రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కరోనా నేపథ్యంలో చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం నుంచి ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 20 వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపరాదని ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాంతో సెలవులను కూడా మొదట 20వ తేదీ వరకు పొడిగిస్తారని భావించారు. కాగా, రాష్ట్రంలో కొవిడ్ కేసుల పెరుగుదల దృష్టా ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
నేటి నుంచి ఒయు, జెఎన్‌టియుహెచ్‌లో ఆన్‌లైన్ తరగతులు
రాష్ట్రంలో ఈ నెల 30 వరకు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు పొడిగించిన నేపథ్యంలో సోమవారం నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం, జెఎన్‌టియుహెచ్ యూనివర్సిటీలు నిర్ణయించాయి. ఈనెల 30 వరకు ఒయు పరిధిలో ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయని వర్సిటీ తెలిపింది. డిగ్రీ, పిజి తరగతులకు ఆన్‌లైన్ తరగతులు ఉంటాయని పేర్కొంది. అలాగే జవహార్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో పరిధిలోనూ సోమవారం నుంచి ఈ నెల 22 వరకు ఆన్‌లైన్ తరగతులు ఉంటాయని జెఎన్‌టియుహెచ్ అధికారులు తెలిపారు. బీటెక్, ఎంబిఎ, ఎంసిఎ, ఫార్మా కోర్సులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని మిగతా యూనివర్సిటీలు కూడా త్వరలోనే ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాఠశాల, ఇంటర్ విద్యార్థులకూ ఆన్‌లైన్ తరగతులు..?
రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించింది. మరో రెండు వారాలు రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు సమీక్షించి కేసులు తగ్గకపోతే పూర్తిగా మళ్లీ ఆన్‌లైన్ తరగతులు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 30 వరకు కూడా ఇంటర్ విద్యార్థులతో పాటు పాఠశాల విద్యార్థులకూ ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు ఆయా విభాగాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఏప్రిల్ లేదా మే నెలల్లో వార్షిక పరీక్షలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం జనవరి నెలలో రెండు వారాలు ముగియగా, వార్షిక పరీక్షలకు మరో రెండు మూడు నెలల గడువు మాత్రమే ఉంటుంది.
ఈ నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు మాత్రం ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. అవసరమైతే ఒకటి నుంచి 9 తరగతుల విద్యార్థులకు పూర్తిగా ఆన్‌లైన్ తరగుతులు కొనసాగించి పది, ఇంటర్ విద్యార్థులకు ఈ నెల 30 తర్వాత ప్రత్యక్ష బోధనకు అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరిగితే పది, ఇంటర్ విద్యార్థులకు విద్యాసంస్థల్లో భౌతిక దూరం పాటిస్తూ, బెంచీకి ఒకరు చొప్పున, తరగతి గదిలో 20 మంది మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టి ప్రత్యక్ష బోధనకు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.