హైదరాబాద్ : హైదరాబాద్ నగరం మహిళలకు సురక్షితమని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ షీటీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షీటీమ్స్ 2కె, 5కె రన్‌ను నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం హోంమంత్రి మహమూద్‌అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అడిషనల్ డిజి స్వాతిలక్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ ఈవ్‌టీజర్ల గుండెల్లో దడపుట్టించేందుకు షీటీమ్స్‌ను 2014లో ప్రారంభించామని తెలిపారు. మహిళల రక్షణకు పెద్ద పీటవేసేందుకు దీనిని ప్రారంభించామని తెలిపారు. భారతదేశంలో నివసించడానికి హైదరాబాద్ ఉత్తమమైన నగరమని, ఇక్కడ మహిళలు క్షేమంగా ఉంటున్నారని తెలిపారు. మహిళా దినోత్సవం రోజున నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌కు మహిళను ఎస్‌హెచ్‌ఓగా నియమించనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు.
మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తునే అన్ని రంగాల్లో దూసుకువెళ్తున్నారని అన్నారు. వారి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. 80మంది ఎప్సైలు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో రిపోర్ట్ చేశారని, వారందరికీ సరైన విధంగా శిక్షణ ఇచ్చి కీలక స్థానాల్లో నియమిస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తునే ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అలర్ట్‌గా ఉండాలని కోరారు. ఏవైనా సంఘటనలు ఎదురైతే ఎలా వ్యవహరించాలో పోలీసులకు ఇప్పటికు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్న తాన్యా బేగంకు రివార్డు అందజేశారు. సిపి చేతుల మీదుగా రివార్డు అందుకోవడం సంతోషంగా ఉందని తాన్యా బేగం అన్నారు. కార్యక్రమంలో నగర అదనపు పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్, క్రైం సిపి ఎఆర్ శ్రీనివాస్, జాయింట్ పోలీస్ కమిషనర్లు విశ్వప్రసాద్, ఎం. రమేష్ రెడ్డి, కార్తికేయ, అడిషనల్ డిసిపి శిరీష రాఘవేంద్ర, సిపి శ్రీపూర్ణ చందర్ పాల్గొన్నారు.