Saturday, December 21, 2024

రేపటి తరాలకు దిక్సూచి..

- Advertisement -
- Advertisement -

తెలుగు సాహితీ వికాసంలో తెలంగాణకు ఒక విశిష్ట స్థానం ఉంది. అందులోనూ తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య వికాసంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకో ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. ఒకనాడు తెలంగాణలో కవులే లేరన్న విషయానికి స్పందించి సురవరం ప్రతాపరెడ్డి గారు గోల్కొండ కవుల సంచిక విలువరించారు. ఈ అంశాన్ని స్ఫూర్తిగా తీసుకొని 1991 లోనే నీలగిరి కవుల సంచిక వెలువరించిన పున్న అంజయ్య నల్లగొండ జిల్లాకు చెందిన వాడు. అందులో సుమారుగా 300 మంది కవుల పరిచయాన్ని రాశాడు. ఆ విషయాలన్నీ కూడా ఆనాటి ప్రజాపోరు సాయంకాలం దిన పత్రికలో ధారావాహికంగా ప్రచురించడం జరిగింది. ఆర్థిక పెసలు బాటు లేని అంజయ్య వాటన్నింటినీ పుస్తక రూపంలో ప్రచురించ లేకపోయారు. అలా మూడు దశాబ్దాలు కాల ప్రవహంలో దొర్లిపోయాయి.

ఇటువంటి నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరుగున పడిపోయిన, పోతున్న కవులు, రచయితల రచనలను సమగ్రంగా సేకరించి ఒక పుస్తకంగా తీసుకురావాలన్న తాపత్రయమే ఈ ‘నీలగిరి కవుల సంచిక‘. ఇందులో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు చెందిన కవులు, రచయితల వివరాలను పొందుపరచడం జరిగింది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి 454 పేజీలతో క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ రోజున నల్లగొండ పట్టణంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత పద్మశ్రీ డాక్టర్ కూరెల్లా విఠలాచార్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇందులో గద్య, పద్య రచయితల వివరాలతో పాటు ప్రాచీన, ఆధునిక కవులకు సంబంధించిన వారు రాసిన గ్రంథాలకు సంబంధించిన అనేక వివరాలు ఈ గ్రంథంలో తెలుపబడినవి. ఇతర గ్రంధాలను ఔపోసన పట్టి, ప్రత్యక్షంగా ఆయా ప్రాంతాలు తిరిగి కవులు సమాచారాన్ని సేకరించడం అంత సులువైన పని కాదు.

సాహిత్య పరంగా వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం వేరు. కవుల చరిత్రను రాయడం వేరు. కవుల చరిత్ర రాయాలంటే ధైర్యం ఉండాలి. వాస్తవాలను సేకరించాలి. ప్రామాణికతను పాటించాలి. జీవిత చరిత్రలను సంక్షిప్తంగా చెప్పినప్పటికీ, సత్యంగా సర్వ సమ్మితంగా, నర్మ గర్భంగా చెప్పాల్సి ఉంటుంది. అట్లా అన్ని ధర్మాలను పాటిస్తూ అంజయ్య రచన కొనసాగడం గొప్ప విషయం. అనుభవించిన వాడికే ఆకలింపు అవుతుంది అన్నట్లుగా నీలగిరి కవుల సంచిక అమూలాగ్రం పరిశీలిస్తే రచయిత అంజయ్య పడిన తపన,వేదన అర్థమవుతుంది. సాహిత్యంలో ఒళ్ళు దాచుకోవడం తెలియని అమాయకుడు అంజయ్య. ఆయన నిరంతర కృషి వల్లనే ఈ గ్రంథం వెలుగులోకి వచ్చింది. నాలుగు దశాబ్దాల నుండి ఎత్తిన కలం దించకుండా రచనలు చేస్తూ తోటి కవులను, రచయితలను కలుపుకుపోతూ ముందుకు సాగుతున్నాడు.

