ఫీవర్ సర్వే ఫలితాలను విశ్లేషించి ప్రత్యక్ష బోధనపై నిర్ణయం
నేటి నుంచి 8,9,10 తరగతులు ఆన్‌లైన్ క్లాసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు మరోసారి సెలవులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించగా, కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో సెలవులను ఈ నెల 30 వరకూ ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రంలో పరిస్థితి బాగుంటే 31 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభించాలని భావించారు. అయితే తాజాగా ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి సర్వేలో పిల్లల్లో కొవిడ్ లక్షణాలు, ఇతర జ్వర లక్షణాలు ఉన్నట్లు గుర్తించినటుల తెలిసింది. పాఠశాలలు తెరిచినా తలిదండ్రులు విద్యార్థులను పంపించకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతునాయి. ఈ నేపథ్యంలో 8,9,10 తరగతుల విద్యార్థులకు సోమవారం ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు కొంతకాలం పాటు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించి, ఇంటర్, డిగ్రీ, యూనివర్సిటీ స్థాయిలో ఈ నెల 31 తర్వాత ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.15 ఏళ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకుని తరగతులను హాజరయ్యేలా అనుమతించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఫీవర్ సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో సర్వే ఫలితాలను విశ్లేషించి, కొవిడ్ కేసులు, తీవ్రతను పరిశీలించి మరో రెండు మూడు రోజుల్లో విద్యాసంస్థల పునఃప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.