Thursday, January 23, 2025

సూర్యాపేట: నాడు- నేడు

- Advertisement -
- Advertisement -

ఒక వ్యక్తిపై మరో వ్యక్తి, ఒక వర్గంపై మరో వర్గం ఆధిపత్యం ఉండకూడదు. భూమి భుక్తి విముక్తి కోసం సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టిన కేంద్రంగా నిలిచింది సూర్యాపేట. వెట్టిచాకిరీకి వ్యతిరేకం గా పోరాడిన సూర్యాపేట చరిత్ర చాలా గొప్పది. కానీ అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ అభివృద్ధి ఎలా కుంటుపడిందో,అందులో భాగంగా సూర్యాపేట అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఒకనాటి సూర్యాపేట ప్రజా పోరాటాల్లో రాటుతేలింది. కాని ప్రాంతం అభివృద్ధి విషయంలో వెనుకబడింది. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముంగటి పరిస్థితులకు రాష్ట్ర అవతరణ తర్వాత పరిణామాలను చూస్తే నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తెలంగాణ కథలు మారవని, ఈ గోస లు తీరవనుకుని తెలంగాణ తీరని నిరాశలో మునిగింది. రాష్ట్రం రాకముందు సూర్యాపేట అభివృద్ధికి చాలా దూరంలో ఉంది. అలాంటి సూర్యాపేట తెలంగాణ వచ్చినంక జిల్లా కేంద్రం అయింది. సూర్యాపేటలో భారీ కలెక్టరేట్ భవనం నిర్మించబడింది.

ఇపుడు కలెక్టరేట్‌కు నడుసుకుంటూ పోయేంత దగ్గరికి వచ్చింది. ఎస్‌పి కార్యాలయం వచ్చింది. మెడికల్ కాలేజీ వచ్చింది. అత్యాధునిక మార్కెట్ వచ్చింది. తెలంగాణ రాక ముందు సూర్యాపేటలో మంచినీళ్ళు ఆకుపచ్చగా ఉండేవి. హైదరాబాద్ పాయిఖానాల నీళ్ళు సూర్యాపేటకు మంచి నీళ్ళా అని జల ఉద్యమ నాయకుడు దుశ్చర్ల సత్యనారాయణ అన్నది అక్షరాల సత్యం. మూడు రోజుల కొకసారి వచ్చే ఆకుపచ్చ రంగు మంచి నీళ్ళతో సూర్యాపేట తల్లడిల్లింది. 60 ఏళ్ళుగా మన ఘనతవహించిన పాలకులు చేసిన నిర్వాకం ఎంత ఘోరమైనదో ఆనాటి సూర్యాపేట మంచినీళ్ళ గ్లాసు చూస్తే కనిపించేది. అమ్మతోడు ఇది సూర్యాపేట కన్నీళ్ళ మంచినీటి కథ. ఇది జరిగిన కథ. ఇది మనందరం చూసిన మంచినీళ్ళ కథ.ప్రజలందరికీ దక్కాల్సిన కనీస ప్రాథమిక హక్కయిన మంచినీళ్ళు కూడా సక్రమంగా అందించలేని గతపాలకుల నిర్వాకం క్షమించతగింది కాదు. సూర్యాపేట నీళ్ళ గోస తీర్చే నాయకుని కోసం ఎదురు చూసింది నిజం. రాష్ట్ర అవతరణ తర్వాత పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు కెసిఆర్ శ్రీకారం చుట్టారు.

అందులో భాగంగానే సూర్యాపేటలో కలెక్టరు కార్యాలయం, ఎస్‌పి కార్యాలయం నిర్మించబడ్డాయి.దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మార్కెటు కాంప్లెక్సు, మెడికల్ కాలేజీలను నిర్మించుకోవడం జరిగింది. పరిపాలనా రంగంలో వచ్చిన విప్లవాలవల్ల ప్రజలకు పాలన చేరువైంది. జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్‌పి ఒక రోజులో జిల్లా మొత్తం పర్యటించి తిరిగి తమ కార్యాలయానికి చేరుకునే వెసులుబాటు కలిగింది. ఇది నూతన చరిత్ర. 60 ఏళ్ళలో జరగని మార్పులు వర్తమానంలో చూడడం అనుభవించడం జరుగుతోంది. కలెక్టరేట్లు మిని సెక్రటేరియేట్ల లాగా దర్శనమిస్తున్నాయి. కలెక్టరేట్‌లో అన్ని శాఖలకు సంబంధించిన కార్యాలయాలన్నీ ఒకే దగ్గర కేంద్రీకృతం కావడం ప్రజలకు మరింత సౌలభ్యం. సూర్యాపేట జిల్లాలోనే కృష్ణా గోదావరి నదులు సంగమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కోదాడ నుండి హైదరాబాదు వరకు విజయవాడ జాతీయ రహదారిపై 175 కి.మీ. ప్రయాణం చేస్తుంటే ఎటు చూసినా ఎర్రసెలకలు, ఎండిన చెరువులు, చెరువుల్లో పెరిగిన తుమ్మల్లో తోపులు కనిపించేవి.

