మంచిరేవుల్లో 130 ఎకరాలు…రూ 5 వేల కోట్ల ఆదాయానికి కసరత్తు
పెద్ద బిట్లు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు…మిగిలిన స్థలంలో ఐటి ఉద్యోగుల కోసం టౌన్‌షిప్‌ల నిర్మాణం
అటవీ, రక్షణ శాఖల నుంచి క్లియరెన్స్ రాగానే ఈ సంవత్సరంలోనే పనులు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: మరో లేఔట్ అభివృద్ధికి హెచ్‌ఎండిఏ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే కోకాపేట, ఖానామెట్‌లతో పాటు ఉప్పల్ భగాయత్ భూముల వేలంతో భారీగా ఆదాయాన్ని హెచ్‌ఎండిఏ ఆర్జించింది. అదే ఊపుతో అంతర్జాతీయ ప్రమాణాలతో మంచిరేవుల్లోని బైరానిగుట్టలో ఉన్న 130 ఎకరాల భూమిని లే ఔట్ చేసి విక్రయించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించగా దీనికి సంబంధించి గ్రీన్‌సిగ్నల్ కూడా వచ్చినట్టుగా సమాచారం. అయితే ఈ లే ఔట్‌ను అభివృద్ధి చేపట్టాలంటే అటవీ, రక్షణ శాఖల నుంచి ఈభూములకు సంబంధించి క్లియరెన్స్ రావాలని, త్వరలో అది వచ్చే అవకాశం ఉందని హెచ్‌ఎండిఏ అధికారులు పేర్కొంటున్నారు. క్లియరెన్స్ రాగానే ఈ సంవత్సరంలోనే లే ఔట్ పనులను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
ఐటి ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలా
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో మొత్తం 130 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని బైరానిగుట్ట అని పిలుస్తారు. ఈ భూములు ఉన్న ప్రాంతం పక్కనే చిలుకూరు రక్షిత అటవీ భూములున్నాయి. మరోవైపు రక్షణ శాఖ స్థలాలు, ఇంకోవైపు మూసీనది ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటవీ, రక్షణల నుంచి ఎన్‌ఓసీ కోసం ఇప్పటికే హెచ్‌ఎండిఏ దరఖాస్తు చేసుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే తమకు అనుకూలంగా ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా హెచ్‌ఎండిఏ పేర్కొంటుంది. గతంలో కోకాపేట, ఖానామెట్ భూములను టిఎస్‌ఐఐసి సహకారంతో హెచ్‌ఎండిఏ వేలం వేయగా ఈ భూములను కూడా అలాగే వేలం వేయాలని ప్రభుత్వం హెచ్‌ఎండిఏకు సూచించినట్టుగా తెలిసింది. ఈ భూములకు అతి దగ్గరలోనే ఐటి కంపెనీలు ఉండడం, అయితే ఈ కంపెనీల్లో పనిచేసే ఐటి ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలా ఈ లే ఔట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు టౌన్‌షిప్‌ల నిర్మాణాన్ని కూడా చేపట్టాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించినట్టుగా సమాచారం.
పెద్ద బిట్లు సాఫ్ట్‌వేర్ సంస్థలకు
ఈ లే ఔట్‌ను విక్రయించడం ద్వారా సుమారుగా రూ. 5వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. మొత్తం లే ఔట్‌గా చేసి పెద్ద బిట్లను సాఫ్ట్‌వేర్ సంస్థలకు విక్రయించి, మిగిలిన భూమిలో ఐటి ఉద్యోగుల కోసం టౌన్‌షిప్‌ల నిర్మాణాన్ని చేపట్టాలని హెచ్‌ఎండిఏ భావిస్తున్నట్టుగా తెలిసింది. అయితే గత సంవత్సరం జూలైలో కోకాపేట, ఖానామెట్‌లో నిర్వహించిన భూముల ఈ వేలానికి అధిక ధర పలగ్గా ప్రస్తుతం ఇక్కడ కూడా అంతకన్నా ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.