జకర్తా: ఆసియా కప్ హాకీలో భాగంగా శనివారం జరిగిన సూపర్4 మ్యాచ్‌లో భారత్ 2-1 గోల్స్ తేడాతో జపాన్‌ను ఓడించింది. ఈ విజయంతో లీగ్ దశలో జపాన్ చేతిలో ఎదురైన పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో భారత్ అసాధారణ ఆటతో విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఇటు జపాన్ అటు భారత్ సర్వం ఒడ్డి పోరాడాయి. ఇరు జట్లు కూడా వరుస దాడులతో గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. ఆట ఆరంభమైన ఏడో నిమిషంలోనే మంజీత్ సింగ్ భారత్‌కు గోల్ సాధించి పెట్టాడు. దీంతో భారత్ మరింత దూకుడుగా ఆడింది. మరోవైపు స్కోరును సమం చేసేందుకు జపాన్ తీవ్రంగా పోరాడింది. చివరికి కొద్ది సేపటిలో ప్రథమార్ధం ముగుస్తుందనగా జపాన్ గోల్ చేసి స్కోరును సమం చేసింది. ఇక ద్వితీయార్ధంలో పవన్ రాజ్‌భార్ అద్భుత గోల్‌ను సాధించాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్న భారత్ 2-1 తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
Hockey Asia Cup 2022: India win in Super 4 against Japan