Wednesday, January 22, 2025

హిట్లర్‌ను ప్రశ్నించిన పోప్ పక్షపాతం

- Advertisement -
- Advertisement -

నాజీ జర్మనీ క్రైస్తవాధిక్య దేశం. ఆరేళ్ళ హిట్లర్ పాలన తర్వాతి 1939 జనగణనలో 54% ప్రొటెస్‌స్ట్టాంట్లు, 40% కాథలిక్కులు, 3.5% సృష్టికర్తను నమ్మేవారు, 1.5% నాస్తికులు, 1% ఇతరులు. హిట్లర్ మైనారిటీ మతాలను నిషేధించాడు. యూదులను చంపాడు. కాథలిక్ చర్చి నాజీ ప్రభుత్వంతో సహకరించడానికి ప్రయత్నించింది. ప్రభుత్వం, చర్చికి మధ్య 20 జులై, 1933న రీచ్‌స్కోన్‌కోర్డాట్ (సమ్మతి) ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం తమకు చట్టబద్ధతను ఇచ్చిందని నాజీలు భావించారు. దీనితో చర్చి రక్షణకు ప్రయత్నించింది. నాజీయిజం కొనసాగదని, స్నేహపూర్వక పద్ధతి సాధారణ స్థితిని తెస్తుందని చర్చి అభిప్రాయం. ఈ సహకారం ఫలించలేదు. నాజీలు మతాధికారులను రాజకీయాల నుండి నిషేధించారు. సమ్మతి ఒప్పందం కాథలిక్ మత స్వేచ్ఛ, ప్రజాభ్యాస హామీ, చర్చి స్వీయనియంత్రణలను ఇచ్చింది. ఒప్పందాన్ని హిట్లర్ నిర్లక్ష్యం చేశాడు. 3 నెలల్లోనే కాథలిక్, స్వచ్ఛంద సంస్థలను మూసేశాడు. కాథలిక్‌లను చర్చిల్లోనే బంధించాడు. బడులు, పత్రికలను ఆపేశాడు. 14 జులై, 1933 న చర్చి వ్యతిరేక జన్యుబలహీన జన్మనిరోధక (స్టెరిలైజేషన్) చట్టం చేశాడు. 30 జులై 1933 న యువజన సంఘాలను రద్దు చేశాడు. నాయకులు, మతాధికారులు, సన్యాసినులను అరెస్టు చేశాడు.

కాథలిక్ 11వ పోప్ పియస్ నాజీ దాడిని నిరసించారు. దైవభక్తి, శుద్ధజాతి, దేశభక్తితో నాజీలను ఆరాధన స్థాయికి పెంచారన్నారు. నాజీ జాతీయ మతం, జాతి దైవం, జాత్యహంకారాలను విమర్శించారు. సహకరించకపోతే చర్చిపై దాడి పెరుగుతుందని నవంబర్ 1936లో హిట్లర్ హెచ్చరించాడు. 21 డిసెంబర్, 1936న పోప్ మతాధిపతులను రోమ్‌లో సమావేశపర్చారు. 16 జనవరి, 1937న పీఠాధిపతులు ప్రతి చర్యకు ఆమోదించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయానికి కాథలిక్ ప్రతిఘటన పెరిగింది. పోప్ 14 మార్చి 1937న మిట్ బ్రెన్నెండర్ సోర్జ్ (తీవ్ర ఆందోళనతో) లేఖను జారీ చేశారు. 3 లక్షల ప్రతులను రహస్యంగా అచ్చువేసి 21 మార్చి 1937న చర్చిలలో చదివారు. సమ్మతి ఒప్పంద ఉల్లంఘనలను, మతోన్మాదం, క్రీస్తు పూర్వ ఛాందసవాదం (నియోపాగనిజం), పవిత్ర జాతి, రక్తం వంటి అవాస్తవ గాథలను, జాతి ఔన్నత్య భావాలను ఈ లేఖ ఖండించింది. హక్కుల తిరస్కరణ, అణచివేతను సమిష్టిగా రక్షించాలంది. ఒక జాతిని అన్నిటి కంటే గొప్పగా చూపుతున్న నాజీ భావజాలం మతానికి విరుద్ధమని హెచ్చరించింది. యూదులను సమర్థించింది. పోప్ కమ్యూనిజానికి పరోక్ష అనుకూలురని నాజీల అభియోగం. పోప్ మత చట్రంలోనే నాజీయిజాన్ని ఎదిరించారు.

