Monday, January 20, 2025

రేవంత్ రెడ్డికి హెచ్‌ఎండిఎ లీగల్ నోటీసు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డికి హెచ్‌ఎండిఎ లీగల్ నోటీసు జారీ చేసింది. ఔటర్ రింగు రోడ్డు లీజు వ్యవహారంలో ఆయనకు హెచ్‌ఎండిఎ ఈ లీగల్ నోటీసు జారీ చేసింది. ఇప్పటివరకు చేసిన విమర్శలకు 48 గంటల గడువులో బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు మీడియా ద్వారా రాతపూర్వకంగా ప్రకటన ఇవ్వాలని తెలిపింది. లేని పక్షంలో లీగల్‌గా (సివిల్, క్రిమినల్ చర్యలు) కేసు వేయక తప్పదని స్పష్టం చేసింది. రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆధారరహితమైనవే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని హెచ్‌ఎండిఎ తరఫున లీగల్ నోటీసు ఇచ్చిన యాక్సెస్ లీగల్ అనే లా కంపెనీ వ్యాఖ్యానించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు హెచ్‌ఎండిఎ ప్రతిష్టకు భంగకరంగా ఉన్నాయని, అందులో పనిచేస్తున్న అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతినేదిగా ఉన్నాయని పేర్కొంది.

ఒఆర్‌ఆర్ (ఔటర్ రింగ్ రోడ్డు) లీజు విషయంలో కన్సెషనల్ అగ్రిమెంట్‌లో లేని విషయాలను ప్రస్తావించి అడ్వాన్సు పేమెంట్‌గా 10 శాతం చెల్లించాలన్నట్లుగా రేవంత్ వ్యాఖ్యానించారని, గడువు తేదీని పొడిగించాల్సిందిగా కాంట్రాక్టు పొందిన ఐఆర్‌బి అనే సంస్థ కోరినట్లుగా పేర్కొన్నారని, ఇవేవీ వాస్తవం కాదని యాక్సెస్ లీగల్ సంస్థ తన నోటీసుల్లో పేర్కొంది. ఒప్పందం ప్రకారం కన్సెషనల్ అగ్రిమెంట్ అమలులోకి వచ్చిన 120 రోజుల్లో కన్సెషన్ ఫీజు లేదా బిడ్‌లో పేర్కొన్న అమౌంట్‌ను చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. టెండర్ ప్రక్రియను ఫైనల్ చేయడానికి పదవీ విరమణ పొందిన బిఎల్‌ఎన్ రెడ్డి అనే వ్యక్తిని మేనేజింగ్ డైరెక్టర్‌గా రప్పించినట్లు రేవంత్ ఆరోపించారని, కానీ పరిపాలనాపరమైన అవసరాల్లో భాగంగా ప్రస్తుత ఎండి బదిలీ కావడంతో ఫుల్ అడిషనల్ ఛార్జితో మరొకరిని నియమించుకున్నట్లు యాక్సెస్ లీగల్ సంస్థ తరఫున న్యాయవాది పి.మోహిత్‌రెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఓఆర్‌ఆర్ టెండర్‌ను ఫైనల్ చేసే విషయంలో నిబంధనలకు అనుగుణంగానే హెచ్‌ఎండిఎ వ్యవహరించిందని, ఐఆర్‌బీ సంస్థ పట్ల పక్షపాత ధోరణి అవలంబించలేదని, ఆ సంస్థకు గతంలో పలు జాతీయ రహదారులపై టోల్ గేట్లు నిర్వహించిన అనుభవం కూడా ఉన్నదని పేర్కొన్నారు. పొలిటికల్ మైలేజ్ పొందడం కోసమే రేవంత్ మీడియా సమావేశాల ద్వారా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇకపైన ఓఆర్‌ఆర్ లీజుపై హెచ్‌ఎండిఎ ప్రతిష్టను దిగజార్చేలా, వాస్తవాలను వక్రీకరించవద్దని రేవంత్‌ను హెచ్చరించారు.
నోటీసులపై స్పందించిన రేవంత్…
అయితే సదరు నోటీసుపై రేవంత్ స్పందించారు. ఒఆర్‌ఆర్ లీజు విషయంలో కన్సెషనల్ అగ్రిమెంట్‌లోని అంశాలను, టెండర్ ప్రక్రియలో జరిగిన విషయాలనే తాను ప్రస్తావించానని, వాస్తవాలను వక్రీకరించలేదని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లీగల్‌గానే పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని, తాను లేవనెత్తిన వాదనలకు, విమర్శలకు కట్టుబడి ఉన్నానని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News