవులు లానే జరిగినప్పటికీ, ఆ కవిత్వాన్ని సామాజిక, మానవీయ కోణం వైపు నడిపించడంలో ప్రత్యేకత ఉంది. అసలు తాను రాసే కవిత్వానికి కవిత్వ లక్షణాలు ఉన్నాయా? లేదా? అనే సందేహం వెంటాడేది రవీంద్రనాథ్ ని. కవిత్వానికే కాదు కవికీ శిల్పం ఉండాలనేది అర్థమయ్యేక కవిత్వం రాయాలంటే ముందు నాలో అంతః సౌందర్యం ఉండాలనుకున్నారు. ఈ దశలో కవిత్వానికి కొన్నేండ్లు దూరమయ్యారు. తదనంతరం మిత్రుల ప్రోత్సాహంతో తాను కవిత్వం రాయడానికి పూనుకున్నారు.

యుక్త వయస్సు నుండి వచన కవిత, కథ రాసినప్పటికీ నడి వయసులో పుస్తకంగా తన కవిత్వాన్ని తీసుకొచ్చారు. రవీంద్రనాథ్ ఇంకా ఈ పనిని చేయకపోయుంటే ఉత్తమ సాహిత్యాన్ని చదివే భాగ్యం కోల్పోయేవాళ్ళం. ఈ కవితా సంపుటిలో 40 కవితలు ఉన్నాయి. ఇవి వివిధ పత్రికల్లో ప్రచురితమై, పలు బహుమతులను గెలుచుకున్నాయి. వీటిలో కొన్నింటిని ఇక్కడ సమీక్షిద్దాం.
మొదటి కవిత ’తొలిఅడుగు’ లో కవి నాగావళి నదిపై రిజర్వాయర్ నిర్మాణం చేపట్టే క్రమంలో ప్రజలు తమ ఉనికిని కోల్పోవడాన్ని ప్రస్తావిస్తాడు. వందేళ్ళ క్రితం తోటపల్లి వద్ద రెగ్యులేటర్ ఆక్విడెక్ట్ నిర్మించబడి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొంత ప్రాంతానికి సాగునీరు అందేది. కానీ నేటి రిజర్వాయర్ నిర్మాణం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలలో లక్షకు పైగా ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించే వీలుంది. దాంతో పార్వతీపురానికి ఆనుకొని ఉన్న పలు పల్లె లు కనుమరుగౌతున్నాయి. అక్కడి ప్రజలు అలోలక్ష్మణ అం టూ వేరు ప్రాంతాలకు తరలిపోతున్నారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. ఒకప్పుడు బంగారు పంటలకు నిలయమైన తమ ప్రాంతాన్ని వదలడాన్ని జీర్ణించుకోలేని కవి తన నది పూర్వ వైభవాన్ని చెబుతున్నాడిలా.

’జీవనాధారమనుకున్న/నాగావళి సైతం/మా జీవన ప్రవాహానికిలా/ఆనకట్టయి అడ్డుపడుతుందనుకోలేదు/బతుకంటే నాగేటి చాలు వెంట/నడిచి వెళ్లడమే అనుకున్నాం/నాగావళి తల్లే/ మా జీవిత సర్వస్వం అనుకున్నాం/మాకు పట్టెడన్నం పెడుతున్న/పంట పొలాలను లాక్కుని/నంచుకోడానికి నష్టపరిహారాలిస్తున్నారు’ ఇలా నిర్వాసిత ప్రాంత ప్రజల ఆవేదనను కవి వెల్లడిస్తున్నారు. అయితే చూడాల్సింది నిర్వాసితుల దృష్టి కో ణమా! లేక లబ్ధిదారుల దృష్టి కోణమా! అనేది అంతుబట్టదు. ప్రజామోదానికి తగిన నిర్ణయాలు ప్రభుత్వాలే తీసుకోవాలి. లేదంటే అటు నుంచి ఇటు నుంచి ప్రజాందోళనలు తప్పవు.
రాజధాని నడిబొడ్డున జరిగిన అత్యాచారాలను నిరసిస్తూ ’నోయిడా నిఠారి కాల్వలో’ కవి వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. ’వదిలేస్తే అమ్మ దగ్గరికి పోతామని/కాళ్ల మీద పడ్డ కన్నీటి కుసుమాలను/నిర్దయగా విదిల్చివేసిన నీ క్రౌర్యం ముందు/పెద్ద పులి కూడా దిగదుడుపే’ అంతేకాదు లేలేత వయసు ఆడపిల్లలను డబ్బు కోసం అమ్మే దగుల్భాజీలను తూర్పారబడతాడిలా. ’అయ్యో చెడ్డీలెగేసుకోవడం కూడా రాని/చిన్నారులనేంచేసావురా/ముసలి షేకులిచ్చే ముష్టి దీనార్ల కోసం/ముక్కు పచ్చలారని కసుగాయలను/ఖరీదుకిచ్చావా’ ఇది చదువుతుంటే గురజాడ ’పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ గేయంలోని పాదాలు ’ముదుసలికి ముడివేస్త్రి’ గుర్తుకు రాక మానదు. ’

