పెద్దఅంబర్‌పేటలో ఐదు, నిజాంపేటలో ఒక నిర్మాణాలను కూల్చిన హెచ్‌ఎండిఏ, టాస్క్ ఫోర్స్ సిబ్బంది
ఇప్పటివరకు 178 అక్రమ నిర్మాణాలపై డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ చర్యలు
హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండిఎ, డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ టీమ్స్ చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం రెండు మున్సిపాలిటీల పరిధిలో (6) అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పెద్దఅంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని పెద్దఅంబర్ పేట్‌లో 3 అక్రమ నిర్మాణాలు, పసుమాములలో 2 అక్రమ నిర్మాణాలను హెచ్‌ఎండిఏ, టాస్క్‌ఫోర్స్ యంత్రాంగం కూల్చి వేసింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ప్రాంతం వాసవి లే ఔట్ లో ఒక యజమాని ఇంటికి గ్రౌండ్ ప్లస్ రెండు (జి+2) అంతస్తులకు అనుమతులు తీసుకొని స్లిట్ ప్లస్ ఐదు(5) అంతస్తుల అపార్ట్‌మెంట్ నిర్మాణం పనులు చేశారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్, హెచ్‌ఎండిఎ సిబ్బంది పైన నిర్మించిన (3) అంతస్తుల స్లాబ్స్ నిర్మాణాలను కూల్చి వేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 178 అక్రమ నిర్మాణాలపై డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్‌ఎండిఏ అధికారులు చర్యలు తీసుకున్నారు.