Friday, December 20, 2024

నియో పాలిస్ నయా రికార్డు

- Advertisement -
- Advertisement -

కోకాపేటలో వేలం పాట రికార్డుల మోత మోగింది. నియోపాలిస్ లే ఔట్‌లోని ప్లాట్లను సొంతం చేసుకోవడానికి ప్రముఖ సంస్థలు పోటీ పడ్డాయి. కోకాపేట భూములకు వేలంలో అధిక ధర పలకడంతో మ రోసారి కోట్లను కొల్లగొట్టాయి. నియోపాలిస్ భూములకు సంబంధించి వేలంలో ఏకంగా ఎకరం భూమి వందకోట్లను కొల్లగొట్టింది. షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సిసి, మైహోం, రాజ్‌పుష్పా తదితర ప్రముఖ రియల్ సంస్థలు ఈ వేలంలో పాల్గొనగా 2021 సంవత్సరంలో జరిగిన వేలంలో పలికిన ధర కన్నా గురువారం జరిగిన వేలంలో ఎకరా కు అత్యధికంగా రూ.100.75 కోట్ల ధర పలకడం విశేషం. 2021 లో ఇదే లే అవుట్‌లో జరిగిన మొదటి విడత వేలంలో 50 ఎకరాల విస్తీర్ణం గల 8 ప్లాట్లను ప్రభుత్వం విక్రయించగా అప్పట్లో అత్యధిక ధర ఎకరానికి రూ.60.2 కోట్లు పలకగా, ఈ 8 ప్లాట్లకు గాను సు మారు రూ.2వేల కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం గురువారం రెండో విడతలో జరిగిన వేలంలో ఎకరానికి రూ.100.75 కోట్ల అ త్యధిక ధర పలకగా, కనిష్ట ధర రూ.67.25లు పలికింది. మొత్తం 45.33 ఎకరాలకు గాను సుమారుగా రూ.3319.60 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.

కనిష్ట ధర రూ.67.25 కోట్లు
కోకాపేట నియోపాలిస్ లే ఔట్ ఫేజ్-2 లోని 6, 7, 8, 9వ నంబర్ ప్లాట్లకు గురువారం మధ్యాహ్నం నుంచి నిర్వహించిన వేలం ద్వారా (26.86 ఎకరాలకు) గాను రికార్డు స్థాయిలో రూ.1532.50 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. గురువారం సాయంత్రం నుంచి 10,11,14 నెంబర్ ప్లాట్లకు (18.47 ఎకరాలకు) గాను హెచ్‌ఎండిఏ వేలం నిర్వహించింది. ఈ సందర్భంగా 10 నెంబర్ ప్లాట్ అత్యధికంగా రూ.100.75 కోట్ల ధర పలికింది. 10 నెంబర్ ప్లాట్ మొత్తం 3.6 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్లాట్‌ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రాజ్‌పుష్ప దక్కించుకుంది. 7.53 ఎకరాల విస్తీర్ణంలోని 11వ ప్లాట్‌లోని ఎకరం ధర అత్యల్పంగా రూ.67.25 కోట్ల ధర పలికింది. 10 నెంబర్ ప్లాట్‌కు వచ్చిన ధర హైదరాబాద్‌లో ఇప్పటివరకు వచ్చిన అత్యధిక ధర అని రియల్ రంగ నిపుణులు పేర్కొన్నారు.

కొన్ని ప్లాట్లకు రూ.72కోట్ల ధర
ప్రభుత్వం కనీసం నిర్ణయించిన నిర్దేశిత ధర ఎకరాకు రూ.35కోట్లు ఉండగా పదో నంబర్ ప్లాట్‌కు గరిష్ఠంగా రూ.100 కోట్లకు పైగా ధర పలికింది. కొన్ని ప్లాట్లకు రూ.72కోట్లకు పైగా ధర పలకగా, కనిష్టంగా రూ.67.25 కోట్లు పలికిందని అధికారులు తెలిపారు.ఈ లే ఔట్‌లో భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. కోకాపేటలో నియోపాలిస్ పేరుతో హెచ్‌ఎండిఏ 500 ఎకరాల్లో లే ఔట్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రూ.450 కోట్లతో రహదారులతో పాటు తాగునీరు, మురుగు నీటి వ్యవస్థ, భారీ కేబుళ్ల కోసం ప్రత్యేక మార్గం ఇతర అన్ని రకాల సదుపాయాలను హెచ్‌ఎండిఏ కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News