రచయిత ఆంథోనీ రోడ్స్ తన ‘నియంతల యుగంలో వాటికన్’ అన్న పుస్తకంలో హిట్లర్ దైవత్వ ఆకాంక్షతో, పిచ్చి ప్రవక్త అసహ్య అహంకారంతో తనను క్రీస్తుతో పోల్చుకున్నాడన్నారు. చరిత్రకారుడు మైఖేల్ బర్లి మనిషిని దేవుడిగా ఉన్నతీకరించే ఫ్యూరర్ -సంస్కృతిని గుర్తించారు. బెదిరింపులు, ఆర్థిక పౌర వైకల్యాల ముప్పు, రాజవిధేయతలపై దేశభక్తి ఆధారపడుతున్నది. ఇది మానవ హక్కులు, గౌరవాలను ఉల్లంఘిస్తున్నది. ఈ లేఖ క్రైస్తవ నాగరికతకు ప్రాతిపదిక, నాజీ ప్రమాదాల సంగ్రహమని ‘కాథలిక్ హెరాల్డ్’ రాసింది. నాజీ భావజాల సానుభూతి సంస్థలకు పిల్లలను దూరంగా ఉంచాలని బిషప్ ఫోల్నర్ తల్లిదండ్రులందరినీ కోరారు. ప్రతి జీవిత రంగాన్ని, సంస్థను ఉధృతంచేసే నైతికత సూత్రాలను విస్మరించడం భవిష్యత్ తరాలను విషపూరితం చేస్తుంది. నాజీ ఆరాధన ప్రజాస్వామ్య- ఉదారవాద మానవ హక్కులను, సమాజం -ప్రజల సంబంధాన్ని విస్మరించింది. యువత రాజ్యవిధేయతతో జాతి సమాజ స్థాపనను నిరోధించదు. స్వేచ్ఛాస్వాతంత్యాల కోసం పోరాడమని, ఇంద్రియాల బురదలో స్వేచ్ఛను ముంచవద్దని యువతకు చెప్పాలి. ఇంద్రియ కట్టడిని ఆదేశించేవాడు శాంతిని కోరడు. పాలక ప్రయోజనమే ప్రజల హక్కు అనే నాజీ సూత్రం చట్టవిరుద్ధమైంది. క్రీస్తును నమ్మాలని, సమ్మతి ఒప్పందం ఇచ్చిన హక్కులను కాపాడుకోవాలని పియస్ ప్రజలను కోరారు. నాజీ దుర్మార్గాలను మత భాషలో వివరించారు. సత్యాన్ని సేవించమని పూజారులు, మతస్థులకు పిలుపుతో పియస్ లేఖను ముగించాడు.

1933 సమ్మతి ఒప్పందం నాజీయిజాన్ని ఎదుర్కోవడానికి, విమర్శించడానికి ధైర్యం చేసిన మొదటి పత్రంగా మిగిలింది. పోప్ ధైర్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. చర్చి ప్రశ్నలను హిట్లర్ పట్టించుకోలేదు. మిట్ బ్రెన్నెండర్ సోర్జ్‌ను తన నోరు మూయించేదిగా, తన దృష్టికోణ తిరస్కరణగా హిట్లర్ భావించాడు. మిట్ బ్రెన్నెండర్ సోర్జ్ విడుదల కాథలిక్ చర్చిపై నాజీల వేధింపులను పెంచింది. హిట్లర్ రహస్య పోలీసు గెస్టపొ చర్చిల పై దాడి చేసింది. లేఖ ప్రతులను జప్తు చేసింది. లేఖను ముద్రించిన ప్రచురణ సంస్థలను మూసివేసింది. పత్రికలను నిషేధించింది. చర్చికి కాగితంపై పరిమితులు విధించింది. అధికారులు, నాజీలు చర్చి పాలనను ఆపారు. విచారణ సాకుతో మతాధిపతులను నిర్బంధించారు. జైలుకు, నిర్బంధ శిబిరాలకు పంపారు. విద్యార్థులకు, పూజారులకు అంగీకరించిన నిధులను తగ్గించడం వంటి అనేక చర్యలు చేపట్టారు. మతాధికారులపై హిట్లర్ తీవ్ర మౌఖిక దాడులు చేశాడని, చర్చి, మతాధికారులపై అనేక అనైతికత విచారణలు ప్రారంభించాడని గోబెల్స్ రాశాడు. నియంత్రించబడిన జర్మన్ పత్రికలు ఈ లేఖ వివరాలను ప్రస్తావించలేదు.
నాజీ జాత్యహంకారం, యూదు వ్యతిరేక ఉన్మాదాలపై చర్చి తాత్వికత ఏమిటనేది ప్రశ్న కాదు.