అంకుల్ వేషాల్లో తిరుగుతున్న/చిత్తకార్తె కుక్కల నుంచి/కాపాడుకోవడానికి/పసివాళ్ళకిప్పుడు ఇనుపకచ్చడాలు/వేయించాలన్నంత విష సంస్కృతిలోకి/జీవితం
జారిపోతున్నది’ ఒకనాడు రాణివాసపు కాంతలను పరపురుషులు తాకకుండా వారి మానాన్ని కప్పే ఇనుపకచ్చడాలు బిగించే పురుషాధిక్యత సమాజముండేది. క్రమానుగతంగా దాన్ని బద్దలు కొట్టి స్వేచ్ఛను అందుకున్న స్త్రీమూర్తి, నవీన యుగంలో మళ్లీ తనపై జరుగుతున్న లైంగిక దాడుల నుండి రక్షణగా ఇనుప కచ్చడాలు తనకు తానుగా బిగించుకోవాలా? అని కవి ప్రశ్నిస్తున్నాడు. సంస్కరణానంతర కాలంలో అసలిది పురోగమనమా! తిరోగమనమా! అని కవి వేలెత్తి చూపుతున్నాడు.
ప్రకృతిని విధ్వంసం చేయడాన్ని ’నగర పంజరం’లో చెబుతున్నాడిలా. నగరీకరణలో భాగంగా సహజ సిద్ధ వనరుల్ని కాలుష్యం చేస్తున్నాడు మానవుడు. ఒకప్పుడు నగర అవసరాల దృష్ట్యా తవ్వుకున్న చెరువులు, కుంటలను నేడు రియల్ ఎస్టేట్ దందా ఆక్రమిస్తున్నది. వరదలు వస్తే నగరాలు నీటిలో తేలియాడడానికి కారణమిదే. ఇది ఎంతమాత్రం సమంజసం కాదంటాడు. సామ్రాజ్యవాద సంస్కృతిలో మనిషి మనుగడను తనకు తానుగా కూల్చుకోవడం బాధాకరం.

’ప్రకృతి ఆవిష్కరించిన/పచ్చ జెండాలను పీకి పారేసి/భూతలాన్ని కాంక్రీటు తండా చేస్తున్నావు/నిన్నటి స్వర్గాన్ని/నిప్పుల గుండం చేస్తున్నావు’ ఇలా ఆధునికత మాటున దాగివున్న సత్యాలను నిర్మొహమాటంగా ఎరుక పరుస్తున్నాడు కవి.
’సునపకాయ’ కవితలో కవి చిన్ననాటి అనుభవాలను తడుముకుంటాడు. తన బామ్మతో గడిపిన క్షణాలను స్పృశిస్తాడు. తన వీధిలో పిల్లలతో కలిసి ఆడుకునే సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటాడు. బామ్మ తనపై చూపే ప్రేమను చెప్తాడిలా. ’పేరుకది సునపుకాయని మాటే గాని/చూడ్డానికి మాత్రం సువర్ణపు కాయే/పౌచ్ లో దాచిన సెల్ ఫోన్ లా/దాన్నెప్పుడూ బొడ్డునే దోపుకునేది/ఐసు డబ్బా గిలక శీతల శబ్దమై/మా చెవుల్లో జిల్లన్నప్పుడో/పీచు మిఠాయి మా గుండెలో/గణగణమనప్పుడో/మేం పావురాల గుంపులా ఎగిరి/బామ్మ మీద వాలిపోయేవాళ్ళం’ ఈ వాక్యాలు ఈనాటి కవులు వ్యక్తం చేయలేరు. ఎందుకంటే వారికి బామ్మ-సునపకాయ అనుభవాలు లేవు. ఆనాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో సునపకాయతో గల బంధాలు మధురమైనవి. ఇప్పటి ఏటీఎం లా సునపకాయ ఆనాడు ఉపయోగపడేదంటే ఆశ్చర్యమే లేదు.

