Sunday, April 6, 2025

సర్వర్ డౌన్..!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) సర్వర్ డౌన్ అయింది. దీంతో ఆన్‌లైన్ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే హెచ్‌ఎండిఏ వెబ్‌సైట్ కూడా పనిచేయడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పెండింగ్ ఫైళ్లు పేరుకుపోతున్నాయని దరఖాస్తుదారులు హెచ్‌ఎండిఏ కార్యాలయానికి క్యూ కడుతుండగా, ప్రస్తుతం సర్వర్ డౌన్ కావడంతో మరింత ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. సర్వర్ డౌన్ గురించి అధికారులను వివరణ కోరగా గురువారంలోగా సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొనడం గమనార్హం. కాగా, సర్వర్ డౌన్ కావడం తో హెచ్‌ఎండిఏ వెబ్‌సైట్‌లో నగర వ్యాప్తంగా ఉన్న చెరువుల డేటా కనిపించకుండా పోయింది. నగరంలో ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చి వేస్తున్న సమయంలో హెచ్‌ఎండిఏ సర్వర్ డౌన్ కావడం అందులో చెరువుల డేటా కనిపించకుండా పోవడంతో ప్రస్తుతం ఈ అంశం సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది.

కమిషనర్ లాగిన్‌లో పేరుకుపోతున్న ఫైళ్లు…
ప్రస్తుతం హెచ్‌ఎండిఏ కమిషనర్ లాగిన్‌లోనూ పలు పైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని క్లియర్ చేయడంలో ఆలస్యం జరుగుతుందని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. కమిషనర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సర్పరాజ్ అహ్మద్ బిజీబిజీగా గడుపుతుండడంతో పాటు ప్రస్తుతం ఆయనకు హెచ్‌జిసిఎల్ అదనపు బాధ్యతలను అప్పగించడంతో హెచ్‌ఎండిఏ దరఖాస్తులు మరింత ఆలస్యం అవుతున్నాయని దరఖాస్తు దారులు వాపోతున్నారు. ఇదే విషయమై కమిషనర్‌ను కలిసి తమ గోడును విన్నవించుకుందామంటే కూడా ఆయన టైం ఇవ్వడం లేదని మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు వేచి చూసినా ఆయన కలవడానికి సమయం ఇవ్వడం లేదని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫోన్‌లోనూ ఆయన అందుబాటులోకి రావడం లేదని ఇలా అయితే దరఖాస్తులను అధికారులు ఎలా క్లియర్ చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. డైరెక్టర్ స్థాయి వరకు దరఖాస్తుదారులను కలుస్తున్నా కమిషనర్‌ను కలవాలంటే తమకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు.

దాదాపుగా 200 ఫైళ్లు పెండింగ్‌లో…..
దాదాపుగా 200 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని హెచ్‌ఎండిఏ అధికారులు పేర్కొంటుండగా, అసలు ఫైళ్లలో కదలిక లేదని బిల్డర్లు వాపోతున్నారు. హైడ్రా రంగంలోకి దిగినప్పటి నుంచి అసలు ఫైళ్లకు మోక్షం కలగడం లేదని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సైట్‌లను చూడడానికి అధికారులు వచ్చేవారని ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు చేపట్టినప్పటి నుంచి సైట్‌లను చూడడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారని, ఇలా అయితే తాము ఎలా నిర్మాణాలను చేపట్టాలని, ఎప్పుడు కొనుగోలుదారులకు అప్పచెప్పాలని బిల్డర్లు ప్రశ్నిస్తున్నారు. కనీసం తమ ఫైళ్లకు ఎందుకు మోక్షం కలగడం లేదన్న విషయమై కమిషనర్‌ను కలిసి తమ గోడును విన్నవించుకోవాలన్నా ఆయన కూడా తమకు సమయం ఇవ్వడం లేదని, గంటల తరబడి ఆయన ఛాంబర్ ముందు నిలబడినా ఆయన కలవడం లేదని బిల్డర్లు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News