గుప్కార్ కూటమి డిమాండ్
శ్రీనగర్: రాష్ట్ర హోదా పునరుద్ధరించిన తర్వాతే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని గుప్కార్ కూటమి కేంద్రాన్ని డిమాండ్ చేసింది. 2019 ఆగస్టులో జమ్మూకాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడమేగాక, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విడదీసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఇటీవల ప్రధాని మోడీ అధ్యక్షతన జమ్మూకాశ్మీర్ నేతలతో జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత ఆశించిన పరిణామాలేమీ జరగలేదని కూటమి అసంతృప్తి వ్యక్తం చేసింది. విశ్వాసం పాదుగొలిపే చర్యలేమీ తీసుకోలేదని ఆక్షేపించింది. కాశ్మీర్‌కు చెందిన రాజకీయ ఖైదీలను ఇంకా విడుదల చేయకపోవడాన్ని తప్పు పట్టింది.
జూన్ 24న అఖిలపక్ష భేటీ అనంతరం మొదటిసారిగా గుప్కార్ కూటమి నేతలు శ్రీనగర్‌లో సమావేశమై ఈ ప్రకటన విడుదల చేశారు. సమావేశానికి పిడిపి అధినేత్రి మెహబూబాముఫ్తీ, కూటమి అధికార ప్రతినిధి, సిపిఐ(ఎం) నేత ఎంవై తరిగామి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా హాజరయ్యారు. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకాశ్మీర్‌లో త్వరలోనే డిలిమిటేషన్ కమిటీ సందర్శించనున్నది. అసెంబ్లీ స్థానాల పునర్విభజన అనంతరం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈలోగా రాష్ట్ర హోదా ఇస్తారా.? లేదా..? అన్నదానిపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రాలేదు.