ఇప్పుడు హైదరాబాదులోని పెద్ద అంబర్‌పేట నుంచి మునగాల వరకు ప్రయాణిస్తూ ఎటు చూసినా భూమికి పచ్చటి రంగేసినట్లు పంటలు, నిండిన చెరువులు, మత్తడి దుముకుతూ కనిపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బోర్ల కథలు అన్నీఇన్నీ కావు. ఒకనాడు బువ్వగింజల కోసం పోరాటం చేసిన నల్లగొండ జిల్లా ఇప్పుడు దేశానికే ధాన్యాగారం అయింది. ఆరోగ్యపరంగా ఏ ప్రమాదం జరిగినా వైద్యం కోసం హైదరాబాదు పోవలసి వచ్చేది. ఇప్పుడు మెడికల్ కళాశాల సూర్యాపేట నడిబొడ్డులో నిర్మించబడింది. సూర్యాపేట ఇప్పుడు ఆరోగ్యకేంద్రంగా మారింది. సూర్యాపేట నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు శాసన సభ్యులుగా ఉప్పల మల్సూరు నాలుగు సార్లు, దైదా సుందరయ్య ఒకసారి, ఈదా దేవయ్య సగం పిరియడు, ఆకారపు సుదర్శన్ రెండుసార్లు, ఎడ్లగోపయ్య ఒకసారి, వేదాసు వెంకటయ్య, దోసపాటి గోపాల్‌లు, రామిరెడ్డి దామోదర రెడ్డిలు ఒక్కొక్కసారి ఎన్నికయ్యారు. సూర్యాపేట నుంచి రెండుసార్లు గెలిచిన ఆకారపు సుదర్శన్ టిడిపి హయాంలో కొన్ని అభివృద్ధి పనులు జరిగాయి.

సుదర్శన్ ఆర్‌టిసి చైర్మన్‌గా ఉండడంతో ఏరియా ఆసుపత్రి, పాలిటెక్నిక్ కాలేజీ,హైటెక్ బస్టాండులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ముఖ్యమంత్రిగా కెసిఆర్ బాధ్యతలు చేపట్టిన పిదప సూర్యాపేటకు నేతృత్వం వహిస్తున్న మంత్రి జగదీశ్వర రెడ్డి నాయకత్వంలో ఈ తొమ్మిదేళ్ళలో జరిగిన మార్పు గత 60 ఏళ్ళలో ఎన్నడూ జరగలేదు. రాంరెడ్డి దామోదర రెడ్డి హయాంలో సూర్యాపేట నడిబొడ్డు నుంచి బైపాస్ రోడ్డు వెళ్ళడం వల్ల పట్టణం రెండుగా చీలింది. గత 60 ఏళ్ళలో సూర్యాపేటలో అభివృద్ధి అంటే ఆమడ దూరంలో ఉందని చెప్పాలి. సూర్యాపేటలో 60 ఏళ్ళలో అభివృద్ధి సంగతి దేవుడెరుగు కానీ హత్యలు జరిగేవి. ఒకరిపై ఒకరు క్రిమినల్ కేసులు, కోర్టుల చుట్టు తిరగడాలు పెరిగాయి. బీరు, బ్రాందీ షాపుల సిండికేట్లు, మంచినీళ్ళ సిండికేట్లతోనే సూర్యాపేట రాజకీయం నడిచింది. ప్రజలు చికాకులకు గురి అయ్యారు. పట్టణంలో రౌడీయిజం బాగా పెరిగింది. ఎవరెప్పుడు ఏ షాపు మీదికి వస్తారో, ఏమి తీసుకుపోతారో అనే భయం ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత సూర్యాపేటకు విముక్తి లభించినట్లయ్యింది.

శ్రీరామ్‌సాగర్ రెండవ దశ కాలువలు తవ్వారు కానీ నీళ్ళు రాలేదు. పార్లమెంటు సభ్యుడైన భీమిరెడ్డి నరసింహారెడ్డి కృషితో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యస్సారెస్పీకి తిరుమలగిరి ప్రగతీ నగర్‌లో శంకుస్థాపన చేయటం జరిగింది. కానీ కాలువల్లోకి నీళ్ళు రాలేదు. రైతాంగం ఇక్కట్లు పెరిగాయి. విపరీతమైన కరువులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కెసిఆర్ దార్శనిక ఆలోచనలు మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక కృషి, చొరవతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బయ్యన్నవాగు నుంచి సూర్యాపేటకు నీళ్ళు వచ్చాయి. ఈ విధంగా తుంగతుర్తి, సూర్యాపేటలకు కాళేశ్వరం జలాలు ప్రవహించాయి. కోదాడ, మునగాల మండలాలలోని 30 వేల ఎకరాలకు కాళేశ్వరం జలాల ద్వారానే నీళ్ళందుతున్నాయి. రైతు కూలీల ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. రాష్ట్ర అవతరణ తర్వాత ఈ తొమ్మిదేళ్ళ కాలంలో సూర్యాపేట నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల పేరున అభివృద్ధి పనులకు రూ. 8,500 కోట్ల ఖర్చు చేయడం జరిగింది.

సూర్యాపేట మునిసిపాలిటీ పరిధిలో రూ. 1400 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగింది. 22 స్మశాన వాటికలు, 15 పార్కులు, 6 క్రీడా ప్రాంగణాలు, సద్దుల చెరువులో బోటింగ్ సౌకర్యం వచ్చింది. సద్దుల చెరువు బోటింగ్ ద్వారా రోజు కు 20 వేల రూపాయల ఆదాయం టూరిజం శాఖకు వస్తోం ది. హైదరాబాద్ మహాప్రస్థానానికి దీటుగా సూర్యాపేటలో విద్యుత్ దహనవాటిక వచ్చింది. దూరాజ్‌పల్లి దాటినాక కార్మిక భవన్ మంజూరైంది. లింగమంతుల జాతర ఘనంగా జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News