Monday, December 23, 2024

భేతాళకథ

- Advertisement -
- Advertisement -

ఉత్తుత్తి భేటీలతో సాగుతున్న

విభజన సమస్యలకు పరిష్కారం చూపలేక
మొక్కుబడి సమావేశాలతో నడిపిస్తున్న కేంద్రం

25న జరిగే కేంద్ర హోంశాఖ కార్యదర్శితో భేటీపై పెదవి విరుస్తున్న తెలుగు రాష్ట్రాల అధికారులు

విభజన సమస్యలపై బోనులో కేంద్రం చిత్తశుద్ధి
ఆర్థికపరమైన అంశాలపై స్పష్టత లేని కేంద్రం
పునర్విభజన చట్టంపై అవగాహన కొరవడినకేంద్ర హోంశాఖ అధికారులు
ప్రతి సమావేశానికి అక్కడి నుంచి ఒక్కో కొత్త అధికారి
కేవలం వాదనలు విని వెళ్లిపోతున్న వైనం
కేంద్ర హోంమంత్రిగాని, ప్రధాని గాని తలచుకుంటేగాని మార్పు సున్నా
కేంద్రం వైఖరితో విసిగిపోయిన ఉభయ రాష్ట్రాలు

వాస్తవానికి ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ విభజన, ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల వినియోగంలో తలెత్తిన వివాదాలు, పన్నుల వసూళ్ళు-పన్నుల ఆదాయంపైన నెలకొన్న వివాదాల పరిష్కారం, తెలుగు రాష్ట్రాల బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు నిల్వల పంపకాలపై నెలకొన్న వివాదాల పరిష్కారం, ఏపీఎస్‌సిఎసిఎల్, టీఎస్‌సిఎస్‌సిఎల్ సంస్థల మధ్య నగదు ఖాతాల విభజన, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివిధ వనరుల పంపిణీ, ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాల్లోని ఏడు జిల్లాల ప్రత్యేక గ్రాంటు నిధులు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల్లో రాయితీలపైన ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించాల్సి ఉంది.

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖ ఈనెల 25వ తేదీన జరుపతలపెట్టిన సమావేశంపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పెదవి విరుస్తున్నారు. విభజనానంతరం తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదని ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కేంద్రం నటించడం కోసమే ఈనెల 25వ తేదీన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరుగుతుందని, ఈ సమావేశం మొక్కుబడిగానే జరుగుతుందని తమకు చాలా స్పష్టంగా తెలుసునని, అయినప్పటికీ సమావేశానికి హాజరవుతామని ఆ అధికారులు తెలిపారు.

తపకుండా తమ వాదనలను మరోసారి వినిపిస్తామని, వెనక్కు తగ్గే ప్రసక్తేలేదని ఇరు రాష్ట్రాల ఆర్ధికశాఖల ఉన్నతాధికారులు అంటున్నారు. ముఖ్యంగా ఆర్ధికపరమైన అంశాల్లో నెలకొన్న సమస్యలపై కేంద్రానికే స్పష్టతలేదని, హోంమంత్రిత్వశాఖలో నేడున్న అధికారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014పైన పూర్తిగా అవగాహన లేదని, ఎవ్వరైనా అధికారులు విభజన చట్టంపై అవగాహన తెచ్చుకునే లోపునే కేంద్రం బదిలీలు చేస్తోందని, దాంతో ఒక్కొక్క మీటింగ్‌కు ఒక్కో అధికారి కొత్తకొత్తగా వస్తున్నారని, ఇలాగైతే సమస్యలు ఎప్పుటికి పరిష్కారమవుతాయో ఎవ్వరికీ తెలియదని ఆ అధికారులు విమర్శిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కొన్ని స్పష్టమైన ఆదేశాలను న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా జారీ చేయగలిగే పరిస్థితి కేంద్ర హోంశాఖాధికారులకు లేదని, ఆంధ్రప్రదేశ్ వాదనలను బలపరిస్తే తెలంగాణ రాష్ట్రం న్యాయపోరాటాలకు దిగుతుందని, అలాగని తెలంగాణ వాదనలను బలపరిస్తే ఏపీ ప్రభుత్వం న్యాయపోరాటాలకు దిగుతుందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన, న్యాయసమ్మతమైన విధంగా పెద్దరికం చేయగలిగే పరిస్థితులు కేంద్ర హోంశాఖకు లేవని, తెలుగు రాష్ట్రాల విభజన చట్టాన్ని అవగతం చేసుకొన్న అధికారులు లేరని అంటున్నారు. అవగాహనా లోపంతో ఏ నిర్ణయం తీసుకొన్నా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకతలను చవిచూడాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతోనే కేంద్ర హోంశాఖాధికారులు మొక్కుబడిగానే సమావేశాలు నిర్వహిస్తూ రెండు రాష్ట్రాల వాదనలను వినడానికి మాత్రమే ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆ అధికారులు వివరించారు.

