హైదరాబాద్: మభ్యపెట్టి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన హోంగార్డుపై హైదరాబాద్ జిల్లాలోని ఈస్ట్ మారేడ్ పల్లి ప్రాంతం తుకారాంగేట్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోపాలపురం ఎసిపి వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం………. అడ్డగుట్టలో నివాసముండే బి.మల్లికార్జున(40) హోంగార్డుగా పని చేస్తున్నాడు. హైదరాబాద్ సిసిఎస్ లో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆయనకు పరిచయమైన బాలిక(16)ను కొద్ది రోజుల కిందట నమ్మించి అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను ఎవరికి చెప్పొద్దని భయపెట్టాడు. బాలికకు రెండు రోజుల కిందట ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి హోంగార్డును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాను నేరం చేశానని ఒప్పుకోవడంతో హోంగార్డును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.