Saturday, November 23, 2024

ఎసిబి వలలో మాజీ డిఎస్‌పి, సెక్యూరిటి గార్డ్..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: హెచ్‌ఎండిఎ విజిలెన్స్ విభాగం మాజీ డిఎస్‌పి గ్యార జగన్, (ఔట్ సోర్సింగ్) సెక్యూరిటీ గార్డు బోనెల రాములు హెచ్‌ఎండిఎ కార్యాలయ సమీపంలో రూ.2లక్షల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఈక్రమంలో నిందితులను బుధవారం నాడు ఎసిబి కోర్టులో హాజరుపర్చగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వివరాల్లోకి వెళితే..ప్రగతి కస్ట్రక్షన్, డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ కోటేశ్వరరావు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలోని ఓ అపార్ట్‌మెంట్ నిబంధనలు ఉల్లగించిన క్రమంలో రూ. 4 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలని హెచ్‌ఎండిఎ మాజీ డిఎస్‌పి జగన్ డిమాండ్ చేశాడు. దీంతో మొదటి విడతగా రూ.2 లక్షలు ఇచ్చేలా హెచ్‌ఎండిఎ మాజీ డిఎస్‌పి జగన్‌తో ప్రగతి కస్ట్రక్షన్, డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ కోటేశ్వరరావు ఒప్పందం కుదుర్చుకున్నాడు. నిబంధనల మేరకు తాను అపార్ట్‌మెంట్ నిర్మాణం చేపట్టినప్పటికీ హెచ్‌ఎండిఎలో డిఎస్‌పిగా పనిచేసిన జగన్ తనను రూ. 4 లక్షలు లంచం డిమాండ్ చేశాడని కోటేశ్వరరావు ఎసిబి అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుని ఫిర్యాదు మేరకు ఎసిబి డిఎస్‌పి సూర్యనారాయణ నేతృత్వంలో హెచ్‌ఎండిఎ మాజీ డిఎస్‌పి జగన్ నివాసంలో దాడులు నిర్వహించి కీలక పత్రాలతో పాటు 56 తులాల బంగారు నగలు, విలువైన డాకుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు మాజీ డిఎస్‌పి జగన్‌తో పాటు ఆయన బంధువులు,కుటుంబ సభ్యులు, స్నేహితుల ఇళ్లలో ఎసిబి బృందాలు ఏకకాలంలో దాదాపు 16 గంటల పాటు తనిఖీలు చేపట్టారు. కాగా తనిఖీలలో లభించిన కీలక పత్రాలను పరిశీలించిన ఎసిబి అధికారులు మాజీ డిఎస్‌పి జగన్ బోడుప్పల్, కొర్రెముల, జోడిమెట్లలలో వెంచర్‌లు వేసినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. అదేవిధంగా బినామీ పేరుతో పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలినట్లు ఎసిబి అధికారులు వివరించారు.

హెచ్‌ఎండిఎలో డిఎస్‌పిగా పనిచేసిన జగన్ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఫిర్యాదులు వచ్చాయని, వాటిపైనా దర్యాప్తు చేపట్టామని ఎసిబి అధికారులు వివరిస్తున్నారు. కాగా హెచ్‌ఎండిఎ డిఎస్‌పిగా పని చేసిన సమయంలో జగన్ భారీగా అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు రావడంతో 2019లో జగన్‌ను నవంబరు నెలలో డిజిపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని వివరించారు. హెచ్‌ఎండిఎలో డిఎస్‌పిగా పనిచేస్తున్న సమయంలో రియల్టర్లతో కలిసి భారీగా సెటిల్మెంట్లకు పాల్పడ్డట్టు జగన్‌పై ఆరోపణలు వెల్లువెత్తడం, అలాగే లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టినట్లుగా వచ్చిన ఆరోపణలపై ఎసిబి అధికారులు ఆరా తీస్తున్నారు. ఆయన బినామీ ఆస్తులకు సంబంధించిన వివరాలపై ఎసిబి అధికారుల బృందం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరెన్నో ఆస్తులు బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలావుండగా మాజీ డిఎస్‌పి జగన్ భార్య లక్ష్మిఅంబర్ పేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అడిషనల్ ఎస్‌పిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో భారీ ఎత్తున ల్యాండ్ డాక్యుమెంట్లు, నగదు గుర్తించామని, మాజీ డిఎస్‌పి జగన్‌ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని అక్రమాస్తులు వెలుగుచూసే అవకాశం ఉందని ఎసిబి అధికారులు పేర్కొంటున్నారు.

 HMDA Former DSP in ACB Net

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News