ఒకనాడు నల్లగొండ కే కాదు తెలంగాణ ప్రాంతానికి ఆపారమైన ప్రతిష్టను తెచ్చిన ప్రఖ్యాత కవి శ్రీ అంబడిపూడి వెంకటరత్నం శాస్త్రి చండూరులో స్థాపించిన ‘సాహితీ మేఖల‘ సాహితీ సంస్థ మరుగున పడిపోతున్న సమయంలో ఆ సంస్థ పునరుజ్జీవన భారాన్ని తన భుజస్కందాలపై వేసుకొని ఎంతోమంది సహకారంతో సూచనలతో చైతన్యవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు. నల్లగొండలో సాహిత్య జీవన ధారను కురిపిస్తున్నారు. ‘ఏదైనా రాయందే ఈ క్షణాన్ని నిద్ర పోనీయను ‘ అన్నా ఆ మహాకవి సినారే మాటను గుర్తుకు తెస్తున్నారు. ఈ పరంపరలో బయటకు తెచ్చిన గ్రంథమే నీలగిరి కవుల చరిత్ర.
తెలంగాణ పూర్వం పది జిల్లాలలోని ఒక్కటైన నల్లగొండ జిల్లా ప్రాచీన చరిత్ర తక్కువైనదేమి కాదు.

ముఖ్యంగా సాహిత్య, సాంస్కృతిక కళా రంగాలలో ఈ జిల్లాకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇక్కడి పరిపాలకులు స్వయంగా కవి పండితులు మాత్రమే కాకుండా, కవి పండిత పోషకులు. సుమారు నాలుగువేల సంవత్సరాల సాంస్కృతిక, సాహిత్య చరిత్ర కలిగిన భూభాగము నల్లగొండ జిల్లా. ఈ జిల్లా సాహిత్య పరిచయం అనేది శాసన యుగంతో ప్రారంభమవుతుంది. క్రీస్తు శకం. 388 నుండి 624 వరకు దాదాపు 235 సంవత్సరాలు డజను మంది విష్ణుకుండిన రాజులు ఇంద్ర పాల నగరం (నేటి రామన్నపేట దగ్గరలో ఉన్న పెద్ద తుమ్ముల గూడెం) ను రాజధాని గా చేసుకొని పరిపాలించారని అనేక ఆధారాల వల్ల తెలుస్తుంది. కాల క్రమంలో ఈ జిల్లాలో లభించిన అతి ప్రాచీన శాసనం ఇక్కడ లభించిందే. అది క్రీస్తు శకం 435 నాటిదని పరిశోధకులు తేల్చారు. ఇందులో గోవింద వర్మ అనే రాజు పాండిత్య ప్రస్తావన ఉంది. ఇక్కడే క్రీస్తు శకం 566 నాటి తామ్ర శాసనం కూడా లభించింది.

అలాగే క్రీస్తు శకం 1051 నాటి శోభ దేవుని ప్రశంసించే కొలను పాక శాసనం, ధ్రువేశ్వర పండితుని గూర్చి పేర్కొన్న క్రీస్తు శకం 1067 నాటి చిలుకూరు శాసనం కూడా సంస్కృతంలోనే ఉన్నాయి.ఇంకా పండితులు, శాసనాలు రాసిన కవులు సంస్కృతాంధ్ర భాషలోనే గాక కన్నడ, తమిళ భాషలలో కూడా పండితులనడానికి ఆధారాలున్నాయి. అలాగే క్రీస్తు శకం 1124లో నంది సూరిని ప్రశంసిస్తూ వేయించిన పానగల్లు శాసనంలోనూ, క్రీస్తుశకం 1369 నాటి నాగనాధుని ప్రసక్తిగల అయినవోలు శాసనంలోనూ సంస్కృత ఆంధ్ర భాషల్లో గద్య పద్యాలు ఉన్నాయి. అలాగే కొలనుపాకలో వెలసిన జైన దేవాలయం, పిల్లల మర్రి,పానగల్లు, వాడపల్లిలోని హైందవ దేవాలయాల ప్రాంతంలో జిల్లా కవి పండితులు అనేక కావ్య రచనలు చేసే ఉంటారు. ఇంకా మరింగంటి కవులకు పుట్టినిల్లు అయినా కనగల్లు ప్రాంతము నుండి కవితా రచన చేసిన వారు చెన్న కృష్ణమాచార్యులు, నరసింహ చార్యులు, వెంకట రాఘవాచార్యులు వంటి అనేక మంది ఉన్నారు.