అందుకే ఈనెల 25వ తేదీన జరుగబోయే సమావేశంలో ఏవో అండపిండ బ్రహ్మాండాలు జరుగుతాయనే భ్రమలు తమకు లేవని, మీటింగ్‌లు జరిపామని రికార్డుల్లో రాసుకోవడానికి మాత్రమే కేంద్ర హోంశాఖ అధికారులు సమావేశాలు జరుపుతున్నారని, తాము కూడా కేంద్రం పరిస్థితిని అర్ధంచేసుకొని వారికి తగినట్లుగానే వ్యవహరిస్తున్నామని ఆ అధికారులు కుండబద్దలు కొట్టారు. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ అధ్యతన జరుగబోయే ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, ఆర్ధికశాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొంటారు. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలన్నీ ఆర్ధికపరమైనవని, ఇందులో వేల కోట్ల రూపాయల నిధులను ఇచ్చిపుచ్చుకునే అంశాలున్నాయని, వీటిల్లో ఇరు రాష్ట్రాల వాదనలు బలంగానే ఉన్నాయని, అందుచేత ఈ అంశాలు అధికారుల స్థాయిల్లో కాకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్ర హోంశాఖ మంత్రి గానీ ప్రధానమంత్రిగానీ కల్పించుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ అధికారులు అంటున్నారు.

అధికారుల స్థాయిల్లో ఎలాంటి తుది నిర్ణయాలు వెలువడే అవకాశమే లేదని కరాఖండిగా చెబుతున్నారు. అందుచేతనే ఈనెల 25వ తేదీన జరుగబోయే సమావేశంలో కూడా ఎలాంటి తుది నిర్ణయాలు వెలువడే అవకాశాలు లేవని అంటున్నారు. వాస్తవానికి ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ విభజన, ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల వినియోగంలో తలెత్తిన వివాదాలు, పన్నుల వసూళ్ళు-పన్నుల ఆదాయంపైన నెలకొన్న వివాదాల పరిష్కారం, తెలుగు రాష్ట్రాల బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు నిల్వల పంపకాలపై నెలకొన్న వివాదాల పరిష్కారం, ఏపీఎస్‌సిఎసిఎల్, టీఎస్‌సిఎస్‌సిఎల్ సంస్థల మధ్య నగదు ఖాతాల విభజన, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివిధ వనరుల పంపిణీ, ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాల్లోని ఏడు జిల్లాల ప్రత్యేక గ్రాంటు నిధులు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల్లో రాయితీలపైన ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించాల్సి ఉంది. కృష్ణానదీ జలాల వినియోగంలో తలెత్తిన వివాదాలను పరిష్కరించడానికి కొత్తగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర జల్‌శక్తి మంత్రి, ప్రధాన మంత్రిలను కలిసి స్వయంగా కోరారు.

అందుకు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన కేసును ఉపసంహరించుకుంటే కొత్తగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర జల్‌శక్తి మంత్రి, ప్రధానమంత్రి, కేంద్ర జల్‌శక్తి మంత్రి హోదాల్లోని వ్యక్తులు స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే కేసులు ఉపసంహరించుకొన్నామని, అలాంటిది ఇప్పటి వరకూ కొత్తగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేదని తెలంగాణ ఆర్ధికశాఖలోని ఉన్నతాధికారులు వివరించారు. ఇలా అత్యంత కీలకమైన అంశాల్లో కేంద్ర ప్రభుత్వమే మాట తప్పిందని, ఇక హోంశాఖలోని ద్వితీయ శ్రేణి అధికారుల స్థాయిలో జరిగే సమావేశంలో సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి? అని రెండు ఆ సీనియర్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అసలుసిసలు మొదటి తప్పు కేంద్రం దగ్గరే ఉన్నప్పుడు రాష్ట్రాలకు ఏ విధమైన ఆదేశాలు జారీ చేస్తుంది? అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈనెల 25వ తేదీన జరుగబోయే సమావేశంలో సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం, భ్రమలు తమకు లేవని అంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News