కూటమి పూర్తి కాలం అధికారంలో ఉంటుంది
2029లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎన్‌డిఎయే
అమిత్ షా స్పష్టీకరణ
చండీగఢ్ : కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం బలం గురించి ప్రశ్నలు లేవదీస్తున్నందుకు ప్రతిపక్షాలను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తూర్పారబట్టారు. ఎన్‌డిఎ తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడమే కాకుండా 2029లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. 24/7 మణిమజ్రా నీటి సరఫరా ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసిన అనంతరం సభలో ప్రసంగిస్తూ అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతిపక్షాలు ఏమి చెప్పదలచుకున్నా మీకు కలవరం అనవసరమని హామీ ఇవ్వదలిచాను. 2029లో కూడా ఎన్‌డిఎ (అధికారంలోకి) వస్తుంది, (నరేంద్ర) మోడీజీ వస్తారు’ అని అమిత్ షా చెప్పారు. ‘ఏవో కొన్ని విజయాలతో తాము ఎన్నికల్లో గెలిచామని వారు (ప్రతిపక్షాలవారు) భావిస్తున్నారు.
మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లభించిన సీట్ల సంఖ్య కన్నా ఎక్కువగానే బిజెపి ఈ ఎన్నికల్లో (2024 లోక్‌సభ ఎన్నికలు) గెలిచిందని వారికి తెలియదు. వారికి ఆ విషయం తెలియదు. ఎన్‌డిఎలోని ఒకే ఒక సభ్య పక్షం బిజెపికి వారి మొత్తం కూటమికి గల మొత్తం సీట్ల సంఖ్య కన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి. అస్థిరత సృష్టించాలని అనుకుంటున్న ఆ నేతలు ఈ ప్రభుత్వం నడవదని పదే పదే అంటున్నారు’ అని హోమ్ శాఖ మంత్రి చెప్పారు. ‘ఈ ప్రభుత్వం తన ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేయడమే కాకుండా తదుపరి పదవీ కాలం కూడా ఈ ప్రభుత్వానిదేనని ప్రతిపక్ష మిత్రులకు హామీ ఇవ్వదలిచాను. ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉండండి, ప్రతిపక్షంలో సమర్థంగా పని చేయడం నేర్చుకోండి’ అని అమిత్ షా అన్నారు.