జిల్లా సాహిత్య చరిత్రలో ఆధునిక యుగము షబ్న వీసు వెంకట రామా నర్సింహారావు తో మొదలవుతుంది. ఈయన 1922లో నీలగిరి పత్రికను నల్గొండ కేంద్రం నుంచి ప్రారంభించి తెలంగాణలో తెలుగు పత్రికలు లేని కొరతను తీర్చారు. సూర్యాపేటలో గవ్వా అమృత రెడ్డి, మురహరి రెడ్డి జానకిరామ్ రెడ్డి మొదలైన సోదరులు తమ గ్రంథాల ద్వారా కావ్యాలు నాటకాలు ప్రచురించారు. నకిరేకల్ మండలంలోని చందుపట్ల నివాసి అయిన శ్రీ పెరంబదూర్ కవులున్నారు. వారిలో సంస్కృతాంధ్రలో అనర్గళంగా కవిత్వం చెప్పగల శ్రీ రాఘవాచార్యులు ప్రౌఢకవి. నల్లగొండలో పేరిన్నిక గన్న మరో కవితా శాఖ సాహితీ మేఖల. ఈ సంస్థను కవిరత్న అంబడిపూడి వెంకటరత్నం శాస్త్రి 1934లో చండూరులో స్థాపించారు. వీరు బహుభాషా వేత్త. బహు గ్రంథ నిర్మాత. వీరి శిష్యులలో సిరి ప్రగడ భార్గవరావు, దవళ శ్రీనివాసరావు, పులిజాల హనుమంతరావు, మద్దో జు సత్యనారాయణ మొదలగు వారు బలమైన కవిత్వం రాసి సాహితీ మేఖల కీర్తిని మరింత ఇనుముడింపజేశారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ‘ అని ఎలిగెత్తి చాటిన దాశరధి తొలి కావ్యం ‘అగ్ని ధార ‘ ను సాహితీ మేఖల ప్రచురించి తన ఉన్నతిని చాటుకుంది. ఈ విధంగా తెలంగాణలో పద్య కవిత్వానికి పెద్ద పీట వేసి శతాధికా రచనలు వెలువరించి జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది.

భావ కవిత్వం నుండి అభ్యుదయ కవిత్వం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాకు చెందిన ఎందరో కవులు, రచయితలు సమాజాన్ని బహు ముఖాలుగా సమీక్షించి ఉత్తమ రచనలు చేశారు. అభ్యుదయ యుగములో చెప్పుకోదగిన వారిలో వట్టికూట అల్వార్ స్వామి ముఖ్యులు. తెలంగాణ ప్రజల భాషలో కథలు, నవలలు రాసి తెలంగాణ తొలి నవల రచయితగా పేరొందారు . వీరు రాసిన ‘ప్రజల మనిషి‘ ‘ గంగు‘ నవలలు నిజాం రాజులు సాగించిన అరాచకాలకు అద్దం పట్టాయి. తెలంగాణలో జరిగిన రైతాంగ పోరాటంలో ఉద్యమ స్ఫూర్తితో రచనలు చేసిన వారిలో రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బి.ఎన్.రెడ్డి, కందిమల్ల ప్రతాపరెడ్డి మొదలైన వారెందరో ఉన్నారు. అట్లాగే ‘బండెనుక బండి కట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లే వస్తవ్ కొడుకో నైజాము సర్కరోడా…‘ అన్న యాదగిరి పాట, ప్రజాకవి సుద్దాల హనుమంతు పాటలు ఆ కాలంలో నల్లగొండ జిల్లా నుండి ఉర్రూతలు ఊగించడమే కాకుండా యావత్ తెలంగాణను కదిలించాయి.