కార్పొరేట్ చదువుల్లో మ్రగ్గిపోతున్న పిల్లల దైన్యస్థితిని ’నెమలీక’ కవితలో ఎంతో హృద్యంగా చెబుతున్నాడు కవి. ’ఈ గదిలో నాతోపాటు మరో నలుగురున్నా/మా మధ్య ర్యాంకుల గాజు గోడలుంటాయి/ కార్పొరేట్ కాలేజీ కంకర నేలలో/డాలర్ ముళ్ళచెట్లు మొలుస్తాయి తప్ప/మమతలు పుష్పించవు/కళ్ళలో నెత్తుటి దీపాలు వెలిగించుకొని/అక్షరపంక్తుల వెంట పరుగులు తీస్తున్నాము/సర్కారు బళ్ళో చదువుకున్నప్పుడు/నేను ముచ్చటపడి/పుస్తకంలో నెమలికన్ను దాచుకునేవాణ్ణి’ నేడు పిల్లల మధ్యన అనురాగ బంధాలు పెనవేసుకోకపోవడాన్ని, వారిలో ఆనందానుభూతులు లేకపోవడాన్ని ఎత్తిచూపుతున్నాడు. ఒత్తిడి లేని చదువు నేడు గగనకుసుమమైందంటున్నాడు. మట్టికుండతో మనిషికి విడదీయరాని బంధముంది. కానీ నేడు అది కనబడటం లేదు. ’నీకదొట్టి మట్టేననిపించొచ్చు గానీ/నా దృష్టిలో అదో చారిత్రక వారసత్వ సంపద/దానిలోని నీరంటే వేసవి తాపాన్ని తీర్చే మంత్రజలం/ఆకలి గ్రీష్మాన్ని చల్లబరిచే దివ్యౌషధం/అది ప్రాణంలేనిదే కావొచ్చుగానీ/దానిని చూస్తే మాకు ప్రాణాలు లేచొచ్చేవి’ నేడు ఫ్రిజ్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఫ్రిజ్ల వల్ల కాలుష్యం పెరుగుతోంది. అవేమీ పట్టించుకోకుండా జనం ఫ్రిజ్లను వినియోగిస్తున్నారు. కానీ గత కాలంలో ప్రతి ఇంటా మట్టికుండ ఉండేది.

వేసవిలో అయితే వాటి అవసరం అంతా అంతా కాదు. చల్లని త్రాగునీరు అందిస్తూ బాటసారులను కూడా సేద తీర్చేది. దిష్టిబొమ్మ తన దీనస్థితికి ఏనాడూ బాధపడనూలేదు. తన కురూపానికి కారణమైన వారి పట్ల ఆగ్రహించనూలేదు. కాని కుట్రలు కుతంత్రాలతో సమాజాన్ని పీల్చిపిప్పిజేస్తున్న రాజకీయ నాయకుల పేర్లు పెట్టి తనను ఊరేగించడాన్ని నిరసిస్తున్నదంటాడు కవి ’హా హతవిధీ’ కైతలో. ’నన్ను అనాకారిని చేసి/నీ ఇంటి ముందు వేలాడదీసావు/అయినా నేను బాధ పడలేదు/నీ పంట పొలంలో పిట్టలను అదిలించమని/నేలలో పాతి నిలబెట్టావు/దానికీ నేను దిగులు చెందలేదు/కానీ నువ్విప్పుడు/నాకో రాజకీయ నాయకుని పేరును తగిలించి/నిలబెట్టినందుకు మాత్రం/అవమాన జ్వాలల మధ్య దగ్ధమౌతున్నాను’ అంటే నేటి నాయకుల పట్ల ప్రజలే కాదు, ప్రాణం లేని వస్తువులు కూడా అసహ్యించుకుంటున్నవని ఎద్దేవా చేస్తాడు కవి.
రవీంద్రనాథ్ తన కవిత్వ నిర్మాణంలో బిగువు ఎక్కడా సడలకుండా జాగ్రత్త పడ్డారు. అందమైన, శ్రేయోదాయకమైన పదాల మేళవింపు ఇతని కవిత్వానికి ఎక్కడలేని సొబగు తెచ్చింది.

కానీ సిక్కోలు మాండలిక పదాల పొహళింపు తగ్గడంతో ఉత్తరాంధ్ర గుబాళింపు కరువైంది. మొత్తంగా చూస్తే రైతు, రోగి, రజకులు, అర్ధాంగి, గురువు, బాల్యం, నిర్వాసితులు, పెట్టుబడిదారులు ఇలా దేని గూర్చి కవిత్వీకరణ చేసినా అందులో సూత్రబద్ధత, నిజాయితీ గోచరిస్తున్నది. అందువల్లనే ఈ ’పక్షితనాన్ని కలగంటూ’ చదివి తీరాల్సిందే. ఉత్తమ కవిత్వాన్ని రాయగల ఈ కవి ఎందుకో చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ’రాయడమొచ్చినోడు రాయకపోతే రాయకూడనివాడు రాస్సేస్తాడు’ అన్న కామ్రేడ్ ’నిర్మలానంద’ మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. అందుకే రాయడమొచ్చిన రవీంద్రనాథ్ తరచూ రాయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News