లాస్ ఎంజిల్స్: ప్రముఖ హాలీవుడ్ నటుడు వాల్ కిల్మెర్(65) కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మంగళవారం న్యూమోనియాతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కూతురు మెర్సిడీస్ ధృవీకరించారు. 1986లో వచ్చిన టాప్‌గన్ అనే సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 1995లో వచ్చిన ‘బ్యాట్‌మెన్ ఫరెవర్’ చిత్రంలో బ్రూస్ వేన్(బ్యాట్‌మ్యాన్) పాత్రలో నటించిన ఆయన సినీ ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేశారు.
1959 డిసెంబర్ 31వ తేదీన జన్మించిన వాల్ కిల్మెర్ హాలీవుడ్ ప్రొఫెనల్ స్కూల్, జూలియార్డ్ స్కూలో శిక్షణ తీసుకున్నారు. పలు యానిమేటడ్ చిత్రాలకు ఆయన డబ్బింగ్ కూడా చెప్పారు. ఆ తర్వాత నటనలోకి వచ్చారు. టోంబ్ స్టోన్, ట్రూ రొమాన్స్, హిట్, ద గోస్ట్ అండ్ ద డార్క్‌నెస్ తదితర చిత్రాల్లో కూడా నటించి కిల్మెర్.. ప్రేక్షకులను అలరించారు. ఆయనకు వాహల్లేతో 1988లో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 1996లో విడాకులు తీసుకున్నారు. వీరికి కూతురు మెర్సిడీస్, కుమారుడు జాక్ ఉన్నారు. కిల్మెర్ నటించిన చివరి చిత్రం ‘టాప్ గన్ మావరిక్’ మంచి విజయాన్ని సాధించింది. వాల్ కిల్మెర్ మృతితో ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.