నీలగిరి కవుల చరిత్ర పుస్తకంలో పాల్కురికి సోమనాధుని ‘నృషాధిపా శతకం‘ మనకు లభించిన శతకాలలో అన్ని లక్షణాలు కలిగిన మొట్టమొదటి శతకం . దీనిలో వివిధ భాషల పద్యాలను చెప్పాడు. యాదగిరి క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి గూర్చి ఈ జిల్లాలోని కవులు ఎందరో శతక స్తోత్రాది కవితా పుష్పార్చన చేసి ధన్యులైనారు. ఈ దేవునిపై వచ్చిన సాహిత్యం ఎంతో ఉన్నది. ఇట్లా శతక స్తుతి చేసిన వారిలో నిడిగొండ బలరామ శర్మ, ఈగ బుచ్చి దాసు, కాటూరి లక్ష్మీనారాయణ చార్యులు, వరదాచార్యులు వంటి ప్రతిభా మూర్తులు ఉన్నారు . వీరంత లక్ష్మీ నరసింహ స్వామి గురించి శతక సాహిత్యంలో అవతార వైభవం, విష్ణు ప్రాముఖ్యం, వింతలు విశేషాలు మహాత్యాలను వర్ణించారు. ఈ జిల్లాలో శివకవుల యుగం పాల్కురికి సోమన కాలంతో ప్రారంభమవుతుంది.

సోమన జన్మస్థానం పాలకుర్తి ఒకప్పుడు నల్లగొండ జిల్లాలోనిదే. ఆ తర్వాత విశ్వేశ్వరుడు, సాకల్య మల్లన్న, గౌరన మొదటి వారు నారాయణపురం మండలంలోని రాచకొండ ప్రాంతానికి చెందిన వారే. ఇటువంటి విషయాలే కాకుండా ఆంధ్ర మహాసభలు జరిగిన తీరు తెన్నులు, తెలంగాణ సాయుధ పోరాటం వివరాలు అనేకం ఈ పుస్తకం నిండా ఉంటాయి. సూర్యాపేట తాలూకా పిల్లల మర్రి గ్రామ నివాసి పిల్లలమర్రి పిన వీరభద్రుడు ఇక్కడి వారే. రాచకొండ ప్రభువులు ఆస్థానంలో ఉండగా పోతన తాను రచించిన భాగవతాన్ని తనకు అంకితం ఇవ్వమనగా అందుకు నిరాకరించిన పోతనను రాజు చాలా కష్టాలు పెట్టాడు అని ప్రతీతి.

ఈయన ‘భోగిని దండకం‘ ‘వీరభద్ర విజయం ‘ వంటి గ్రంథాలు రాశారు. ఈ రాచకొండ ఆస్థానంలోనే శ్రీనాథ మహాకవి కనకాభిషేకం పొందినారు. 1922లో స్థాపించిన నీలగిరి పత్రిక ఎంతో ప్రజా చైతన్యం గావించింది. 1901లో హైదరాబాదులో స్థాపించిన శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం వ్యవస్థాపకంలో ఒకరైన రావిచెట్టు రంగారావు (1877-1910) నల్లగొండ జిల్లాలోని దండంపల్లి నివాసి. ఇట్లా రాచకొండ దేవరకొండ ఆస్థాన కవులు, చాటుకవులు, ముడుంబ కవులు, మరిం గంటి కవులు, శ్రీ పెరంబుదూరు కవులు , కుందాక కవులు, శేషాద్రి రమణ కవులు, యక్షగాన సాహిత్యకారులు, పద్యం నాటక కర్తలు, శ్రీ రామ కవచం కవులు, సాహితీ మేఖల కవులు, క్రైస్తవ మత కవులు, నాని కవులు, సరికొండ కవులు ,గోల్కొండ కవులు, ప్రాచీన కవులు,ఆధునిక కవులు, ఇతర గ్రంధాలు ఇట్లా అనేక విషయాలు ఈ గ్రంథం లో సంక్షిప్తం చేయబడ్డాయి
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రముఖులు రావి నారాయణరెడ్డి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు కొనసాగిన పోరాటంలో అనేకమంది కవులు రచయితల వివరాలు పొందుపరచడం గొప్ప విషయం.

