ముంబై మహానగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఘట్‌కోపర్ ప్రాంతంలో హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఘట్‌కోపర్ లో ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే వెంబడి ఉన్న పెట్రోలు బంక్ పై ఈదురుగాలుల తీవ్రతకు ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో తొలుత 35 మందికి తీవ్ర గాయాలు కాగా.. మరో 100 మంది.. హోర్డిండ్ కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోర్డింగ్ కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు.
వంద అడుగుల ఎత్తుతో ఉన్న ఇనుప హోర్డింగ్ విరిగికిందపడటంతో పెను ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిలో 14మంది మృతి చెందారు. దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కాగా, సోమవారం ధూళీ తుఫాన్, ఈదురు గాలులు ముంబైలో బీభత్సం సృష్టించాయి.