తన మత సంబంధ ఆందోళనలో చర్చి యూదులను చేర్చుకుందని, వారికి సంఘీ భావాన్ని అందించిందని స్పష్టంగా చర్చి ప్రకటనలు లేవు. యూదుల గురించి కాక భిన్నమైన విషయాలను చర్చి పరిగణించింది. యూదుల రక్షణ విధానం ఈ విషయాల్లోనే గాక ఇతర రంగాల్లోనూ దెబ్బ తీస్తుందని భావించింది. యూదుమతం జుడాయిజం, యూదు వ్యతిరేకతల నేపథ్యంలో యూదుల పట్ల నిష్క్రియాత్మకత, ఉదాసీనతలను ఎదుర్కోడంలో యూదుల రక్షణలో చర్చి ప్రకటనలు విఫలమయ్యాయి. వీటిని యూదుల సహాయానికి రూపొందించలేదు. కమ్యూనిజాన్ని ఖండిస్తూ, దాని సూత్రాలను మత శత్రుత్వంగా ప్రకటిస్తూ 5 రోజుల తర్వాత పియస్ మరో లేఖ ‘దివిని రిడెంప్టోరిస్’ రాశారు. కమ్యూనిజాన్ని శత్రువుగా అసహ్యించుకున్నాడు. కమ్యూనిజం, ఉదారవాదాల తొలగింపుకి కాథలిక్ బోధన చేయాలని కోరారు. దివిని రిడెంప్టోరిస్, మిట్ బ్రెన్నెండర్ సోర్జ్ కంటే దురుసుగా ఉంది. నాజీయిజం కంటే కమ్యూనిజాన్ని ఖండించింది. కాథలిక్ చర్చి ప్రశాంతతను, శ్రేయస్సును పునరుద్ధరిస్తే హిట్లర్‌కు పూర్తి మద్దతును అందించే స్థాయికి రెండవ లేఖ దిగజారింది.
నాజీ హింసకు ప్రతిస్పందనతో చాలా మంది రచయితలు ప్రభావితమయ్యారు.

మిట్ బ్రెన్నెండర్ సోర్జ్‌ను సామ్యవాద సంస్కరణగా ప్రశంసించారు. నియోపాగన్ సిద్ధాంతాలను జర్మన్ అధికారులు ఇష్టపడతారని కొందరు రాశారు. ఈ లేఖలో పోప్ పియస్ నాజీ సిద్ధాంత, రాజకీయ, సామాజిక నిరంకుశవాదాన్ని ఖండించకుండా నియోపాగనిజం (క్రీస్తు పూర్వ బహు దేవతల సనాతన ఆధ్యాత్మిక సాంప్రదాయాల పునరుద్ధరణ), మత స్వేచ్ఛ తిరస్కరణను, హిట్లర్ జాత్యహంకారాన్ని ఖండించారు. ఈ లేఖ సమస్య వాస్తవ కోణం, నాజీల అంతర్జాతీయ జీవనశైలి గురించి ఆలోచించిన పోరాట పత్రం కాదు. దౌత్య పరిమితితో వివాదాస్పదమైంది కాదు. ఇటాలియన్ ఫాసిజంను వ్యతిరేకిస్తూ 29 జూన్ 1931న ఈయనే రాసిన నాన్ అబ్బియామో బిసోగ్నోకు విరుద్ధమయింది. చర్చి వ్యతిరేక నాజీ ప్రయత్నాలను కోర్టులు ఖండించగలిగాయి. కాథలిక్ పేపర్ డెర్ డ్యూయిష్ వెగ్ ప్రకారం జర్మనీలో పూజారుల సంఖ్య 1,22,792. నాజీ కాలంలో చర్చి పాలనపై పోరుతో లక్షలాది మంది మద్దతును పొందింది. కాథలిక్ చర్చిపై నాజీ అణచివేతకు వ్యతిరేకంగా ఊరేగింపులు చేశారు. 8 లక్షల ప్రజలు తీర్థయాత్రకు, 6 వేల మంది ఫ్రాంకోనియా బిషప్రిక్ 700వ వార్షికోత్సవానికి వచ్చారు. ప్రభుత్వ విధానాల మార్పుకు ప్రజాభిప్రాయ సమీకరణలో చర్చి విజయాన్ని సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News