మెగా హీరో వరుణ్‌తేజ్, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయింది. అయితే పరిస్థితులు చక్కబడిన వెంటనే సెట్స్ పైకి వెళ్ళడానికి చిత్ర బృందం రెడీగా ఉంది. దీని కోసం సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. ‘గని’ కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో ఒక భారీ స్టేడియం సెట్‌ను నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ సెట్లో సినిమాకే హైలైట్‌గా నిలవనున్న హై ఇంటెన్సిటీ బాక్సింగ్ ఎపిసోడ్‌ని చిత్రీకరించనున్నారు. ఈ భారీ ఎపిసోడ్ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్‌లను తీసుకొస్తున్నారు. వీరిద్దరూ ఇంతకు ముందు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన స్పోర్ట్ డ్రామా ‘సుల్తాన్’ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం వర్క్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు మొదటిసారి తెలుగు చిత్రానికి పని చేయనున్నారు. వరుణ్ తేజ్ ‘గని’ చిత్రం కోసం బాక్సింగ్ శిక్షణ తీసుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించడం కోసం స్పెషల్ డైట్‌ను పాటిస్తూ రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేస్తున్నాడు.
ఈ లాక్‌డౌన్ సమయాన్ని ఉపయోగించుకొని మరింతగా శ్రమిస్తున్నాడని తెలిసింది. ఇప్పటికే విడుదలైన వరుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, విలక్షణ నటుడు జగపతిబాబు, నదియా, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ పిక్చర్స్ పతాకాలపై అల్లు బాబీ, సిద్ధు ముద్ద కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 30న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇంతకుముందు ప్రకటించారు. కానీ పరిస్థితులు చూస్తుంటే సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Hollywood Stunt Choreographers for Ghani Movie