చెర బండరాజు, బోయ జంగయ్య, వసంతరాయ్, డాక్టర్ ఎన్ గోపి, బి రాములు, నిఖిలేశ్వర్, దేవరాజు మహారాజు, మే రెడ్డి యాదగిరి రెడ్డి, బండారు సుజాత శేఖర్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, వేణు సంకోజు, పురుషోత్తమాచార్యులు మొదలగువారితోపాటుఏనుగు నరసింహారెడ్డి, పెన్నా శివరామకృష్ణ, బాల సాహితీవేత్త అలుగుబెల్లి రామచంద్ర రెడ్డి, అంబటి వెంకన్న, అభినయ్ శ్రీనివాస్, ఆవుల పిచ్చయ్య, మునాస వెంకట్, ఉమ్మెత్తల కేశవరావు, ఎలికట్టే శంకర్రావు, బాల కథా రచయిత, పుప్పాల కృష్ణమూర్తి, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, కందుకూరి దుర్గాప్రసాద్, జానకిరామ్ , వడ్డేపల్లి వెంకటేష్, కూరెళ్ళ శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి, కే శ్రీనివాస్, గంటా జలంధర్ రెడ్డి, కృష్ణ కౌండిన్య, సాగర్ల సత్తయ్య, పెరుమాళ ఆనంద్, బండారు శంకర్, దేవులపల్లి కృష్ణమూర్తి, బైరెడ్డి కృష్ణారెడ్డి, బోధనపు నర్సిరెడ్డి, బెల్లి యాదయ్య , స్కై బాబా, గౌస్ మొయినుద్దీన్, సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ తిరునగరి శ్రీనివాస్, ముదిగంటి సుజాత రెడ్డి, బండారు సుజాత శేఖర్, భాను శ్రీ కోత్వాల్, ఉప్పల పద్మ, చెరుకు ఉషా గౌడ్, పున్న అంజయ్య, మారోజు బాల నరసింహ చారి, చందాల కేశవ దాస్, డాక్టర్ ఎస్ రఘు, పెద్దిరెడ్డి గణేష్, భూతం ముత్యాలు, కందిమల్ల ప్రతాపరెడ్డి, దున్న ఇద్దాస్, చింతా ముత్యాలరావు, ఏ బూసి నరసింహ, మండల స్వామి, పెసరు లింగారెడ్డి, పోరెడ్డి రంగయ్య, పగడాల నాగేందర్, సరికొండ నరసింహారావు, ఇట్లా అనేకమంది వర్ధమాన రచయితల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.

రచయిత పున్న అంజయ్య గారి దశాబ్దాల కృషి ఫలితంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి నీలగిరి కవుల సంచిక వెలువడింది. సాహిత్య పరంగా మరుగున పడిన అనేక విషయాలు తెలియడమే కాకుండా రేపటి భావితరాలకు ఇది దిక్సూచి గ్రంథం అవుతుంది. ఇంత విపులంగా,వివరంగా కవుల చరిత్ర రాయడం ముదావహం. అందుకుగాను అంజయ్యను అభినందిస్తూ విశ్వవిద్యాలయాలలో నల్లగొండ జిల్లా సాహిత్యం పైన, కవిత్వం పైన పరిశోధనలు జరుగుతున్న నేటి కాలంలో పరిశోధకులకు ఈ గ్రంథం ఎంతో ఉపయోగపడగలదు. ఇంకెందుకు ఆలస్యం? నీలగిరి కవుల చరిత్ర మీ చేతుల్లో ఉంది. వెంటనే చదవండి. నిక్సాన తెలంగాణ సాహిత్య మూలాలు తెలుసుకోండి.

కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
9441561656

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News